ఒక మంచి అనువాద నవల- అసురుడు
విజేతల గొంతు బలంగా, గర్వంగా, అతిశయంగా ఉంటుంది. వాళ్ల కథలు రాయడానికి, వినిపించడానికి కవులు, కథకులు బారులు తీరి ఉంటారు. గాయకులు, భజంత్రీలు, వందిమాగదులు సర్వదా విజేతల వెంట సిద్ధం. పరాజితుల గొంతు బలహీనంగా, దుఃఖంతో పెరపెరలాడుతూ ఉంటుంది. వాళ్ల కథలు ఎవరూ రాయరు. వాళ్లే రాసుకోవాలి. ‘అసురుడు’ నవల పరాజితుల గాథ. యుద్ధభూమిలో నిస్సహాయుడై ఎలుకలు తన కండరాలను నములుతుండగా మృత్యువు దేహంపై పురుగులా పారాడుతుండగా రావణుడు ఈ కథ చెబుతాడు. ఇది రావణుడి కథే కాదు. భద్రుడి కథ కూడా.
భద్రుడు ఒక సామాన్యుడు. అనామకుడు. సాదాసీదా రైతు. భార్యాబిడ్డలతో పొలంలో పని చేసేవాడు. వర్షమొస్తే ఆనందంతో తడిసి, పంట పండితే ధాన్యపు బస్తాను బిడ్డను మోసుకొచ్చినట్టు మోసుకొచ్చే అమాయక రైతు. తాతలు తండ్రులలాగే కడుపు నింపుకోవడమే ఆశయంగా బతికే మామూలు మనిషి. అతనికి రాజ్యం తెలియదు. రాజులు తెలియరు. కానీ రాజ్యం ఎవరినీ అంత సులభంగా బతకనీయదు. ఎక్కడో మొదలైందనుకున్న యుద్ధం భద్రుడి నట్టింటికి వచ్చింది. రక్తపు మడుగులో భార్యాబిడ్డలు... అగ్నిజ్వాలల్లో ఇల్లు. పారిపోయాడు. కానీ ఎక్కడో ఒకచోట బతకాలి గదా. రావణుడి దగ్గర చేరాడు.
రామాయణం మనకు కొత్తకాదు. రావణుడి వైపు నించి కథ వినడమే కొత్త. కూతురు సీత కొత్త. కూతురు సీత కోసం అతను పడిన క్షోభ కొత్త. అన్ని కాలాల్లోనూ మనుషుల అకారణ ప్రేమ అపవాదులకు దారి తీస్తుంది. అందుకే అతను నిందలు మోశాడు.
ఈ కథలో మాయలు, అద్భుతాలు లేవు. అందరూ సాధారణ మనుషులే. పేదరికం నుంచి, అవమానాల నుంచి ఒక రాజుగా రావణుడు ఎదిగిన తీరు, కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని పొందిన తీరు అబ్బురపరుస్తాయి. రావణుడి గురించైనా మనకు ఎంతో కొంత తెలుసు. భద్రుడి గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే అతను పేదవాడు. తక్కువ కులం వాడు. అణగారిన వర్గాల సాహసం, శౌర్యం ఎవరికి గుర్తుంటాయి. యుద్ధంలో సామాన్యల ప్రాణదానాన్ని లిఖించేదెవరు. ఎంతో సాహసంతో రావణున్ని కాపాడితే కాసింత కృతజ్ఞత కూడా చూపడు. ఎందుకంటే భద్రుడు ఒక సేవకుడు. సైనికుడు. చరిత్ర పొరల్లో పూడికలో కలిసి పోవాల్సినవాడు. అతనికో పేరు, ఊరు ఉండాల్సిన అవసరం లేదు. రావణుడు రాజ్యం కోసం పోరాడితే భద్రుడు ఆత్మగౌరవ ప్రకటన కోసం పోరాడాడు. శతాబ్దాలుగా భద్రుడు రకరకాల మనుషులగా రూపాంతరం చెంది పోరాడుతూనే ఉన్నాడు. భద్రుడికి కృతజ్ఞత చూపే సంస్కారాన్ని ఇంకా రావణుడు అలవరచుకోలేదు.
464 పేజీల ఈ పుస్తకాన్ని మొదలుపెడితే ఆపలేం. ఇంగ్లిష్‌లో ఆనంద్ నీలకంఠన్ రాశారు. తెలుగులో ఆర్.శాంతసుందరి అనువాదం చేశారు. మూలంలోనే ఇంత బలముందా లేక అనువాదంలోనే బలముందా అనేంత గొప్పగా ఉంది. తెలుగులో ఇలాంటివి కనిపించవు. తెలుగు నవల ఆత్మహత్య చేసుకోవడానికి రచయితలే కారణం. నానా చెత్త రాయడంలో అది జబ్బు పడి మందులు మింగలేక ఉరిపోసుకుంది. ఈ పుస్తకం చదివితే నవల ఎలా రాయాలో తెలుస్తుంది.
- జి.ఆర్.మహర్షి
అసురుడు- ఆనంద్ నీలకంఠన్, అనువాదం: ఆర్.శాంత సుందరి
ధర: 250, అన్ని పుస్తక కేంద్రాల్లో లభ్యం