భవిష్యత్ తెలిసిన భాషాశాస్త్రవేత్త
తెలుగు మాతృభాషగా ఉన్నవారు, అంటే తెలుగువాళ్లు నిఘంటువులను సరిగా ఉపయోగించుకోవడం కూడా అలవాటు చేసుకోలేదు. 1987 ప్రాంతంలో ఆచార్య జీఎన్ రెడ్డి (గోళ్ల నారాయణస్వామి రెడ్డి, 1927-1989) చెప్పిన మాట ఇది. చేకూరి రామారావు, భద్రిరాజు కృష్ణమూర్తి వంటి భాషా శాస్త్రవేత్తల సమకాలికుడు జీఎన్ రెడ్డి. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యునిగా, విశేష పరిశోధకునిగా ఆయన చెప్పిన ఈ మాట, ప్రాచీన భాష హోదా వివాదం కంటే చాలా ముందునాటిదే. వైస్‌చాన్స్‌లర్ అయిన తొలి తెలుగు అధ్యాపకుడు ఆయనే. జీఎన్ చెప్పిన ఆ మాట అభిమానాలకూ, ఆభిజాత్యాలకూ, వివాదాలకూ అతీతమైనది. భాష వర్ధిల్లడానికీ, అసలు బతకడానికీ అవసరమైన శాస్త్రీయ పద్ధతుల గురించి అవగాహన ఉన్న భాషాశాస్త్రవేత్తగానే జీఎన్ ఈ మాట అన్నారని అర్థమవుతుంది. ఇంతటి కఠోరవాస్తవాలు చెబితే తెలుగువారు భరించే స్థితిలో లేరు. అందుకే తెలుగు భాషకు విశిష్ట సేవలు అందించినప్పటికీ ఆయన గురించి ఇప్పటివరకు పుస్తకమంటూ రాలేదు. ఇన్నాళ్లకైనా డాక్టర్ డీఎం ప్రేమావతి ఆ లోటు తీర్చారు. ‘జీఎన్ రెడ్డి’ పేరుతో ఆమె రాసిన చక్కని పుస్తకాన్ని ఎమెస్కో ప్రచురించింది.
ఈ పుస్తకం, ఇందులో చివర ఉన్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ఇంటర్వ్యూ చదివాక తెలుగువాళ్లకి ఆ భాషకు చెందినవారిమన్న స్పృహ ఉంటే చాలా ప్రశ్నలు వస్తాయి. రావాలి. జీఎన్ విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రం అభ్యసించారు. తెలుగు భాషకు సంబంధించి మన బోధన, పరిశోధన ఎంత వెనుకబడి ఉన్నాయో గ్రహించారు. తెలుగు భాషా బోధనే కాదు, పాఠ్య ప్రణాళిక కూడా సక్రమంగా లేదన్నదే ఆయన వాదన. ప్రాథమిక స్థాయిలో తెలుగు భాషను బోధించే ఉపాధ్యాయులకు భాష స్వరూపం, దాని తత్వం గురించి ఉండవలసినంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల నష్టం జరుగుతున్నదని ఆయన చెప్పారు (దాని ఫలితాన్ని మనం చూడడం లేదా!).
విదేశాల్లో పదో తరగతి తరువాత మాతృభాషా బోధన అనివార్యం కాదు. ఎందుకంటే, అప్పటికే విద్యార్థి మాతృభాషలో ప్రావీణ్యం గడించి ఉంటాడు (చదవడంలో, రాయడంలో కూడా). ఈ అంశాన్ని మనం గమనించామా? బోధన స్థితి ఇలా ఉంటే, పరిశోధన కూడా ఉపరిశోధనగానే ఉండిపోయిందని ఆయన గుర్తించారు. భాషలో పరిశోధన అంటే కావ్య నాటక ప్రబంధాలకూ, కవులకూ పరిమితం కాదు. ఆ భాష మాట్లాడే ప్రజల అలవాట్లు, సంప్రదాయాలు, పండుగలు, నమ్మకాలు, పేర్లు, జీవనం- అన్నీ పరిశోధనాంశాలేనంటారు. ఎస్వీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖను ఆ మేరకు తీర్చిదిద్దేందుకు యత్నించారు. జీఎన్ తెలుగును కూడా ఒక భవ్య భాషగా గౌరవించారు. ఇప్పుడు చాలామంది దృష్టిలో తెలుగు భవిష్యత్తులేని భాష. ఆయన ఆశకూ, మన నిరాశకూ మధ్య ఇంతటి వ్యత్యాసం ఎందుకు జనించిందో ఈ పుస్తకం జవాబిస్తుంది.
(నేడు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో 10.30కి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. వివరాలకు ఫోన్: 040-23264028)
- కల్హణ
ప్రాథమిక స్థాయిలో తెలుగు భాషను బోధించే ఉపాధ్యాయులకు భాష స్వరూపం, దాని తత్వం గురించి ఉండవలసినంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల నష్టం జరుగుతున్నదని చెప్పారు జీఎన్.