రాష్ట్రాలకు ప్రత్యేక జెండా.. డిమాండ్ ఉధృతం
► కర్ణాటక డిమాండ్‌ను సమర్థించిన కేరళ ఎంపీ
బెంగళూరు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం-ఒక జెండా అంటున్నారు కానీ, జమ్ముకశ్మీర్ ప్రత్యేక జెండాను ఏర్పాటు చేసుకోగా, ఇతర రాష్ట్రాలు కూడా ప్రత్యేక జెండా రూపొందించుకోవడంలో తప్పు లేదన్నారు. కర్ణాటక రాష్ట్రం తనదైన ప్రత్యేక జెండా తయారు చేసుకుంటే జాతీయతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని శశిథరూర్ సమర్థించారు. బెంగళూరు నగరంలోని జీకేవీకే ఆవరణలో జరుగుతున్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ రాష్ట్రానికైనా తనదైన రాష్ట్ర పతాకాన్ని ఏర్పాటు చేసుకోవటానికి రాజ్యాంగంలో అభ్యంతరం లేదన్నారు. అయితే జాతీయ జెండా అతి ఎత్తులో రెపరెపలాడేటట్లు ఉండాలని, ఆ జెండా కంటే రాష్ట్ర పతాకం చిన్నదిగా ఉండాలని ఆయన తెలిపారు.
ఒక దేశం, ఒక జెండా ఉండాలని బీజేపీ ప్రతిపాదించటంపై ఆయన స్పందిస్తూ.. దేశానికి ఒకే జెండా నినాదం ఉన్నప్పటికీ జమ్ముకశ్మీర్‌లో ప్రత్యేక జెండాను ఏర్పాటు చేసుకోలేదా అని ప్రశ్నించారు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాలు ప్రత్యేక జెండాలను ఏర్పాటు చేసుకున్నాయని, ఆ దేశంలో సమస్య లేనపుడు ఇక్కడ ఎందుకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం మవుతున్నాయనేది అర్థం కావటం లేదన్నారు. దేశంలో జాతీయ భాష హిందీ నేర్చుకోవడాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ నేర్పించేందుకు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం కల్పించటం లేదని శశిథరూర్ విమర్శించారు.