స్మృతి ఒక నివాళి
జీవన కాలమ్
అన్ని సాహితీ ప్రక్రియలలోనూ అనితరసాధ్యమైన ప్రతిభను కనపరిచిన మహా మేరు శృంగం, తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణగారి ఇల్లు విజయవాడలో ఉంది. దాన్ని స్మారక చిహ్నాన్ని చేసి జాతికి సమర్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది.
ఈ మధ్య కర్ణాటక ప్రభుత్వం మైసూరులో ప్రముఖ రచయిత ఆర్.కె. నారాయణ్ ఇంటిని కొనుగోలు చేసి స్మారక భవనంగా తీర్చిదిద్దు తోంది. గురజాడ విజయనగరంలో బొంకుల దిబ్బనీ, థామస్ హార్డీ ఇంగ్లండ్‌లో ‘ససెక్స్’నీ, ఆర్.కె. నారాయణ్ ‘మాల్‌గుడి’నీ సాహిత్యం లో సుప్రతిష్టితం చేశారు, తమ కళాఖండాల ద్వారా. మొన్న- హైదరాబాదులో అనుకుం టాను, ‘మాల్‌గుడి’ అనే షాపు పేరు చూశా ను. ఒక రచయిత కృషికి అది నివాళి. లండన్ బేకర్ స్ట్రీట్ స్టేషన్‌లో దిగగానే- గోడమీద కనిపించేది షెర్లాక్‌హోమ్స్ పాత్ర బొమ్మ. రచయిత ఆర్థర్ కోనన్ డాయిల్ తన నవలలో సృష్టించిన షెర్లాక్ హోమ్స్ అడ్రసు 221 బి-బేకర్ స్ట్రీట్ అని చెప్పారు. వాస్తవానికి అది అతని నివాసం కాదు. కాని ఇప్పుడది స్మృతి చిహ్నం. నేను వెదుక్కుంటూ వెళ్లాను. షెర్లాక్ హోమ్స్‌కి సంబంధించిన పుస్తకాలు, వస్తువులతో అది ఒక స్మారక మందిరమయింది.
జర్మనీలో కొలోన్ అనే ఊరిలో ఓ చిన్న సందులో ఉన్న ఓ చిన్న ఇంటికి వెళ్లాను. అది ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బితోవెన్ ఇల్లు. ఆయన గది, వస్తువులు, ప్రపంచ ప్రసిద్ధమైన 12వ సంఫనీని రచిం చిన పియానో - అన్నీ ఉన్నాయి. ఆయన ఫొటోలు న్నాయి. నిద్రించిన మంచం ఉంది. చూసి ఆయన సమ క్షంలోనే ఉన్నట్టు పులకించాను.
వీధి దాటి వచ్చాక- చిన్న పార్కులో ఒక పోక చెట్టు కింద పియానో పెట్టుకుని పిల్లలు పెట్టిన కోటుతో ఒక పేద కళాకారుడు బితోవెన్ సంగీతాన్ని వాయిస్తు న్నాడు. మరో చెట్టుకింద నిలబడి మరో పేద కళాకా రిణి వయొలిన్ వాయిస్తోంది. వారి ముందు పరిచిన చదర. నిలబడి చూస్తున్నవాళ్లు తోచిన పైకాన్ని వేస్తు న్నారు. పేదరికం-ఇంత హుందాగా, సంపన్నంగా, ఉదాత్తంగా ఉంటుందా అనిపించింది.
ఇంగ్లండ్‌లో స్టాట్‌ఫర్డ్‌లో దాదాపు 445 సంవత్స రాల నాటి షేక్‌స్పియర్ ఇల్లు ఉంది. శతాబ్దాలు గడి చినా ఆయా వస్తువులు చెడిపోకుండా శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి ఉంచారు. ఆ ఇంట్లో నడుస్తున్నంత సేపూ ఒళ్లు పులకించింది. ఎన్ని జ్ఞాపకాలు- ఎన్ని పాత్రలు- హామ్లెట్, కింగ్ లియర్, హెన్రీ ఠి, ఒథెల్లో, క్లియొ పాత్రా, షైలాక్, ఒఫీలియా- ఎన్నో ఎన్నో!
అమెరికా జాక్సన్‌విలీలో మొట్టమొదటిసారిగా పీడిత ప్రజల హక్కులను పరిరక్షించడానికి కంకణం కట్టుకున్న అబ్రహాం లింకన్ ఇంటిని దర్శించాం. అలాగే కెంట్‌లో చార్లెస్ డికెన్స్ ఇల్లు. తమిళనాడు తిరు వారూర్‌లో త్యాగరాజు, దీక్షితార్, శ్యామాశాస్త్రి పుట్టిన ఇళ్లు సంగీత ప్రియులకు పుణ్యక్షేత్రాలు. నేనూ మా ఆవిడా శ్యామాశాస్త్రి ఇంటి వసారాలో కూర్చుని చింతా మణి రాగంలో ‘‘దేవీ, బ్రోవసమయమిదే...’’ పాడు కుని పులకించాం.
ఇప్పుడు ఈ కాలమ్‌కి కారణం. తన జీవిత కాలం లో దిషణాహంకారాన్ని హక్కుని చేసుకుని, ఓ ఘన తగా తీర్చిదిద్ది, అన్ని సాహితీ ప్రక్రియలలోనూ అనితర సాధ్యమైన ప్రతిభను కనపరిచిన మహా మేరు శృంగం, తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణగారి ఇల్లు విజయ వాడలో ఉంది. దాన్ని స్మారక చిహ్నాన్ని చేసి జాతికి సమర్పించవలసిన బాధ్యత ప్రభుత్వా నిది. దాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఒక సాహితీపీఠం చేయాలి.
తెలుగువాడికి పక్కవాడి గొప్పతనాన్ని చూసి గర్వపడడం తెలీదు. ప్రతి తెలుగు వాడూ ఒక ‘ద్వీపం’ అంటాను. మన సంస్కృ తిని మన గతం ప్రతిఫలిస్తుంది. మన సంస్కా రాన్ని వర్తమానం నిర్ణయిస్తుంది. మన భవిష్య త్తుని మన దూరదృష్టి నిర్దేశిస్తుంది. అలనాడు సాహితీప్రియులు మండలి బుద్ధప్రసాద్‌గారి కృషి ఫలి తంగా విజయనగరంలో గురజాడ స్మారక భవనం వెలసింది.విశ్వనాథ వారి ఒక ఘటన చెప్పి ముగిస్తాను. విజ యవాడలో మండువేసవిలో ఎండ నిప్పులు చెరుగు తున్న రోజున ఆయనా, ఆయన ఆత్మీయ మిత్రులు ధూళిపాళ శ్రీరామమూర్తిగారూ వాల్మీకి రామాయ ణంలో ఋష్యశృంగ వృత్తాంతాన్ని చదువుకుంటు న్నారు. ఉన్నట్టుండి మేఘాలు కమ్మి వర్షం పడింది.
‘‘వేసవిలో వర్షమా?’’ అని ఆశ్చర్యపోయారు ధూళిపాళ. ‘‘ఇందులో ఆశ్చర్యమేముంది పిండాకూడు. మనం చదువుతున్నది ఋష్యశృంగుడి కథ. అది వాల్మీకి మహాత్మ్యం’’ అన్నారట విశ్వనాథ. కొన్ని సీజన్ల తరువాత మరో మండువేసవిలో ధూళిపాళ పరుగున వచ్చారట విశ్వనాథ వారింటికి. ‘‘అయ్యా! చూశారా, వర్షం పడుతోంది!’’ అన్నారట శ్రీరామమూర్తిగారు. ‘‘అయితే ఏమిటట? ’’ అన్నారు విశ్వనాథ. ‘‘మీ కల్పవృక్షానికీ ఆ మహాత్మ్యం ఉందండీ! నేని ప్పుడు కల్పవృక్షంలో ఋష్యశృంగ వృత్తాంతమే చదివి వస్తున్నాను!’’ అన్నారట ధూళిపాళ శ్రీరామమూర్తి గారు.
గొల్లపూడి మారుతీరావు