తన తండ్రి అగుపడని సత్యాల కోసం వెదకి వెదకి, సత్యమిది అని ఊహే గాని నిరూపించుకోలేని పరిస్థితిలో చనిపోయాడు. కనపడని సత్యాల కోసం మానవజన్మలో పొందవలసిన సౌఖ్యాలు వదులుకోవడం తెలివితక్కువ.
తెలుగు సాహితీ ప్రపంచంలో ఎన్నో జీవమున్న కథల్నీ, మరచిపోలేని పాత్రల్నీ సృష్టించి కథానికా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు బలివాడ కాంతారావు (మొన్న జూలై 3 ఆయన జయంతి). మనుషుల మనస్తత్వాన్ని ఒడుపుగా పట్టుకునే శక్తి ఉన్న ఈ రచయిత ఎన్నో నిత్యజీవిత విషయాలను జీవితం ప్రతిఫలించేలా చిత్రించారు. బలివాడ కథల్లో ఒక గొప్ప కథ ‘దారి తప్పిన మనిషి’.
ఆ కథాపరిచయం క్లుప్తంగా...
మూర్తి వ్యాపారరీత్యా కారుమీద నూరుమైళ్ల దూరంలోని పట్నం వెళ్లి, ఉదయం తిరిగి వచ్చేటప్పుడు తన తండ్రి మిత్రుడి ద్వారా అక్కడో దేవాలయంలో తండ్రి శిలావిగ్రహాన్ని చూస్తాడు. వ్యాపారాలలో వచ్చిన లాభాలలో సగం డబ్బు దానాలకే ఇస్తూ నిరాడంబరంగా జీవించిన తండ్రి శిలావిగ్రహం అక్కడున్నట్టు అంతవరకూ మూర్తికి తెలియదు. తండ్రి చనిపోయాక మూర్తి దానాలను పూర్తిగా ఆపివేస్తాడు. అతన్ని దేవాలయానికి తీసుకొచ్చిన వ్యక్తి ఆ శిలావిగ్రహానికి నమస్కరించి ‘దారి తప్పని మహానుభావుడు’ అంటూ తండ్రీ కొడుకుల మధ్య భేదాన్ని ఎత్తి పొడుస్తాడు.
మూర్తి ఆలోచనల్లో పడతాడు. తన తండ్రి అగుపడని సత్యాల కోసం వెదకి వెదకి, సత్యమిది అని ఊహే గాని నిరూపించుకోలేని పరిస్థితిలో చనిపోయాడు. కనపడని సత్యాల కోసం మానవజన్మలో పొందవలసిన సౌఖ్యాలు వదులుకోవడం తెలివితక్కువ. డబ్బు, తాగుడు, స్త్రీ ఈ మూడూ తప్పించి ఇంకేమీ సుఖమీయలేవు. నేడు సుఖపడు తున్నవాళ్లే దారి తప్పనివాళ్లు... ఇలా ఆలోచిస్తూ కారు నడుపుతున్న మూర్తి దారి తప్పి అరణ్యమార్గంలోకి వస్తాడు.
ఘాట్ పైకి వెళ్లి తిప్పుదామని ఓసారి కారు దిగుతాడు. చుట్టూ ప్రకృతి ఆకాశాన్ని గొడుగుగా వేసుకున్నట్లుంది. గాలికి గులాబీవనంలో రెక్కల వర్షం కురుస్తోంది. కమలాలు రాల్తున్నాయ్. మూర్తి తిరిగి కారు స్టార్టు చేయబోతుండగా అద్దంలో ఒక యువతి కనిపిస్తుంది. ఎర్రరంగు చీర కట్టుకొని ఉప్పొంగిన యవ్వనంలో ఉన్న ఆమె మూర్తివైపోమారు చూసి ముందుకు సాగిపోతుంది. మూర్తి మనసు అదుపు తప్పుతుంది. కారును ఆమె వద్దకు తీసుకెళ్లి, దిగబెడతానని చెప్పి ఎక్కించుకొని వివరాలడుగుతాడు.
కొండల వెనకనున్న ఊరామెది. ఘాటీ కింద కన్నవారి ఊళ్లో పొలంలో ఉండగా మొగుడుకి పెద్ద జబ్బు చేసిందన్న కబురు తెలిసి ఎకాయెకిగా బయలుదేరింది. మూర్తి లౌక్యంగా మాటలతో ఆమెను పడగొట్టి, కారును ఓ వటవృక్షం కింద ఆపుతాడు. తియ్యని సోడా అంటూ తాగించి మత్తులో ఉన్న ఆమెను అనుభవిస్తాడు.
ఇక్కడ అశ్లీలతకు తావు లేకుండా ‘ఎర్రని చీర గాలికి ప్రక్కనే ఉన్న నీటిలోకి ఎగిరిపడి కొంతమేర తడిసింది. తడిసిన చీర రంగు నీటిలో వెలిసింది. ఆ నీటిలోని ఎరుపు రంగు పొద్దు పీల్చుకుపోయింది’ అంటూ రాసిన రచయితకు జోహార్లు చెప్పకుండా ఉండలేం.
స్పృహ వచ్చాక ‘‘దారిన పోయేదాన్ని నన్ను దారి తప్పించేశావ్! నీకిది న్యాయమా? నా మొగుడికి నా ముఖం ఎలా చూపించను?’’ అంటుంది. ‘‘నీకూ నాకూ తప్ప ఇంకెవరికీ తెలీదులే! పద నిన్ను వేగంగా దిగబెడతాను’’ అంటూ కారు స్టార్ట్ చేస్తాడు.
కారు లోయ పక్కనే ఉన్న సన్నటి బాటగుండా పోతుండగా, ఆమె అతని భుజాలపై ముద్దు పెట్టుకొని, ‘‘అటు చూడు బాబూ! ఎంత చక్కగా ఉందో?’’ అంటూ తూర్పు వైపు చూపిస్తుంది. ముద్దు పెట్టుకుందన్న సంతోషంతో అతనటుచూసి ‘వహవ్వా’ అంటాడు. ఆమె చప్పున బలమంతా ఉపయోగించి స్టీరింగును గిరగిర తిప్పివేస్తుంది. కారు దారితప్పి కొన్ని వందల అడుగుల లోయలోకి జారిపోతుంది. ఊహకందని ఈ కథ ముగింపు సంభ్రమానికి గురిచేస్తుంది. కంట నీరు పెట్టిస్తుంది. ఆశించే సుఖాలకు ఒక హద్దు ఉండి తీరాలని మనసును తట్టి చెబుతుంది.
- చోడిశెట్టి శ్రీనివాసరావు, ఫోన్: 8978614136
దారి తప్పని కథకుడు
Published Sun, Jul 5 2015 3:48 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
Advertisement