శివసేన ఏం చేయనుంది? మళ్లీ ఝలకా!
ముంబయి: తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ రామ్‌నాథ్ కోవింద్‌ను ఎన్డీయే ప్రకటించిన నేపథ్యంలో శివసేన పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భాగస్వామ్య పార్టీ అని చెప్పుకుంటూనే ముందునుంచే మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న శివసేన తాజాగా బీజేపీ తీసుకున్న నిర్ణయంపై ఝలక్ ఇవ్వనుందా! లేక మద్దతు తెలుపుతుందా అనే విషయంపై అంతా చర్చించుకుంటున్నారు. దళిత ఓట్లను దండుకునే ఉద్దేశంతోనే రామ్‌నాథ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ తెరమీదకు తెస్తే తాము ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమని శివసేన ప్రకటన కూడా చేసింది.
ఆ పార్టీ ఉద్దేశం ఏమిటై ఉంటుందా అనే విషయం చర్చించుకున్న తర్వాత మంగళవారం తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పింది. శివసేన పార్టీ 51వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుబర్బన్ మతుంగాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ దళిత ఓట్లే లక్ష్యం అయితే తాము రామ్‌నాథ్‌కు మద్దతివ్వబోమని అన్నారు. అమిత్ షా తన ఇంటికొచ్చి మద్దతుకోరిన మాట వాస్తవమే అని అయితే, అభ్యర్థిని ప్రకటించిన తర్వాతనే తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పామన్నారు.
శివసేన పార్టీ తాము ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ పేర్లను తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తనకు ఆసక్తి లేదని మోహన్‌భగవత్ చెప్పగా స్వామినాథన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా ఎన్డీయే మాత్రం రామ్‌నాథ్ కోవింద్‌ను తెరమీదకు తెచ్చింది. సేన గతంలో యూపీఏ అభ్యర్థిగా మద్దతిచ్చింది. యూపీఏ ప్రతిభాపాటిల్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగా ఎన్డీయే మాత్రం బైరాన్ సింగ్ షేకావత్ ను నిలబెట్టింది. కానీ సేన మాత్రం యూపీఏ అభ్యర్థి అయిన పాటిల్‌కే మద్దతిచ్చింది. అలాగే, గత అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఎన్డీయే మద్దతిచ్చిన పీఏ సంగ్మాని కాదని యూపీఏ పెట్టిన ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చింది. దీంతో ఎన్డీయేకు మరోసారి శివసేన ఝలక్ ఇవ్వనుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.