అఖిలేశ్ లిస్టులో బాబాయ్
210 మందితో సమాజ్‌వాదీ తొలి జాబితా విడుదల
- ఎస్పీ–ఆర్‌ఎల్డీ పొత్తు చర్చలు విఫలం
- చిన్న పార్టీలతో కలిసి పోటీచేయాలని ఆర్‌ఎల్డీ నిర్ణయం
లక్నో, సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్‌వాదీపై పట్టు కోసం తుది దాకా తలపడ్డ తండ్రీ కొడుకులు మళ్లీ ఒకటయ్యారు. ఎస్పీ అభ్యర్థుల జాబితాలో బాబాయ్ శివ్‌పాల్‌కు చోటిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ములాయం– అఖిలేశ్‌ల మధ్య సయోధ్య కుదిరినట్లేనని భావిస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ శుక్రవారం 210 మందితో జాబితా విడుదల చేయగా... జాబితాలో అఖిలేశ్ బద్ధ శత్రువు, ములాయం వర్గానికి చెందిన శివ్‌పాల్‌కు చోటుదక్కింది. శివ్‌పాల్‌కు జస్వంత్‌నగర్ స్థానాన్ని కేటాయించాలన్న ములాయం కోరికను కూడా అఖిలేశ్ పరిగణనలోకి తీసుకున్నారు.
ఇక రాజ్యసభ సభ్యుడు బేణీ ప్రసాద్ వర్మ కుమారుడు రాకేశ్ వర్మకు ములాయం కోరినట్లు రాంనగర్ సీటు కాకుండా కైసర్‌గంజ్ స్థానం కేటాయించారు. గత నెల్లో ములాయం విడుదల చేసిన జాబితాలో లేని చాలా పేర్లు అఖిలేశ్ జాబితాలో ఉండడం విశేషం. మొత్తం 210 మందిలో 59 మంది ముస్లింలకు ఎస్పీ టికెట్లిచ్చింది. కాంగ్రెస్‌కు 85 స్థానాల వరకూ ఇవ్వగలమని, పొత్తు కుదిరితే ఆ పార్టీ సిట్టింగ్ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల్ని ఉపసంహరించుకుంటామని పార్టీ ఉపాధ్యక్షుడు కిరణ్మయి నందా వెల్లడించారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మాత్రమే పొత్తుకు అఖిలేశ్ సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ములాయం సూచన మేరకే ఆర్‌ఎల్‌డీతో పొత్తుకు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో జేడీయూ, ఇతర చిన్న పార్టీల్ని కలుపుకుని ముందుకెళ్లాలని ఆర్‌ఎల్డీ నిర్ణయించింది.