జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి
⇒ 2003 నుంచి ఇప్పటివరకు అయిన ఖర్చు రూ. 5 కోట్లుగా లెక్క తేల్చిన అధికారులు
⇒ జయ సొత్తు వేలం ద్వారా వచ్చిన సొమ్ము నుంచి ఖర్చులు రాబట్టుకోనున్న కర్ణాటక
సాక్షి, బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చులను జయ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన సొమ్ము నుంచి కర్ణాటక తీసుకుంటుందని అధికారవర్గాల సమాచారం. జయ అక్రమాస్తుల కేసు విచారణను కర్ణాటకకు బదిలీ చేస్తూ 2003 నవంబర్ 18న సుప్రీం కోర్టు తీర్చు చెప్పింది. దీంతో అదే ఏడాది డిసెంబర్ 27న కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో ప్రత్యేక కోర్టును, కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 2014 వరకు ఈ కోర్టులో విచారణ జరిగింది. ఈ పదేళ్లలో రూ. 2.86 కోట్లు ఖర్చయినట్లు లెక్కగట్టారు.
ఈ కోర్టు, కార్యాలయం ఏర్పాటుకు రూ.4.81 లక్షలు, టెలిఫోన్ బిల్లులకు రూ.1.37 లక్షలు ఖర్చయినట్లు తేలింది. ప్రత్యేక కోర్టు, కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది వేతనాలు ఇతర ఖర్చులే రూ.90.13 లక్షలయినట్లు తేలింది. తమిళ భాషలో ఉన్న వేలాది పేజీల దస్తావేజులను కన్నడ, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించడానికి రూ.6.51లక్షలు, వాటి జిరాక్స్‌కు రూ.2.17 లక్షలు ఖర్చయింది. తమిళనాడు సెషన్స్ కోర్టులోని దస్త్రాలను ఇక్కడికి తేవడానికి అయిన ఖర్చు రూ.8.63 లక్షలుగా తేల్చారు. ఇతరత్రా అన్ని ఖర్చులు మరో 1.70 కోట్లు అయిందని అధికారవర్గాలు తెలిపాయి. విచారణ సందర్భంగా జయలలిత, శశికళ తదితరులు బెంగళూరుకు వచ్చినప్పుడు వారికి కల్పించిన భద్రతకే భారీగా ఖర్చయినట్లు సమాచారం.
ప్రత్యేక కోర్టులో 2014లో విచారణ ముగిసింది. ఆ తర్వాత హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా జయలలిత, ఇతరులకు భద్రత, ఇతరత్రా ఖర్చులు, వారు జైలుకు వచ్చినప్పుడు అయిన ఖర్చులు కనీసం రూ. 2 కోట్లు అయ్యాయని అధికారులు వెల్లడించారు. జయ బృందం నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్ములో ఈ ఖర్చులను కర్ణాటక ప్రభుత్వం రాబట్టుకొంటుందని సమాచారం.
మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి
చెన్నైకు చిన్నమ్మ?
విజేత పళని
అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్
నాడూ.. నేడూ.. అదే డ్రామా!
చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్
స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు