ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా నగదు
విశాఖపట్టణం స్పెషల్ బ్రాంచ్ నుంచి శేఖర్‌రెడ్డికి సరఫరా
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారీ ఎత్తున నగదు, బంగారంతో పట్టుబడిన టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్‌రెడ్డికి ప్రింటింగ్ ప్రెస్ ద్వారానే కొత్త కరెన్సీ అందినట్లు తెలిసింది. ఇందుకు పది మంది అధికారులు ఆయనకు సహకరించినట్లు సమాచారం. శేఖర్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, ప్రేమ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఇటీవల ఐటీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించి రూ.161 కోట్ల నగదు, 179 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదులో రూ.2వేల నోట్లు రూ.34 కోట్లు కొత్త కరెన్సీ అని అధికారిక సమాచారం కాగా రూ.70 కోట్లుగా అనధికారిక సమాచారం.
ఇంత భారీ మొత్తంలో శేఖర్‌రెడ్డికి ఎలా లభించిందని ఆశ్చర్యపోయిన అధికారులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. రూ.2వేల నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా శేఖర్ రెడ్డికి అందినట్లు తేలింది. ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించిన నోట్లను రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)కు, అక్కడినుంచి ఇతర బ్యాంకులకు పంపిణీ జరగాలి. ఈ జాప్యాన్ని నివారించేందుకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక శాఖ (స్కేప్)లకు పంపారు. స్కేప్‌గా పిలిచే ఈ శాఖలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణం, హైదరాబాద్‌లో ఉన్నాయి. ఈ శాఖలకు వచ్చిన కొత్త కరెన్సీని యథాతథంగా శేఖర్‌రెడ్డికి బదలాయించారు. దీన్ని ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.