మహేశ్బాబు సాక్షిగా.. చెప్తే వింటారని! | corporate studies are very dangerous to students | Sakshi
Sakshi News home page

మహేశ్బాబు సాక్షిగా.. చెప్తే వింటారని!

Published Sun, Aug 23 2015 2:55 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

corporate studies are very dangerous to students

తల్లిదండ్రులాలా ఒక మాట.. 331ని 3తో భాగించలేని పిల్లలు పెద్దవాళ్లయి ఇన్ఫోసిస్ లో, విప్రోలో నాకు తెలిసి ఇరవై మందుండారు టీమ్ లీడర్లుగా! పిల్లల్ని ‘చదువు చదువు’ అంటా వో అని నసపెట్టబాకండి. అన్నం తినే నోటితో చెప్తున్నాను. ఇది నిజం.

పదైదేండ్లుగా వో అని సైకిలు మింద తిరిగింది తిరిగినట్టే వుండా. నన్ను జూసి వొక్క రెక్క లేదే సైకిలు. గోదావరి జిల్లాల్లో సైకిలికి అరిటి గెలల్ని వందనంగా కట్టుకోని కేళీ విలాసంగా గసపోసుకుంటా తిరిగే ఆ రైతుల నాణ్యాన్ని అది పనిగా ఎవరూ చూడ్డం లేదే! అదే మహేశ్బాబు శ్రీమంతుడు సిల్మాలో షూటింగప్పుడు సైకిలెక్కి నాలుగు రౌండ్లేసే సరికి సైకిలికి యాడలేని బడాయొచ్చేసిందే! కొరటాల శివ యింగా వొక డైలాగ్ చెప్పించుండాల్సింది మహేశ్తో-: మహేశ్బాబు సైకిలు మింద పోతాపోతా ఒక కారాపి, కారులో వుండే వాడితో, ‘‘రేయ్ నీకు కాసేపు ఎకనామిక్స్ చెప్పాల్రా. చాలా యింపార్టెంట్ పాయింట్. కారు కొనే స్తోమత వున్నవాడు హీరోహోండా కొనాలి. హీరోహోండా కొనే స్తోమత వున్నవాడు సైకిల్ కొనాలి. దీన్ని రివర్స్ చేసి కారెక్కావేంట్రా. దిగమ్మా దిగు. మన దేశానికి గ్రీసు పరిస్థితిని రానీకండ్రా. పొల్యూషన్ని తగ్గించండ్రా.’’ అని నాలుగు మాటలనిపించి వుంటే కొంతయినా పెట్రోలు పొగ తగ్గేది గదా! (అమర్త్యసేన్ చెప్తే మనమా వింటాం!)

నేనీ కార్పొరేట్ విద్య మింద ‘చదువులా? చావులా?’ అని ఒక పుస్తకం రాసినా. రాసి పదైదేండ్లు కావస్తుండాది. బ్ఠచ్చులో పుస్తకం వొకటి రాసి పడేస్తే యీ పిలకాయలు చచ్చిపొయ్యేది నిలిపేస్తారని రాయలా. తల్లిదండ్రులూ, టీచర్లూ కొందురన్నా చదివి పిల్లల మింద కొంచెమన్నా కనికరం చూపిస్తారని రాసినా. అదేం జరగలా. భౌతిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే చదువుకునే పిల్లల ఆత్మహత్యలిప్పుడు మళ్లీ ‘త్వరణ వేగం’తో పుంజుకున్నాయి. వీటినన్నిట్నీ పేపర్లల్లో చదివి నేను మళ్లా నా యింకీ పేనాను విదిలించి మళ్లా తొక్కలో వ్యాసం వొగటి మిణికితే ఎవురు పట్టించుకుంటారు! పరిస్థితి చూస్తా వుంటే యిప్చడీ తెలుగు రాష్ట్రాల్లో మహేశ్బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూ. ఎన్టీఆర్, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ - ఇట్లా కొందురు ప్రవక్తల మాదిరిగా, గొప్ప తత్వవేత్తల మాదిరిగా కనిపిస్తున్నారు నా ప్రాణానికి. నేనొక పుస్తకం రాయడమో వ్యాసం రాయడమో అడ్డదారిగానే వుంది.

ఒకే ఒక రహదారి ఏమంటే - నేనిప్చడు ఆగమేగాల మింద ఎంపి గల్లా జయదేవ్ది  తిరప్తే గాబట్టి నేనాయన దగ్గిరికి పొయ్ మడిజేతులు కట్టుకోని ఆయన బావమరిది మహేశ్బాబుతో వొక భేటీ ఏర్పాటు చెయ్యమని కుయ్యో మొర్రో అని అపాయింట్ మెంట్ సంపారించుకొని మహేశ్ సమక్షంలోకి పొయ్ పిల్లి మాదిర నిలబడాల. ‘వీడా యిప్చడు నాకు కథ చెప్పబోతాడు!’ అని మహేష్ బాబు నా కల్లా కేవిలంగా చూసినా రోషపడగూడదు. ‘ముందు లైన్ చెప్పు.’ అని మహేశ్ అంటాడు. నేను గూడా టైమ్ సెన్సును పాటించి, నా చిత్తూరు జిల్లా ప్రజల భాషను తీసి జేబీలో పెట్టుకోని, ‘‘సార్. మీరొక లెక్చరర్. మీ పాఠాలు వినడం వల్ల మన రెండు రాష్ట్రాల్లో విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోరు, తల్లిదండ్రులెవరూ పిల్లల్ని సాధించరు, టీచర్లెవరూ పిల్లల్ని తిట్టరు, కొట్టరు.’’అని నేను నోరు మూసుకోవాల. మహేశ్ ‘మనం సినిమా చేస్తున్నాం’ అని అనడం, నాకు కుశాలతో గుండెపోటోచ్చి అక్కడికక్కడే పడి చచ్చిపోవడం- నీళ్లు తాగినంత సులువుగా జరిగిపోవాల. ఇట్లా నా జన్మ వృత్తాంతం ముగిసి నేను మట్టిలో కలిసిపోతే ఎంత బాగుంటాది!
 నామిని సుబ్రమణ్యం నాయుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement