పరిస్థితి ఆందోళనకరం..అల్లర్లకు దారితీయొచ్చు..
పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇక్కట్లపై సుప్రీంకోర్టు
- ప్రజలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు
- ఇలాంటి పరిస్థితుల్లో కోర్టుల తలుపులు మూయలేం
- హైకోర్టులు నోట్ల రద్దు కేసులను స్వీకరించొద్దన్న అభ్యర్థన తిరస్కరణ
న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. తదనంతరం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకులు, పోస్టాఫీసుల ఎదుట భారీ క్యూలు తీవ్రమైన అంశమని, ప్రస్తుతం సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే అల్లర్లకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు తలుపులను మూయలేమని, ప్రజలకు కోర్టులను ఆశ్రరుుంచే హక్కు ఉందని, ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 8న పాత నోట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా హైకోర్టుల్లో దాఖలయ్యే పిటిషన్లను విచారణకు స్వీకరించొద్దని, దీని వల్ల గందరగోళం చెలరేగుతుందని కేంద్రం దాఖలు చేసిన అభ్యర్థనను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దవేతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. నోట్ల రద్దు, ఇతర సమాచారాన్ని లిఖితపూర్వకంగా సిద్ధం చేసుకోవాలని వివిధ పక్షాలకు సూచిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 25కు వారుుదా వేసింది.
ఏ చర్యలు తీసుకున్నారు..
‘కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నా రో తెలుసుకోవాలి. ప్రజలు అవసరమైతే హైకోర్టులకు వెళ్లొచ్చు. వారు హైకోర్టులకు వెళ్లకుండా మేము తలుపులు మూసేస్తే.. సమస్య తీవ్రత మాకు ఎలా తెలుస్తుంది. సమస్య తీవ్రతను తెలియ జేసేందుకు ప్రజలు వివిధ కోర్టులకు వెళుతుంటారు’ అని ధర్మాసనం పేర్కొంది. సామాన్యులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారనే విషయంలో ఎటువంటి సందేహం లేదు కదా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ.. ఇందులో సందేహం ఏమీ లేదని, అరుుతే బ్యాంకుల ఎదుట క్యూల్లో నిలబడే వారి సంఖ్య తగ్గుతోం దని, భోజన విరామ సమయంలో సీజేఐ.. బ్యాంకుల వద్ద క్యూలు ఎలా ఉన్నాయనే విషయాన్ని స్వయంగా పరిశీలించవచ్చని విన్నవించారు. అరుుతే దీనిపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నవంబర్ 8న పాత నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి 47 మంది ప్రాణాలు కోల్పోయారని, బ్యాంకుల్లో కరెన్సీ లేకపోవడం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.
మార్పిడి పరిమితిని ఎందుకు తగ్గించారు
గత విచారణ సందర్భంగా రానున్న రోజుల్లో ప్రజలకు కొంత ఊరట లభిస్తుందని చెప్పారని, ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ఏమిటని ఏజీని సుప్రీం ప్రశ్నించింది. గతంలో మార్పిడి పరిమితి రూ.4,500 ఉంటే ఇప్పుడు దానిని రూ.2,000లకు తగ్గించారని, ఇందులో ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. రూ.100 నోట్లకు ఏమైనా కొరత ఉందా అని ప్రశ్నించింది. దీనికి ఏజీ స్పందిస్తూ.. నోట్ల ముద్రణ తర్వాత దేశంలోని వేలాది కేంద్రాలకు వాటిని బదిలీ చేయాల్సి ఉందని, ఆ తర్వాత వాటిని ఏటీఎంలకు చేరవేయాల్సి వస్తోందని, కరెన్సీ నోట్లకు ఎటువంటి కొరతా లేదని స్పష్టం చేశారు.