డెబ్బయి ఏళ్లుగా మోగుతున్న జనఢంకా అరసం
వరంగల్ భారతీయ విద్యాభవన్‌లో సెప్టెంబర్ 27, 28 రెండు రోజులపాటు అరసం 17వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్న సందర్భంగా....
తెలుగు నేలపై ప్రగతిశీల సాహిత్యోద్యమం 1943లో మొదలైంది. దీనికి 1935లో ఇంగ్లాండ్‌లో పునాదులు పడ్డాయని చరిత్ర చెబుతున్నా 1936లో లక్నోలో జరిగిన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ తొలి సభలు ఇందుకు ఊపు తెచ్చాయి. సాక్షాత్తు రవీంద్రనాథ్ టాగోర్ మద్దతు, ప్రేమ్‌చంద్ వంటివారి వెన్నుదన్ను, మంటో, చుగ్తాయ్, ముల్క్‌రాజ్ ఆనంద్ వంటివారి భాగస్వామ్యంతో జరగడం వల్ల ఈ సభలు దేశం నలుమూలలా దృష్టినాకర్షించాయి.
ఈ నేపథ్యంలో 1943 నాటికి విజయనగరంలో కూడా చాగంటి సోమయాజులు, శెట్టి ఈశ్వరరావు వంటి రచయితలు ఇటువంటి వేదిక ఆవిర్భావం కొరకు ఆలోచనలు చేస్తున్నారు. తెనాలి నుంచి చదలవాడ పిచ్చయ్య కూడా ఇలాంటి ఆలోచనతోనే వీరిని కలిశారు. అప్పటికే తెలుగు సాహిత్యంలో అనిశెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి, మగ్దూం, సోమసుందర్, వట్టికోట, కొడవటిగంటి, దాశరథి తదితర రచయితలు కార్యరంగంలో ఉన్నారు. వీరిలో చాలామందికి ఇలాంటి సంఘం ఒకటి ఏర్పడాలన్నది కోరిక. దాని సాకారం కొరకు చదలవాడ పిచ్చయ్య పూనిక మీద అందరూ వచ్చి పాల్గొనేందుకు వీలుగా తెనాలిలో 1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో తొలి ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం సభలు జరిగాయి. వీటికి తాపీ ధర్మారావు అధ్యక్షత వహించారు. తర్వాత రెండో మహాసభ విజయవాడలో, మూడవది రాజమండ్రిలో, ఆ తర్వాత గుంటూరు జిల్లా పెదపూడిలో సాహిత్య పాఠశాల... ఆ పై నాలుగో మహాసభ... ఈ వరుసలో దేశంలో ఏర్పడ్డ అనేక పరిణామాల వల్ల ఆ తరువాతి ఎనిమిదేళ్ల దాకా అంటే 1955 దాకా అరసం తన అయిదో మహాసభలు నిర్వహించుకోలేకపోయింది. 1955లో ఈ సభలు ఉప్పల లక్ష్మణరావు, శ్రీశ్రీ ఆధ్వర్యంలో జరిగాయి. ఇక ఆరో మహా సభలకు పట్టిన కాలం అక్షరాలా పందొమ్మిదేళ్లు. ఇవి ఒంగోలులో 1974లో జరిగాయి.
ఈ పందొమ్మిదేళ్ల కాలంలో కొత్త కవితాస్వరాలు వచ్చి అలుముకున్న స్తబ్దతను ప్రశ్నించాయి. దిగంబర, పైగంబర వంటి కవితా ఉద్యమాలు తమ వంతు ప్రభావాన్ని ప్రసరించాయి. విశాఖ యువకుల కరపత్రం శ్రీశ్రీ షష్టిపూర్తికి విడుదల అయి ఆ దరిమిలా హైదరాబాద్‌లో 1970 జూలై 4న విరసం ఆవిర్భవించింది. అయినా అరసం తన ఆరవ సభలు జరుపుకోవడానికి ఇంకా నాలుగేళ్లు (1970 నుంచి 1974 దాకా) పట్టింది. ఆ తర్వాత అరసంలో రెండు వర్గాలు ఏర్పడి పోటాపోటీ సభలు నిర్వహించాయి. క్రమంగా అసలు అరసం స్తబ్దుగా అయిపోవడంతో కొత్త అరసం బలం పుంజుకుంది. తుదకు అరసం ఏ రాజకీయ పక్షానికీ అనుబంధ సంస్థ కాదని తేల్చి చెప్పిన చాసో కూడా ఆరుద్ర సూచనతో ఎమర్జెన్సీకి మద్దతు ఇచ్చిన సిపిఐవారి వేదికైన కొత్త అరసంలో చేరి తను మరణించే వరకు అంటే పదకొండో మహాసభ వరకూ సేవలందిస్తూనే వచ్చారు. వారి కాలంలోనూ ఆ తరువాత కూడా డా.పరుచూరి రాజారాం, డా.ఎస్.వి.సత్యనారాయణ, డా.చందు సుబ్బారావు, పెనుగొండ లక్ష్మీ నారాయణ ప్రభృతులు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అరసం ముఖ్యులలో ఆర్వీయార్, తుమ్మల వెంకట రామయ్య, ఏటుకూరి ప్రసాద్, సొదుం రామ్మోహన్ మొదలైనవారు విలువైన సేవలు తమ తమ రంగాలలో అందించారు.
ప్రస్తుతం రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఇప్పటి అరసం కూడా ఇక ముందు రెండు రాష్ట్ర వేదికలుగా పని చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గత చరిత్రకు ఏ మేరకు బాధ్యత వహిస్తూ ఏ విశ్వాసాలతో ముందుకు వెళతారు అనేది ఆ మాటను రచయితలు ఎంత కచ్చితంగా చెప్తారనేది ప్రశ్న. తెలుగువారి అరసం ప్రపంచ అభ్యుదయ ప్రవాహంలో ఒక భాగం. అంతకన్నా తక్కువా కాదు, ఎక్కువా కాదు. అభ్యుదయ సాహిత్యం- భౌతిక అవసరాలు తీరే ఒక సమాజంలో జీవించే మానవాళి కోసం ఒక తాత్విక భూమికగా, ఆధిపత్య శక్తుల పట్ల ఒక సార్వత్రిక నిరసన కలిగి ఉంటుంది. ఆ ఉజ్వల ఘట్టాలపై సరైన గౌరవం లేకుండా ప్రమాదకర సంక్షిప్తీకరణలకు పూనుకోవడం, తమకు అనుకూలమైన చోట ఎక్కువ రాసుకుంటూ పోవడం అన్ని చరిత్రలకు మల్లే సాహిత్య చరిత్రకు కూడా శోభనివ్వదు. తొలి యాభై ఏళ్లలో కేవలం పది సభలు మాత్రమే జరుపుకుని అందులో సగం మొదటి అయిదు ఏళ్లలో ఏడాదికొకటిగా తరువాతి అయిదూ మిగిలిన నలభై అయిదు ఏళ్లలో జరుపుకోవాల్సి వచ్చిన కారణాలు ఏమిటో ప్రజలు ఆలోచిస్తారు. ఆ బాధ్యత తమది అని భావించే సాహిత్య వేదికలు తమ చరిత్రతో తామే కుప్పిగంతులు వేయవు. సభలు, సమీకరణాల కార్యాచరణ ఎట్లా ఉన్నా అరసం సాహిత్య చరిత్ర వ్యక్తుల చరిత్ర కాదు, అది అక్షరాల చరిత్ర. త్వమేవాహాల, వజ్రాయుధాల, మహా ప్రస్థానాల, అగ్నివీణల, భల్లూక స్వప్నాల, ప్రజల మనుషుల, రథ చక్రాల, తెలంగాణాల, పులిపంజాల, జన జీవన కోలాహల యాత్ర. ఏడు పదుల వెలుగు మేడ. అరసమొక సాహిత్య వారాశి. దాన్ని పెరటి చెరువులా పరిచయం చేయడం ఒక ప్రాంతీయ దుస్సాహసం. అరసానికి ప్రగతి యాత్ర శుభాకాంక్షలు.
- రామతీర్థ 98492 00385