పట్టు చిక్కేదెవరికి..? | Samajwadi Party crisis boils over: Akhilesh Yadav is new party chief, Mulayam Singh expels Ramgopal | Sakshi
Sakshi News home page

పట్టు చిక్కేదెవరికి..?

Published Mon, Jan 2 2017 3:08 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

పట్టు చిక్కేదెవరికి..?

పట్టు చిక్కేదెవరికి..?

వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న అఖిలేశ్‌.. ‘గుర్తు’పైనే గురి
ఆత్మరక్షణలో ములాయం.. ఈసీ కోర్టులో ‘ఎస్పీ’ బంతి

సాక్షి, నేషనల్‌ డెస్క్‌ : నాలుగు నెలలుగా అనూహ్య రాజకీయాలకు వేదికగా మారిన సమాజ్‌వాదీ పార్టీ రాజకీయాలు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌ ప్రజలకే కాదు.. రాజకీయ నిపుణులకూ ఓ పజిల్‌లా మారాయి. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌కు  ఎటూ పాలుపోని పరిస్థితి. తొందరలో ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్న తరుణంలో తాజాగా పార్టీ అధ్యక్షుడిగా ములాయంను తొలగించి.. అఖిలేశ్‌కు పట్టంగట్టడం, అమర్‌ సింగ్, శివ్‌పాల్‌ తొలగింపు.. ప్రతిగా రాంగోపాల్‌ యాదవ్‌పై మళ్లీ బహిష్కరణ చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రీకొడుకులు ఒకర్నొకరు ఎదుర్కొంటారా అనే ప్రశ్ననుంచి.. పార్టీ పగ్గాలు ఎవరిచేతుల్లో ఉంటాయి, పార్టీ గుర్తు ఎవరికి దక్కుతుందనే పరిస్థితికి మారింది. దీంతో ఎస్పీ రాజకీయాలకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వేదికగా మారింది.

ముందు నుయ్యి..వెనుక గొయ్యి!
భారత రాజకీయాల్లో ములాయం తెలివైన నాయకుడు. అలాంటిది కీలకమైన ఎన్నికలకు ముందు పార్టీ రావణకాష్టంలా మారుతున్నా తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. కుమారుడిపైనే బహిష్కరణ వేటు వేసి వెనక్కు తీసుకోవటం ములాయం ఆత్మరక్షణ ధోరణికి అద్దం పడుతోంది. భార్య, శివ్‌పాల్, అమర్‌సింగ్‌ వంటి నేతలను వారించలేక.. అలాగని తనే రాజకీయ ఓనమాలు నేర్పిన కొడుకును బయటకు పంపలేక నలిగిపోతున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను అఖిలేశ్‌ ఏర్పాటుచేసుకోవటం మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుండటంతో.. ములా యం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు.అవమానాలకు గురవుతున్నా.. తండ్రిని శివ్‌పాల్‌ వర్గం తప్పుదారి పట్టిస్తోందని అఖిలేశ్‌ విమర్శించారే తప్ప.. నేరుగా ములాయంపై విమర్శలు చేయలేదు. తాజా సమావేశంలో తనను పార్టీ మార్గదర్శకుడిగా నియమించటంతో ములాయం కాస్త వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ములాయం ముందున్న ఆప్షన్లు రెండే. ఒకటి కొడుకుతో రాజీ పడి పార్టీ పగ్గాలిచ్చి పెద్దరికాన్ని నిలబెట్టుకోవటం, తను జన్మనిచ్చిన పార్టీకి మార్గదర్శకుడిగా ఉండటం.. లేదా.. కొడుకుతో పోటీ పడటమే.

(చదవండి : ఎస్పీలో మళ్లీ ప్రకంపనలు : 'ములాయం’కే ఎసరు)

అందుకే అఖిలేశ్‌కు కోపమొచ్చింది
తండ్రిచాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన అఖిలేశ్‌.. సీఎం అయ్యాక ఆ ముసుగునుంచి బయటకు వచ్చేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. పాలనలో సొంత నిర్ణయాలు తీసుకుంటూ అఖిలేశ్‌ ముందుకెళ్తున్న ప్రతి సారీ.. శివ్‌పాల్‌ వర్గం సీఎంకు బ్రేకులేసేందుకు ములాయంను అడ్డం పెట్టుకుంది. పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నించినా.. తండ్రి కూడా అవతలి వర్గాన్నే ఎక్కువగా నమ్మటంతో.. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోవైపు, పార్టీలో, ప్రభుత్వంలో క్లీన్ ఇమేజ్, ప్రజాభిమానం పెరిగింది. దీనికితోడు.. సీఎంగా ఉండగా పార్టీ నుంచి బహిష్కరణ, పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవినుంచి తప్పించటం, అభ్యర్థుల ఎంపికలో తను సూచించిన గెలుపుగుర్రాలను విస్మరించటం వంటి ఎన్నో అవమానాలు ఎదుర్కున్నారు. అందుకే.. పార్టీని శివ్‌పాల్, అమర్‌సింగ్‌ల నుంచి కాపాడుకుని.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇంతకు చిన సమయం మరెప్పడూ రాదనే నేరుగా ఎదురుదాడి ప్రారంభించారు.

200 మంది ఎమ్మెల్యేల మద్దతు, పార్టీలో సీనియర్ల సహకారం, ప్రజామద్దతున్న ఈ తరుణంలో పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకోకపోతే భవిష్యత్తులో తన ఉనికికే ప్రమాదమనే ఆలోచన కూడా ఈ నిర్ణయానికి దారితీసి ఉండొచ్చు. మరోవైపు అమర్‌సింగ్‌పై బహిష్కరణను ములాయం అడ్డుకోవటం కూడా.. అఖిలేశ్‌కు సమస్యగా మారింది. తన భవిష్యత్తును, పార్టీ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లేందుకు కలిసొచ్చిన పరిస్థితులను కలుపుకుని ముందుకెళ్తున్నారు. అయితే.. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తండ్రిని ఒక్కరాత్రిలో సీటునుంచి కూలదోశారనే అపప్రద కూడా అఖిలేశ్‌ ఖాతాలో చేరింది.


సీనియర్లు ఎవరెటు?
తాజాపరిణామాలతో అఖిలేశ్‌పై మళ్లీ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా.. సీనియర్‌ నేతలు మాత్రం రెండు వర్గాలుగా విడిపోయారు. ములాయం సింగ్‌ యాదవ్‌ వైపు తమ్ముడు శివ్‌పాల్, అమర్‌ సింగ్, సీనియర్‌ నాయకుడు బేణీప్రసాద్‌ వర్మ, నారద్‌ రాయ్, గాయత్రీ ప్రసాద్‌ ప్రజాపతి వంటి నేతలుండగా.. రాంగోపాల్, ధర్మేంద్ర యాదవ్, కిరణ్మయి నంద, నరేశ్‌ అగర్వాల్, రేవతీ రమణ్‌ సింగ్‌తోపాటు ముఖ్యమైన నేతలు తదితరులు అఖిలేశ్‌ను సమర్థిస్తున్నారు.

పార్టీ పగ్గాలు ఎవరికి?
ఇప్పటికే పార్టీ జాతీయ కార్యవర్గంలో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో  మెజార్టీ సభ్యుల మద్దతున్నప్పటికీ.. ఈసీ చేతిలోనే ఎస్పీ పగ్గాలపై నిర్ణయం ఆధారపడిఉంది. అధ్యక్షుడికి (ములాయంకు) సమాచారం లేకుండా.. ఆయన అనుమతి లేకుండా, ప్రధాన కార్యదర్శి పిలుపుతో.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నా అది చెల్లుబాటు కాదని శివ్‌పాల్‌ తెలిపారు. ములాయం వర్గం (ములాయం, శివ్‌పాల్, అమర్‌సింగ్‌) కూడా.. అఖిలేశ్‌ ఎన్నిక చెల్లదంటూ సోమవారం ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమై ఈసీని కలవనుంది. అయితే పార్టీపై తనకు పట్టుందంటూ అఖిలేశ్‌ కూడా ఆధారాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. పరిస్థితులు తనకు అనుకూలించకపోతే.. అఖిలేశ్‌ వేరుకుంపటి పెట్టే అవకాశాలున్నాయి.

ఇప్పటికే ‘రాష్రీ్టయ సమాజ్‌వాదీ పార్టీ’ పేరుతో పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసిన అఖిలేశ్‌.. ఎస్పీ కోర్‌టీమ్‌లో, ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యుల మద్దతున్నందున సైకిల్‌ గుర్తు తనకే కావాలంటూ పేచీ పెట్టే అవకాశాలున్నాయి. అఖిలేశ్‌ బ్రాండ్‌ ఎంత పనిచేసినా.. ఎన్నికల సమయంలే గుర్తే గుర్తింపునిస్తుంది. అందుకే ఇప్పుడు ఆ గుర్తుకోసం సీఎం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి నోటిఫికేషన్ విడుదలైతే రేసు మొదలైనట్లే. అందుకే న్యాయపరంగా అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ఆప్షన్లనూ అఖిలేశ్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మెజారిటీ నిరూపించుకోవాలా?
తాజా రాజకీయ పరిణామాలు యూపీ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపుతాయన్నదీ ఆసక్తికరంగా మారింది. తండ్రీకొడుకులు విడిపోయే పరిస్థితే వస్తే.. అఖిలేశ్‌ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే పరిస్థితి రావొచ్చు. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నానని చెప్పిన గవర్నర్‌ రాంనాయక్‌.. సంక్షోభం ముదురుతున్నట్లు అనిపిస్తే.. సీఎంకు బలనిరూపణ చేసుకొమ్మని కోరే అవకాశమూ ఉంది. అయితే అఖిలేశ్‌ వర్గం ఓడిపోకుండా కాంగ్రెస్‌ మద్దతివ్వొచ్చు. మరో రెండ్రోజుల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఈ లోపు ఎస్పీ రాజకీయాల్లో మరెన్ని మలుపులు తిరుగుతాయోననేది ఆసక్తి రేపుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement