రేపు (శనివారం) చరిత్రాత్మకమైన రోజు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండి అతి పెద్ద ఆర్థిక సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీ (వస్తువులు, సేవల పన్ను) శుక్రవారం అర్థరాత్రి దాటిన క్షణం నుంచి అమల్లోకి వస్తున్న రోజు.
ముంబై: రేపు (శనివారం) చరిత్రాత్మకమైన రోజు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండి అతి పెద్ద ఆర్థిక సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీ (వస్తువులు, సేవల పన్ను) శుక్రవారం అర్థరాత్రి దాటిన క్షణం నుంచి అమల్లోకి వస్తున్న రోజు. ఈ రోజును విజయవంతం చేయడం కోసం ముంబైలోని కస్టమ్స్, ఎక్సైజ్ విభాగాలకు చెందిన ఆడిట్ వింగ్‌లోని దాదాపు 500 మంది ఉద్యోగులు (వీరిని ఇక నుంచి జీఎస్టీ ఉద్యోగులు అని పిలుస్తారు) రేయింబవళ్లు కష్టపడ్డారు. మరో విధంగా చెప్పాలంటే రేయింబవళ్లు భయాందోళనలతో విధులు నిర్వర్తించారు. జీఎస్టీపై దేశవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో దీన్ని అమలు చేయడంలో తామెలా నెట్టుకొస్తామని వారు ఆందోళన చెందలేదు.
పెచ్చులు, పెచ్చులుగా ఊడుతూ, నీటి ధారలను కురిపిస్తున్న భవనం పైకప్పు ఎప్పుడు నెత్తిన కుప్పకూలుతుందోనన్నదే వారి భయాందోళన. వారం క్రితమే సర్వీస్ టాక్స్ విభాగానికి చెందిన డిప్యూటీ కమిషనర్ రోహిత్ సింగ్లా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఇటీవల ఆయన తన ఆఫీసు గదిలో కంప్యూటర్‌పై పనిచేసుకుంటుండగా హఠాత్తుగా భవనం పైకప్పు నుంచి పెద్ద పెచ్చు ఊడి దభేల్‌మంటూ ఆయనకు ఆరు అడుగుల దూరంలో కూలింది. అదే రోజు అదే ధారవి అఫీసు భవనంలోని సమావేశ మందిరం పైకప్పు పూర్తిగా నేల కూలింది. మరో రోజు ఓ ఉద్యోగి నెత్తిన పెచ్చు కూలడంతో అతను స్వల్పంగా గాయపడ్డారు. అసలు ఆ భవనానికి ఓ పక్కన విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఈ ఇబ్బందులు చాలవన్నట్లు వర్షం కురిసిన రోజు కప్పు లీకుల్లో నుంచి నీరు ధారలుగా కారుతుంది.
షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుందేమోనన్న భయంతో గత రెండు రోజులగా తాను ఆ వైపున్న కంప్యూటర్‌పై పనిచేయలేదని ఓ అధికారి వెల్లడించారు. తలచుకుంటే నవ్వొస్తుందిగని కొంత మంది అధికారులు నీళ్లు పడకుండా గొడుగులు పట్టుకొని కంప్యూటర్లపై పనిచేశారని ఆయన తెలిపారు. ఆఫీసు పరిస్థితులు భయానకంగాను, ప్రమాదకరంగా ఉన్నాయని సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శిశిర్ అగ్నిహోత్రి మీడియాకు తెలిపారు. ప్రతి వర్షాకాలంలో తాము ఇలాగే భయాందోళనలతో పనిచేయాల్సి వస్తోందని, డెస్క్‌టాప్‌లు, కంప్యూటర్ మేషీన్లు, ఫ్యాక్స్ మేషీన్లు, కేబుళ్లను ప్లాస్టిక్ కవర్లతో రక్షించుకోవాల్సి వస్తోందని ఆయన వివరించారు.
మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు ఆధీనంలో ఉన్న రెండంతస్తుల భవంతిలో ఈ ఆఫీసు ఉంది. కస్టమ్స్, ఎక్సైజ్ విభాగాల నుంచి ఈ బోర్డుకు అద్దె అందుతుంది. అద్దె తీసుకుంటూ ఎందుకు భవనం మరమ్మతులు చేయించడం లేదంటే భవనం కోర్టు వివాదంలో ఉండడం వల్ల దానిపై డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేదని బోర్డుకు చెందిన అధికారులు చెబుతున్నారు. మరో మంచి భవనంలోకి ఆఫీసును మార్చొచ్చుగదా అని కస్టమ్స్, ఎక్సైజ్ అధికారులను ప్రశ్నిస్తే ముంబై లాంటి నగరంలో అద్దెలు అదిరిపోతున్నాయని, అంత అద్దెలను ప్రభుత్వ ఆఫీసులు భరించలేమని చెబుతున్నారు.
జూలై ఒకటి నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో సీనియర్ అధికారులు గురువారం మధ్యాహ్నం తమ సిబ్బందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. దీనికి ఎంతోమంది ఉద్యోగులు, వారి సంఘాల నాయకులు హాజరై తమ ఆఫీసులున్న భవనం పరిస్థితి గురించి ఎవరూ మాట్లాడలేదు. జీఎస్టీ అమలుకు సంబంధించి ఇప్పటికీ బోలెడంత పని పెండింగ్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు పెండింగ్ పనులను ఎప్పటికి పూర్తి చేస్తారో!