డాక్టర్ సుంకరకు జాతీయ పురస్కారం
బాలల సంక్షేమానికి అందించిన సేవలకు గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ/భీమవరం అర్బన్: వేలాది మంది పోలియో బాధితులకు వైద్య సేవలందించి.. వారు నడవగలిగేలా చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావుకు ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ అవార్డ్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్-2013’ పురస్కారం లభించింది. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనూహ్య విజయాలు సాధించిన బాలలకు, బాలల సంక్షేమానికి అవిరళ కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా 20 మంది బాలురకు, శిశు సంక్షేమానికి విశేష కృషి చేసిన నాలుగు సంస్థలకు, వ్యక్తులకు జాతీయ శిశు సంక్షేమ, రాజీవ్‌గాంధీ మానవసేవ అవార్డులను అందజేశారు.
ఈ నేపథ్యంలో బాలల సంక్షేమంలో వ్యక్తిగత కేటగిరీలో ఆదినారాయణరావు జాతీయ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా అందుకున్నారు. ఆదినారాయణరావు పోలియో రహిత భారతదేశం కలను సాకారం చేయడం లక్ష్యంగా ఆయన వైద్యరంగంలో సేవలందిస్తున్నారు. వేలాదిమంది పోలియో బాధితులకు సేవలందించారు. ఆదినారాయణరావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. విశాఖలో స్థిరపడ్డారు. పోలియో వ్యాధిగ్రస్తుల పాలిట దైవంగా పేరుపొందిన ఆయన తన వైద్యసేవల ద్వారా దేశ, విదేశాల్లో పేరుపొందారు. గతంలోనూ ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖలో ప్రీ పోలియో సర్జికల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా, ప్రేమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ఇనిస్టిట్యూషన్స్ డైరక్టర్ జనరల్‌గా సేవలందిస్తున్నారు.