శభాష్.. సర్ఫరాజ్!
గువాహటి: మతసామరస్యం వెల్లివిరిసిన ఘటన ఇది. ప్రతిభకు కులమతాలు ప్రతిబంధకం కాదని పదో తరగతి విద్యార్థి నిరూపించాడు. హిందూ సంస్థ నడుపుతున్న పాఠశాలలో చదవిన ముస్లిం బాలుడు స్టేట్ టాపర్ గా నిలిచాడు. అస్సాంలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వానికి మంచివార్త అందించాడు. అస్సాంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సర్ఫరాజ్ హుస్సేన్ రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ దక్కించుకున్నాడు. 600 మార్కులకు 590 మార్కులు సాధించి ముందంజలో నిలిచాడు.
16 ఏళ్ల సర్ఫరాజ్ దక్షిణ గువాహటిలోని బెక్తుచి ప్రాంతంలోని శంకరదేవ్ శిశు నికేతన్ లో చదివాడు. ఈ పాఠశాలను సంఘ్ పరివార్ కు చెందిన విద్యాభారతి సంస్థ నడుపుతుండడం విశేషం. స్టేట్ టాపర్ గా నిలవడం పట్ల సర్ఫరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. శంకరదేవ్ శిశు నికేతన్ విద్యార్థినని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని, ఈ పాఠశాలలో చదివినందువల్లే తనకు టాప్ ర్యాంక్ వచ్చిందని అన్నాడు. భవిష్యత్ లో ఇంజనీర్ కావాలనుకుంటున్నట్టు చెప్పాడు.
గాయత్రి మంత్రంతో సహా సంస్కృతంలోని పలు శ్లోకాలను ఆలపించడంలో తనకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నాడు. సంస్కృతం ఎస్సే రైటింగ్ పోటీల్లో పలు బహుమతు గెల్చుకున్నాడు. 8వ తరగతి వరకు సంస్కృతంలో వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు. మంచి విద్య అందించాలన్న ఉద్దేశంతోనే తన కొడుకును శంకరదేవ్ శిశు నికేతన్ లో చర్చినట్టు సర్ఫరాజ్ తండ్రి అజ్మాల్ హుస్సేన్ తెలిపాడు.