సీఎంకు ఊరట, ఆధారాలు లేవన్న హైకోర్టు
తిరువనంతపురం: అవినీతి కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 1995 నాటి ఎస్‌ఎన్‌సీ-లావలీన్ అవినీతి కేసు నుంచి ఆయనకు విముక్తి కల్పించింది. ఈ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని.. పలువురు విద్యుత్ మంత్రులు ఎస్‌ఎన్‌సీ-లావలీన్‌తో సంప్రదింపులు సాగించారని కానీ సీబీఐ మాత్రం విజయన్ ఒక్కరినే నిందితుడిగా చేర్చిన అంశాన్ని కోర్టు లేవనెత్తింది.
2013, నవంబర్ 5న విజయన్‌తో పాటు ఆరుగురిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వీరికి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలం కావడంతో న్యాయస్థానం వీరికి విముక్తి ప్రసాదించింది. దీంతో సీబీఐ.. హైకోర్టును ఆశ్రయించింది. 1995లో సంకీర్ణ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన విజయన్ రూ.374 కోట్లతో మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు చేపట్టినప్పుడు కెనడా కంపెనీ ఎస్‌ఎన్‌సీ-లావలీన్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయనపై సీబీఐ అభియోగాలు మోపింది.