
ఆటో ఆయిల్ ఇంజిన్!
ఆటో ఆయిల్ ఇంజిన్‌ను సృష్టించిన మెకానిక్
లీటర్ డీజిల్‌తో రెండు గంటలు పనిచేస్తుంది.
ఖర్చు తక్కువ , మన్నిక ఎక్కువ.
చైనా ఇంజిన్ల కంటే చవక
కార్తె బలువున కురువని వర్షం కరువై కాటేస్తే.. కడుపు నింపు తుందనుకున్న పంట కళ్ల ముందే నిలువునా ఎండి పోతే గుండె పగిలిన రైతు లు బలవన్మరణాల పాల వుతున్నారు. ఒక ఊరిది కాదు, ఒక పల్లెది కాదు. ఆ చివర అనంతపురం నుంచి ఈ చివర ఇచ్ఛా పురం వరకు.. ఎందరో రైతుల పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితిలో పదునెక్కిన ఆలోచనే వారికి పరిష్కారాన్ని కూడా చూపిస్తోంది. సాగునీటి కష్టాలను చూసి చలించిన రామ శివప్రసాద్‌లో మొగ్గ తొడిగిన ఆలోచన ఆటో ఇంజిన్‌తో నీటి పంపు తయారీకి పురికొల్పింది.
వరంగల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో వృత్తి రీత్యా ఆటో మెకానిక్ అయిన రామ శివప్రసాద్ ఆటో ఇంజిన్‌నే ఆయిల్ ఇంజిన్‌గా తీర్చిదిద్దాడు. చైనా ఆయిల్ ఇంజిన్ కంటే మన్నిక ఉన్న ఈ పంపు సెట్ 7.5 హెచ్‌పీ ఇంజిన్ కంటే ఎక్కువ నీరు తోడగలుగుతోంది. ఏకంగా 240 అడుగుల దూరం నుంచి నీటిని తోడే సామర్థ్యంతో 24 గంటల పాటు నడిచినా ఇంజిన్ వేడెక్కకుండా నిలుస్తోంది. ఇంధన ఖర్చు కూడా చాలా తక్కువ. లోడు ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు డీజిల్ ఆయి ల్‌తో గంటన్నర సేపు నడుస్తుంది. లోడు తక్కువగా ఉంటే 2 గంటలు పనిచేస్తోంది. రైతులు దీని పని విధానం పట్ల పూర్తిగా సంతృప్తి చెందారు.
రామ శివప్రసాద్ చదివింది ఏడో తరగతి వరకే. రైస్‌మిల్లులో 15 ఏళ్లు పనిచేశాక ఆటో మెకానిక్ పని నేర్చుకొని షాపు పెట్టుకున్నాడు. ఆటోలతో పాటు చైనా పంపు సెట్లు, పవర్ స్ప్రేయర్లు కూడా బాగు చేసేవాడు. మాటిమాటికీ మరమ్మతుకొచ్చే చైనా మోటార్లను మోసుకొస్తూ ఇబ్బందులు పడే రైతుల బాధలను చూసి తానూ బాధపడేవాడు. చివరకు ఎలాగైనా ఈ ఇబ్బందిని పరిష్కరించే కొత్త తరహా మోటార్‌ను తయారు చేయాలని నిర్ణయించుకొని, గత వేసవిలో పని ప్రారంభించాడు.
ప్రతి నెలా ఒక పంపు సెట్‌ను తయారు చేయడం, పరీక్షించి చూసుకొని, అందులోని లోపాలను గుర్తించడం, తిరిగి మార్పులు చేయడంపైనే రామ శివప్రసాద్ దృష్టిని కేంద్రీకరించాడు. ఆ విధంగా ఆరు నెలలు శ్రమించి చివరకు 12 వోల్ట్స్ బ్యాటరీతో సెల్ఫ్ స్టార్టర్‌తో కలిపి మోటార్ పంపును రూపొందించాడు. ఇప్పటి వరకు 20 మంది రైతులు దీన్ని తయారు చేయించుకొని వినియోగిస్తున్నారు. మోటార్ తయారీకి దాదాపు 22 వేల రూపాయలు ఖర్చయింది. మార్కెట్‌లో దొరికే ఆయిల్ ఇంజిన్లు, కరెంట్ పంపు సెట్ల ధరలు చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులో లేవు. తక్కువ ఖర్చుతో మాంచి మన్నికైన పంపును సృష్టించిన రామ శివప్రసాద్ సృజన రైతు లోకం నీటి కష్టాలను తీర్చే వరప్రసాదమనే చెప్పాలి.
- మహేందర్, న్యూస్‌లైన్,
శాయంపేట, వరంగల్ జిల్లా
కమ్ముకున్న కారు మబ్బు చినుకు కురవక తొలగిపోతే పచ్చగెదిగిన పంట చేలు కనుల ముందె నిలువునెండగ.. గుండె చెదిరిన రైతు బిడ్డడు లోకమే ఎడబాసిపాయే..!
6 నెలలు కష్టపడి తయారుచేశా!
రైతులు పడే బాధ నన్ను కదిలించింది. ఆటోలో పది, పదేహేను మంది వెళ్తుంటారు. ఇంత లోడును భరించే ఆటో ఇంజన్ బావిలోంచి నీరు లాగలేదా? అనిపించింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఒక ఆటో ఇంజిన్‌తో ప్రయోగాలు మొదలు పెట్టాను. తయారు చేయడం.. పరీక్షించడం.. అర్థమైన లోపాలను సరి చేయడం.. ఇలా 6 నెలలు కష్టపడి సాధించాను. ఇంజిన్‌ను సెల్ఫ్ స్టార్టర్‌తో సిద్ధం చేశాను. దీని తయారీకి రూ. 22 వేలు ఖర్చయింది. ఈ ఇంజిన్లను ఇప్పుడు 20 మంది రైతులు వాడుతున్నారు. ఈ ఇంజిన్ కాలువలు, బావుల్లోంచి నీరు తోడగలదు. బోరు బావులకు పనిచేయదు. అయితే, దీనికి డైనమో బిగించి కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే రెండు మోటార్లకు కరెంట్ అందించవచ్చు. డబ్బుల్లేక డైనమో తయారు చేయలేదు. త్వరలో అది కూడా తయారు చేస్తా. రైతులు కావాలంటే ఇలాంటి ఆటో ఆయిల్ ఇంజిన్లు తయారు చేసి ఇస్తా.