కాత్యాయనికి కేంద్ర సాహిత్య అవార్డు | literary award to kathyam | Sakshi
Sakshi News home page

కాత్యాయనికి కేంద్ర సాహిత్య అవార్డు

Published Thu, Dec 19 2013 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

కాత్యాయనికి కేంద్ర సాహిత్య అవార్డు

కాత్యాయనికి కేంద్ర సాహిత్య అవార్డు

 సాక్షి, న్యూఢిల్లీ/వరంగల్: ప్రముఖ తెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు, కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే(58) ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ‘సాహిత్యాకాశంలో సగం-స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం, కథ’ అనే సాహిత్య విమర్శ గ్రంథానికి గాను ఆమెకు ఈ పురస్కారం దక్కింది. 22 భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ-2013 పురస్కారాలకు ఎంపికైన రచయిత పేర్లను బుధవారమిక్కడ అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు వెల్లడించారు. తెలుగు విభాగంలో ప్రొఫెసర్ బన్న ఐలయ్య, ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి, జీఎస్ మూర్తి(విహారి) జ్యూరీగా వ్యవహరించారు. బాలీవుడ్ సినీ రచయిత జావేద్ ఆక్తర్‌కు ఉర్దూ విభాగంలో ‘లావా’ కవితా సంపుటికి గాను అవార్డు దక్కింది.  వచ్చే ఏడాది మార్చి 11న జరిగే అకాడమీ వార్షిక సాహిత్యోత్సవంలో విజేతలను రూ.లక్ష నగదు, తామ్రపత్రంతో సత్కరిస్తారు.
 
 సాహిత్యం, ఉద్యమాలు: కాత్యాయనీ విద్మహే 1955లో ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మైలవరం గ్రామంలో కేతవరపు రామకోటిశాస్త్రి, ఇందిరాదేవి దంపతులకు జన్మించారు. దివంగత రామకోటిశాస్త్రి కూడా కాకతీయ వర్సిటీ తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. తండ్రి వారసురాలిగా కితాబులు అందుకుంటున్న కాత్యాయని విద్యాభ్యాసమంతా వరంగల్‌లో జరిగింది. ఆమె అదే జిల్లాకు చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లును పెళ్లి చేసుకున్నారు. కాకతీయ వర్సిటీలో ఎమ్మే చదివారు. ‘చివరకు మిగిలేది- మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా విమర్శ’పై పీహెచ్‌డీ చేశారు. పలు సాహిత్య, సామాజిక అంశాలపై 285 వ్యాసాలు రాశారు. 275 పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆమె మూడున్నర దశాబ్దాలుగా కాకతీయ వర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. కాత్యాయని వద్ద 11మంది పీహెచ్‌డీ డిగ్రీలు పొందారు. ఆమె ‘తెలంగాణ సాహిత్యం-ప్రాంతీయత’, ‘తెలుగు నవలాకథానిక విమర్శ పరిణామం’, ‘ఆధునిక తెలుగుసాహిత్యం స్త్రీవాద భూమిక’ వంటి ఎన్నో రచనలు చేశారు. పులికంటి కృష్ణారెడ్డి అవార్డు, రంగవల్లి స్మారక పురస్కార ం తదితర అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ర్ట కార్యదర్శిగా, మానవహక్కుల వేదిక సభ్యురాలిగా ఉన్నారు.
 
 ‘సాహిత్యాకాశంలో సగం’ విశిష్టత: కేంద్ర సాహిత్య అకాడమీ గెలుచుకున్న కాత్యాయని ‘సాహిత్యాకాశంలో సగం’లో 28 వ్యాసాలు ఉన్నాయి. ఇది 2010లో వెలువడింది. ‘రాజకీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో స్త్రీల సాహిత్య అధ్యయనం’, ‘ప్రాచీన సాహిత్యం- మరోచూపు’ తదితర వ్యాసాలు ఉన్నాయి. కట్టుబాట్లను ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ, విమల తదితరులు చేసిన రచనలను కాత్యాయని విశ్లేషించారు. పుస్తకాలను అర్థం చేసుకోవడానికి, పఠనానుభూతిని ఇతరులతో పంచుకోవడానికి తాను రచనలు చేశానని ఆమె బుధవారం విలేకర్లతో అన్నారు. వరంగల్ జిల్లా నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్న వారిలో కాత్యాయని రెండోవారు. జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత ‘అంపశయ్య’ నవీన్‌కు 2004లో ఈ అవార్డు వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement