తెరపైకి కొత్త సీఎం.. శశి వర్గం ట్విస్ట్!
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి అన్నాడీఎంకే శాసనసభా పక్షనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ వర్గం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. తమిళనాడు సీఎం అభ్యర్థిగా, పార్టీ ప్రిసీడియం చైర్మన్ సెంగొట్టయన్ పేరును తెరపైకి తెచ్చింది. ముఖ్యమంత్రి అవడానికి యత్నిస్తున్న శశికళపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మన్నార్ గుడి వర్గం ఈ కొత్త పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకత కొంత తగ్గేంత వరకు సెంగొట్టయన్ ను సీఎంగా కొనసాగించాలని శశికళ వర్గం ఈ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. నేటి మధ్యాహ్నాం పోయెస్ గార్డెన్ నుంచి బయలుదేరిన శశికళ.. మెరీనా బీచ్ లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద కొంత సమయాన్ని గడిపారు. అనంతరం నేరుగా ఎమ్మెల్యేలున్న రిసార్టుకు వెళ్లి.. వారితో మంతనాలు జరిపి అక్కడి నుంచి రాజ్ భవన్ బాట పట్టనున్నారు.
తన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ సమయంలో ప్లేట్ ఫిరాయిస్తారోనేనని లోలోన ఆందోళన ఉన్నా తెలివిగా పై ఎత్తులు వేస్తున్నారు శశికళ. తన కనుసన్నల్లో నడుచుకుంటున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ వెళ్లి, తన వర్గం తరఫున సీఎం అభ్యర్థిగా సెంగొట్టయన్ పేరు ప్రతిపాదించాలని భావిస్తున్నారు. తన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల తిరుగుబాటు మొదలవుతున్న నేపథ్యంలో మన్నార్ గుడి వర్గం నేతలు శశికళకు ఈ సూచన చేసినట్లు తెలుస్తోంది. సీఎంగా సెంగొట్టయన్ కు ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ విద్యాసాగర్ రావుకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించుకున్నారు. తనకు మద్ధతుగా నిలిచిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి పరేడ్ నిర్వహించనున్నారు.
తమిళ రాజకీయాలకు సంబంధించి మరిన్ని కీలక కథనాలు: