బోయి భీమన్న జయంతి
సెప్టెంబర్ 19న ‘పద్మభూషణ్’ బోయి భీమన్న జయంతి
మౌలిక సాహిత్యం ఏదీ ఎక్కడుంది? కన్యాశుల్కం లేదా అంటే అది ఒక కులానికి ఒక మాండలికానికి పరిమితమైన స్థానికం.
బోయి భీమన్న
19 సెప్టెంబర్ 1911
16 డిసెంబర్ 2005
తెలుగు సాహిత్యంలో మౌలికత లేదా? నిజంగా లేదేమో! ఉంటే ఏదీ? ఎక్కడా కనిపించదేం? ఎక్కడ దాక్కుంది? నన్నయగారి ఐతిహాసిక యుగం నుంచి పెద్దనగారి ప్రబంధం వరకు అన్నీ తత్సమాలు. కృష్ణశాస్త్రిగారి భావకవితాయుగం నుంచి శ్రీశ్రీగారి అభ్యుదయ కవితాయుగం వరకు ఆంగ్ల తద్భవాలు, అన్యదేశ్యాలు. మరి మనదని మురిసిపోగల మౌలిక సాహిత్యం ఏదీ ఎక్కడుంది? కన్యాశుల్కం లేదా అంటే అది ఒక కులానికి ఒక మాండలికానికి పరిమితమైన స్థానికం. సాహిత్యానికి ప్రధాన గుణమైన సర్వజనీనత కన్యాశుల్కంలో లేదు. మరి బ్రహ్మంగారు, వేమన, కవిరాజు, జాషువా వంటి పేర్లు సాహితీరంగ రింగుమాస్టర్లకు పనికిరావు. ఆ పేర్లవాళ్ళు పంక్తిబాహ్యులైన శూద్రులూ వర్ణబాహ్యులైన హరిజనులూను! మరి చెప్పండి? ఎంకి పాటలున్నై అయితే అవి నాయుడుబావతో ముడిపడి వున్నై. నాయుడు పంక్తిబాహ్యుడు కాడా? ‘కందం వ్రాసినవాడే కవి, తినుచున్న అన్నమే తినుచుంటిమిన్నాళ్ళు, వయస్సుమళ్ళిన సోమరులారా చావండి, తాజమహలు నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’ ఇటువంటి పాక్షిక ప్రగతినిరోధక, మత్తుమందు మాత్రలను ప్రజలకు తినిపించడం వల్లనే మౌలికసాహిత్యం ముందుకు రాలేకపోతున్నదన్న వాస్తవాన్ని ఎవరైనా గుర్తించారా.
మౌలికసాహిత్యానికి వుండవలసిన ప్రధానగుణం సమకాలీనత. సమకాలీనత లేని రచన ఎంత గొప్పదైనా, అది సాహిత్యమనిపించుకోదు. వేద పురాణాలు, రామాయణ మహాభారతాలు ఆనాటి జీవిత సరళికి కళాత్మక చిత్రణలు. అందుకే వాటికి కాలదోషం లేదు. ఏ కాలంలో ఏ దేశంలో ఏ భాషలో వెలువడినప్పటికీ అవి అన్నికాలాలకు అన్నిదేశాలకు అన్నిభాషలకు చెందినవే అవుతాయి. అట్టి విశ్వసాహిత్యాన్ని ఎవరైనా ఎప్పుడైనా తమభాషలోకి అనువదించుకోవచ్చు. అనువదించుకోవాలికూడ. అయితే అట్టి అనువాదాలు మౌలికసాహిత్యం కాదు.
పాలేరంటే ఎవరు? యజమాని కింద బానిసలా పనిచేసే ప్రతి అస్వతంత్రుడూ పాలేరే. అట్టి ప్రతివాడూ తన బానిసతనాన్ని తొలగించడానికి నిరంతరం కృషి చేయవలిసివుంది. వాల్మీకికి రాముడు సమకాలీకుడు, వ్యాసుడికి ధర్మరాజు సమకాలీకుడు, నాకు పాలేరువెంకన్న సమకాలీకుడు. పాలేరును నిష్పాక్షిక దృష్టితో చూసేవారికి అది ఎంతో రసవంతంగా, రమణీయంగా కనిపిస్తుంది. అలా కనిపించబట్టే లక్షలాదిజనం దాన్ని అభిమానించారు. వేలకొలది ప్రదర్శనలిచ్చారు. అయితే ఈ నాటకానికి పండితలోక సన్మానాలెందుకు జరగలేదంటే పండితులు దళితవర్గాలలోని ప్రతిభను గుర్తించరు కనుక. సత్యహరిశ్చంద్ర నాటకం చూచి ఎందరు సత్యవ్రతులయ్యారో తెలియదుకానీ పాలేరు నాటకం చూచి వేలమంది పాలేళ్ళు పాలేరుతనాలు వదిలేసి పాఠశాలలో చేరడం మాత్రం వాస్తవంగా జరిగింది. నాటకప్రయోజనం అది ఏ లక్ష్యాన్ని సాధించదలచిందో దాన్ని సాధించినప్పుడే సిద్ధించినట్లు. పాలేరు నాటకలక్ష్యం సాంఘిక విప్లవం. అది సాధించబడింది.
(పాలేరు నాటకానికి భీమన్న రాసుకున్న పీఠిక నుండి సంక్షిప్తంగా...)
(భీమన్న సాహితీ నిధి ట్రస్టు-కవి సంధ్య నిర్వహణలో భీమన్న జయంతి సభ సెప్టెంబర్ 19న సాయంత్రం 5:30కి బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్ హాలులో జరగనుంది.)