అవమానం ఆయనకా? యావత్ సాహిత్య రంగానికా? | attack on puramal murugan | Sakshi
Sakshi News home page

అవమానం ఆయనకా? యావత్ సాహిత్య రంగానికా?

Published Mon, Feb 9 2015 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

attack on puramal murugan

ఇటీవల తమిళనాడులో రచయిత ప్రొఫెసర్ పెరుమాళ్ మురుగన్‌పై మతతత్వవాదులు జరిపిన దాడి ఈ దేశంలో ప్రజాస్వామ్యం మేడి పండు చందమేనని రుజువు చేసింది. ‘రచయితగా నేను మరణించాను ఇక నేను రాయను’ అని ఆయన ప్రకటించుకున్నాడు. ఇది యావత్తు సాహిత్య రంగానికే జరిగిన అవమానం. పెరుమాళ్ 2010లో ‘మధోరుభగన్’ పేరిట ఒక పుస్తకం రాస్తే దాన్ని అనిరుధ్ వాసుదేవన్ వన్‌పార్ట్ ఉమెన్ పేరుతో ఆంగ్లంలోకి అనుదించారు. ఆ పుస్తకంపై మతోన్మాదులు రాద్ధాంతం చేయడం గర్హనీయం.
 
 ఈ సందర్భంగా పాతికేళ్ల క్రితం ఢిల్లీలో ఒక ప్రముఖ కళాకారుడిపై జరిగిన అమానుష దాడిని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో సఫ్దర్ హష్మి వీధి నాటిక ప్రక్రియ ద్వారా మురికివాడల ప్రజల్ని, కార్మికుల్ని చైతన్యపరిచేందుకు తన జీవితాన్ని అంకితం చేశాడు. దీనిని సహించలేని పాలకులు ఆయన్ను నడి రోడ్డుపై పాశవికంగా హత్య చేశారు. ఆ సమయంలో ఢిల్లీలో ప్రపంచ సినిమా ఉత్సవాలు జరుగుతున్నాయి. షబానా ఆజ్మీ, గోవింద్ నిహలానీ లాంటి వారు ఆ వేదికపైకి ఎక్కి ‘ఈ దేశం గర్వించదగిన గొప్ప కళాకా రుడిని ముష్కర మూకలు హత్య చేశాయి. ఈ దేశంలో కళాకారులకు రక్షణ లేకుండా పోయింద’ని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు సైతం అలాంటి ఘటనలే పునరావృతం కావడం విచారకరం. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ‘లజ్జ’ రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై జరిగిన దాడి అయినా, సాల్మన్ రష్దీపై, ఎం.ఎఫ్ హుస్సేన్‌పై, సఫ్దర్ హష్మీపై జరిగిన దాడులైనా, ఇప్పుడు తమిళనాడులో పెరుమాళ్‌పై జరిగిన దాడులైనా భావప్రకటనా స్వేచ్చపై దాడులుగానే గుర్తించాలి. మతం పేరిట రాజకీయాలు చెల్లవంటున్న గొంతులన్నింటికీ మురుగన్‌పై దాడిని సంఘ్ పరివార్ సమాధానంగా చెప్పదల్చుకుందా?
 
 ‘విన్నావు కదా అని దేన్నీ నమ్మొద్దు. నీ మత గ్రంథాల్లో ఉందనో, మీ గురువో, పెద్దవాళ్లో చెప్పారనో దాన్ని నిజమనుకోవద్దు. ఆచారాలు గుడ్డిగా నమ్మాల్సిన పనిలేదు. ఎందుకంటే వాటిని ముందు తరాల నుంచి కొత్త తరాలు అందుకుంటాయి. కొంచెం పరిశీలించి.. ఇంకొంచెం విశ్లేషించాక దేన్నైనా నువ్వు సహేతుకంగా ఆమోదిస్తే.. అది కూడా పదిమందికి ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తే... అప్పుడు దాన్ని ఆమోదించు. దానికి తగ్గట్టుగా జీవించు...’ అని వేల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఈ జాతికి హితబోధ చేశాడు. ఈ క్రమంలోనే మురుగన్ సాహిత్య ప్రక్రియలో సృజనాత్మక వ్యక్తీకరణ చేశాడు. ఆ పుస్తకంలోని భావాలపై చర్చకు దిగొచ్చు. విమర్శించవచ్చు. కానీ ఇలా భౌతిక దాడులకు పూనుకోవడం ఆటవిక చర్య కాదా? అందుకే మురుగన్‌పై దాడిని ముక్తకంఠంతో ఖండిద్దాం. ప్రశ్నించే చైతన్యాన్ని ప్రతి గుండెలో నింపాలని తపనపడే గుండె అలసిపోవద్దు. ఆగిపోవద్దు. మురుగన్ మళ్లీ కలం పట్టాలి.
 
 - పి.వి. రావు  సీనియర్ జర్నలిస్టు, సంగారెడ్డి, మెదక్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement