సాహితీ మేరువు ‘జీవీ’
- నేడు జీవీ కృష్ణరావు శతజయంత్యుత్సవం
తెలుగు సాహితీ ప్రక్రియలన్నింటిలోనూ తన విశి ష్టతను చాటిన సాహితీ మేరువు జీవీ కృష్ణరావు,. ఆయన సునిశిత పరిశీలన నుంచి తప్పించుకున్న సాహిత్య వస్తువేదీ లేకపోవటం విశేషం. డాక్టర్ జీవీ కృష్ణరావు పూర్తి పేరు గవిని వెంకట కృష్ణరావు. తెనాలి సమీపంలోని కూచిపూడి ఆయన స్వస్థలం. సాధారణ రైతు కుటుంబంలో 1914 నవంబర్ 15న జన్మించారు. గ్రామంలో ప్రాథమిక విద్య, దగ్గర్లోని తురుమెళ్లలోని జార్జి కారొనేషన్ హైస్కూలు విద్య చదివారు. అప్పటికే ఆయనకు కవిత్వం అలవడిం ది. గుంటూరు ఏసీ కాలేజీలో తెలుగు ప్రత్యేక పాఠ్యాంశంగా బీఏ చదివారు.
ఆ రోజుల్లోనే ‘వరూ ధిని’ ఖండకావ్యం రాశారు. ఆంధ్ర సాహిత్యంతో పాటు సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లోని ఔచిత్యా లను గుర్తెరిగి ‘సునీధ’ వంటి నాటికలు రాశారు. కాశీలో ఎంఏ ఇంగ్లిష్ సాహిత్య అధ్యయనం ప్రారం భించారు. ప్లేటో, అరిస్టాటిల్, కాంటే, హ్యూమ్, హెగెల్‌ల దర్శనాలను, పాశ్చాత్య కావ్యాలు, కావ్యా నుశాసనాలు, ప్రాచీన భారత దర్శనాలను ఔపోసన పడుతూ వచ్చారు. బనారస్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం ఫలంగా ‘కావ్యజగత్తు’ అవతరిం చింది. ఆర్థిక సమస్యతో ఇంటికి తిరి గొచ్చారు. గుంటూరులో ‘దేశాభిమాని’ పత్రికలో కొంత కాలం పనిచేసి బయట పడ్డారు. మిత్రులతో కలసి ప్రజాసా హిత్య పరిషత్తు పేరుతో ప్రచురణ సం స్థను, ‘సమీక్ష’ పేరుతో పత్రికను స్థాపిం చారు. అనంతరం ‘ఆంధ్రప్రభ’లో సబ్ ఎడిటర్‌గా చేరారు. నార్ల, శ్రీశ్రీతో పని చేశారు. ‘జఘనసుందరి’ నవల అప్పు డు వెలువడింది.
తెనాలిలో చక్రపాణి, కొడవటిగంటి, త్రిపుర నేని గోపీచంద్ వంటి రచయితల సాంగత్యంతో కృష్ణరావుకు ఇంగ్లిష్ సాహిత్యాభిలాషే కాకుండా ఎంఎన్ రాయ్ రచనలపై ఆకర్షణ, మార్క్సిస్టు దృక్పథం అలవడ్డాయి. ‘లోకం కోసం ఏడిస్తే అది కవిత్వం, తన కోసం ఏడిస్తే స్వార్థం, తన కోసం, లోకం కోసం ఏడిస్తే అది ధర్మం, రెండింటి కోసం ఏడ్చినట్లు నటిస్తే అది రాజకీయం’ అంటూ కవిత్వ ప్రయోజనాన్ని విడమరిచి చెప్పిన కృష్ణ రావు, తన రచనల్లో సమాజాన్ని ప్రతి బింబిస్తూ వచ్చారు. కొద్దికాలం తర్వాత పత్రికా రంగానికి కూడా ఉద్వాసన పలి కారు. మళ్లీ చదువుబాట పట్టి, పీజీ చద వకుండానే పీహెచ్‌డీ డిగ్రీ కోసం మద్రాస్ (చెన్నై)లో పరిశోధన చేశారు.
సింగళి సూరన ‘కళాపూర్ణోదయం’పై ఇంగ్లిష్‌లో బృహద్గ్రంథాన్ని వెలువరిం చారు. తెలుగు క్లాసిక్‌గా గుర్తింపు పొం దిన ‘కీలుబొమ్మలు’ నవలను పూర్తి చేశారు. ప్లేటో తాత్విక విచారాన్ని విపులీకరిస్తూ ‘జేగంటలు’ రాశారు. 1952లో తెనాలిలో వీఎస్‌ఆర్ కాలేజీలో అధ్యాపక వృత్తిలో చేరారు. పదేళ్ల తర్వాత ఆ ఉద్యో గానికి రాజీనామా చేశారు. 1963లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో చేరి 1973లో ఉద్యోగ విర మణ చేసేవరకు పనిచేశారు. సాహిత్య వ్యాసంగాన్ని మాత్రం జీవితకాలం కొనసాగించారు.
తెలుగు భాషా సంప్రదాయానికనుగుణంగా పుల్‌స్టాప్‌లు, కామాలు, కోలన్‌లు లేకుండా ‘యుగసంధ్య’ పద్యకావ్యం రాశారు. ప్రజలందరికీ అన్నం పెట్టలేని ఈ వ్యవస్థపై ‘భిక్షాపాత్ర’ నాటికతో తిరుగుబాటు చేశారు. ‘బొమ్మ ఏడ్చింది’ వంటి ఎన్నో రచనలు చేశారు. పాఠకుని పెదిమ విరియ టం, కన్ను కురియటం జరిగినప్పుడే రచన సార్థకం అవుతుందనీ, అదే ఉత్తమ కృతి అనీ, అలా కాన పుడు ఆ రచన బొందు వేసిన పైరు అవుతుందని చెప్పుకున్నారు.
1979 ఆగస్టు 23న ఆయన సన్ని హితుడు అనపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కృష్ణరావు రచ నలను ఏర్చికూర్చి ఏడు సంపుటాలుగా వెలువరిం చి పాఠకులకు అందుబాటులో ఉంచారు. డాక్టర్ జీవీ కృష్ణరావు సాహిత్య సమాలోచన, జీవీకే మర ణానంతరం 1980లో తీసుకొచ్చిన ‘సాహితీ చైత్ర రథం’ పుస్తకాన్ని ఆయన కుటుంబం 2013లో పున ర్ముద్రించింది. నవంబర్ 15న ఆయన జన్మస్థలమైన కూచిపూడిలో, 16న తెనాలిలో జీవీకే శతజయంతిని నిర్వహించనున్నారు.
బి.ఎల్.నారాయణ
సీనియర్ జర్నలిస్టు, తెనాలి