కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్లో జవానుల ధీన స్థితిపై బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్ బుక్లో పోస్ట్ చేసిన వీడియో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను చేరింది. సరిహద్దులో అత్యంత చలిలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని వీడియోల్లో చిత్రీకరించి బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. సోషల్ మీడియాల్లో ఈ వీడియోను చూసిన వారందరూ తేజ్ బహదూర్ యాదవ్కు మద్దతుగా నిలిచారు.
కేంద్ర ప్రభుత్వం జవాన్ల ఆహారం కోసం ఎన్ని సదుపాయాలు కల్పించినా మధ్యలో అధికారులు పందికొక్కుల్లా మింగేస్తున్నారని యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాడిన రొట్టె, పసుపు రసం, సాంబార్ మాత్రమే ఆహారంగా ఇస్తున్నారని వీడియోలో చిత్రీకరించి మరీ ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు. తమ దీనగాథపై ప్రధాని మోదీ స్పందించాలని యాదవ్ కోరారు. యాదవ్ పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవ్వడంతో కొద్దిసేపటికే ఆ వీడియోలు మీడియాల్లో దర్శనమిచ్చాయి. ఈ వీడియోలు ప్రసారమయ్యే సమయానికే తనపై సీనియర్ అధికారులు వేటు వేసే అవకాశం ఉందనే అనుమానాన్ని కూడా యాదవ్ వ్యక్తం చేశారు. మీడియాలో యాదవ్ వీడియోలు ప్రసారమైన వెంటనే రాజ్‌నాథ్ స్పందించారు. దర్యాప్తు జరిపి వివరాలు తెప్పించాలని దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.