‘క్యాష్ లెస్’కు రాయితీలు ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు 20 నుంచి 40 శాతానికి పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నగదు లావాదేవీలు ఖర్చుతో కూడుకున్నవని, అందుకే క్యాష్ లెస్ లావాదేవీలు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పాత పెద్ద నోట్లు రద్దు చేసి నేటికి నెల రోజులు పూర్తవడంతో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం నగదును అన్ని ప్రాంతాలను ఆర్బీఐ సరఫరా చేస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు పలు రాయితీలు ఇస్తున్నట్టు ప్రకటించారు.
రాయితీలు ఇలా ఉన్నాయి
- డిజిటల్ మోడ్ లో రూ. 2 వేలలోపు చేసే లావాదేవీలపై సర్వీసు టాక్స్ రద్దు
- 10 వేల జనాభా ఉన్న గ్రామాలకు రెండు పీవోఎస్ యంత్రాలు ఉచితం
- పెట్రోల్ ఉత్పత్తులపై కార్డులతో కొనుగోలు చేసేవారికి 0.75 శాతం రాయితీ
- కిసాన్ క్రెడిట్ కార్డులున్న రైతులకు రూపే కార్డులు మంజూరు
- ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ఆన్ లైన్ లో చెల్లిస్తే 8 శాతం ప్రీమియం తగ్గింపు
- కార్డుల ద్వారా కొంటే 0.50 శాతం తక్కువ ధరకు సబర్బన్ రైలు టిక్కెట్లు,
- జనవరి 1 నుంచి ముంబై సబర్బన్ రైళ్లలో అమలు
- డిజిటల్ మనీ ద్వారా కొంటే బుకింగ్ లో 5 శాతం రాయితీ
- ఆన్ లైన్ ద్వారా రైల్వే టిక్కెట్లు కొనుగోలు చేసే వారికి రూ. 10 లక్షల వరకు బీమా
- టోల్ ప్లాజాల వద్ద ఆర్ఎఫ్‌ఐడీ కార్డులతో చెల్లింపులు చేస్తే 10 శాతం రాయితీ