నాకో అవకాశం ఇవ్వండి
గవర్నర్ విద్యాసాగర్‌రావుకు శశికళ విజ్ఞప్తి
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘పన్నీర్ సెల్వంను నేను బెదిరించలేదు. రాజీనామా లేఖపై ఆయనతో బలవంతం గా సంతకం చేయించలేదు. మీరు రాజ్యాంగాన్ని రక్షించం డి. ప్రజాస్యామ్యాన్ని కాపాడండి. మెజారిటీ ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి’’ అని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసా గర్‌రావును కోరారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను శశికళ గురువారం రాత్రి 7 గంటల సమయంలో చెన్నై మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద ఉంచి, నివాళులర్పించారు.
అనంతరం తన మద్దతుదారులైన మంత్రులు ఉదయ్‌కుమార్, షణ్ముగం, పళనిస్వామి, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సెంగోట్ట య్యన్‌తోపాటు మరికొందరు నేతలతో రాత్రి 7.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. అరగంటపాటు ఆయనతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామా లను వివరించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తనను పార్టీ శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకున్నా రని చెప్పారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమే తనను శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదిం చారని గుర్తుచేశారు. 2 రోజుల తర్వాత ఆయన రాజకీయ స్వప్రయోజనాల కోసం తనపై ఆరోపణలు, విమర్శలు చేశారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం: గవర్నర్
శశికళ తనకు మద్దతుగా సంతకాలు చేసిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందజేశారు. ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని శశికళ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పరిపాలన, రాజకీయ సంక్షోభాన్ని తొలగించేందుకు వెంటనే నిర్ణయం తీసుకోవాలని శశికళతోపాటు రాజ్‌భవన్‌కు వెళ్లిన మంత్రులు, పార్టీ నేతలు గవర్నర్‌ను కోరారు. వీరందరి వాదనలు సావధానంగా విన్న గవర్నర్ అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చి పంపారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు శశికళ నిరాకరించారు.
గవర్నర్ విద్యాసాగర్‌రావుకు పన్నీర్ సెల్వం వినతి
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘పోయెస్‌గార్డెన్‌లో 2 గంటలపాటు శశికళ మద్దతుదారులు నన్ను బెదిరించారు. బలవంతంగా రాజీనామా చేయించారు. శశికళ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయించారు. ఎమ్మెల్యేలు ఆమె నిర్బంధం నుంచి బయటపడితే నాకే మద్దతు ఇస్తారు. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవడానికి నాకో అవకాశం ఇవ్వండి’ అని ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం ఇన్‌చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కోరారు.
తమిళనాడులో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో గవర్నర్ గురువారం సాయంత్రం 4 గంటలకు ముంబై నుంచి చెన్నైలోని రాజ్‌భ వన్‌కు చేరుకున్నారు. శశికళను సీఎం చేయడం కోసం పదవికి రాజీనామా చేయాలని తన మీద ఒత్తిడితెచ్చారని, తనను బెదిరించి రాజీనామా పత్రంమీద బలవంతంగా సంతకం చేయించారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం నోరు విప్పకూడదనుకున్నానని, అయితే అమ్మ సమాధి వద్ద తన మనసులోని బాధ చెప్పుకున్నాక రాష్ట్రాన్ని, పార్టీని కాపాడాలని తన మనసుకు అనిపించి అక్కడే నిజాలు వెల్లడించానని చెప్పుకున్నారు.
శశికళ ఎమ్మెల్యేలను నిర్బంధించి కోట్ల రూపాయలు ఇస్తానని ప్రలోభాలకు గురి చేస్తున్నారని, మాట వినని వారిని బెదిరిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కిడ్నాప్ గురించి తానే స్వయంగా ఫిర్యాదు చేసినా సిటీ పోలీస్ కమిషనర్ జార్జి స్పందించ లేదని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం అసెంబ్లీలో బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. పన్నీర్‌తో 20 నిముషాల పాటు మాట్లాడిన గవర్నర్ అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి పంపారు.
ధర్మమే గెలుస్తుంది: పన్నీర్ సెల్వం
అమ్మ ఆశీస్సులు నాకే ఉన్నాయి. ధర్మమే గెలుస్తుందని ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం ధీమాగా చెప్పారు. గవర్నర్ తో భేటీ అనంతరం ఆయన తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరానన్నారు.