పథంతో పదం కలసి
కవిత - 2013
కవిత్వం దౌడు మీద ఉంది. అది కాగితాన్ని వదలి చేతికి అందని కంప్యూటర్ తెరల మీద విశ్వరూపం ప్రదర్శిస్తూ ఉంది. ఉద్యమం పిలిచినప్పుడు బదులు పలకడం, నిరాశ కమ్ముకున్నప్పుడు తోడు నిలవడం, సందిగ్ధ సందర్భాలలో వ్యాఖ్యానం వినిపించడం, కొత్త కోకిలల బృందగానానికి పదాలను సమకూర్చడం అది ఇప్పుడు చేస్తున్న పని.
2013 కచ్చితంగా కవిత్వం తన ప్రమేయాన్ని నిరూపించుకున్న సంవత్సరం. కొత్త కవులు వచ్చారు.
కొత్త ఫేస్‌బుక్ వేదికలొచ్చాయి. పాత కవులు, పరిణతి చెందిన కవులు కాలంతో పాటు నడవడంలో
వెనకడుగు వేయకుండా ముందుకే సాగారు. కవిత్వ సంపుటాలు, అవార్డులు, పోటాపోటీలు...
నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచినట్టుగా ఒక ఊపు. కవిత్వపు ఊపు.
వీటన్నింటి నేపథ్యంలో 2013లో వచ్చిన కవిత్వంపై ఒక విహంగ వీక్షణం.
‘కవిత్వం జీవితానికి సాక్ష్యం. జీవితం పూర్తిగా తగలబడిపోతున్నపుడు మిగిలే బూడిద కవిత్వం’
- లియొనార్డ్ కోహెన్, కెనెడియన్ కవి
2013 కవిత్వం అలాంటి తగలబడుతున్న జీవితాలని చూపించింది. తగలబడ్డాక మిగిలిన బూడిదనూ చూపించింది. గత సంవత్సరాలతో పోలిస్తే నిజంగానే 2013 చూసిన సంక్షోభాలు, అనుభవించిన విషాదాలు సామాన్యమైనవి కావు. అవన్నీ చూసిన తెలుగు కవి ఊరికే ఉండలేకపోయాడు. దుఃఖితుడై ఒక్కొక్క కవితా వాక్యంలో తనను తాను దగ్ధం చేసుకోవడమే కాదు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కుదిపివేతకు గురైన తన అంతర్లోకాలను కూడా కవిత్వంలో బలంగా వినిపించాడు.
‘ఒక పద్యం రాయాలి; సముద్రాలు వెదకాలి రోదసిని గాలించాలి; చితుకులు రాజుకునే ఒక పదం కోసం’ కవి ఈ కాలంలోనే పరితపించాడు
(హెచ్చార్కె- భిక్షుక భోజనం). ‘మనమెందుకిలా అన్నింటినీ వొదులుకుని; అన్నింటినీ పోగొట్టుకుని; నిస్సారంగా నిర్వ్యామోహంగా మృతప్రాయంగా’ ఉన్నామని అతడు వాపోయాడు (శివారెడ్డి- బతుకు ఒక పాట). ‘నా చుట్టూ విస్తరిస్తున్న ప్రపంచం; నా బతుకేదో నన్ను బతకనివ్వదు గదా; వేషమూ భాషా నన్ను నాలాగా ఉండనివ్వవు’ అని అతడు అసహనం వ్యక్తం చేశాడు (గంటేడ గౌరునాయుడు- నాలో మా ఊరు). ‘ఎదిగేకొద్దీ మనిషి లోపలి లేతశిశువు మరణిస్తున్నందుకు’ బావురుమన్నాడు (పలమనేరు బాలాజీ - వెలుతురు దారి). చివరకు ‘చిన్నప్పుడే నయం/ అద్దం ముందు నుంచుంటే ఇప్పటిలా మరెవరో కనిపించేవారు కాదు’ అనడంలోని విషాదం ఈ కాలపు విషాదం... ఈ కాలంలో కవిని పట్టి కుదిపేసిన విషాదం (కె.గీత- పుట్టగొడుగు మడి).
అయితే ఇంతా చేసి కవికి ఈ దుఃఖం ఎందుకు? ఈ నొప్పి ఎందుకు? ఒక ‘మాట’ కోసమా? అవును. ఈ సంక్షోభకాలంలో కవి ఆశిస్తున్నది కవే ఏమిటి ప్రతి మనిషీ ఆశిస్తున్నది మాటే. సాటిమనిషి నుండి మనిషితనం నిండి మాట. అది ఎలా ఉండాలంటే ‘అప్పుడే కళ్లు తెరిచిన నవజాత శిశువు; మార్మికపు చిరునగవులా’ ఉండాలి (విమల - ఒకే ఒక్క మాట); కాని అలాంటి మాట కనిపించడం లేదు. అందుకే ‘మాట్లాడుకోని మనుషులు వొచ్చారని; ఇంట్లోని వస్తువులు అన్నీ విసుక్కుంటాయేమో’ అని విసుక్కున్నాడు కవి (ఆశారాజు - మనం లేనపుడు). ‘ఈ అంతర్దర్శనం లేకుండా; రేపు ఏ బాహ్యదర్శనానికి వెళ్లగలను’ (దర్భశయనం - లోపలికి) అని కవి లోకాన్ని చూడటం కంటే ముందు తనలో తాను కూడా చూసుకోవడం ఈ కాలంలో కనిపించింది.
‘కొన్ని మంచి కవితలు రాయడానికి భయంకరమైన నిరాశ,
అసంతృప్తి, భ్రమలు తొలగిన స్థితి అవసరం’ - చార్లెస్ బుకోవ్‌స్కీ, అమెరికన్ కవి
2013లో తెలుగు కవిని సహజంగానే ‘తెలంగాణ’ ఎక్కువ కుదుపునకు లోను చేసింది. తన ప్రాంత అస్తిత్వానికి జరుగుతోన్న అన్యాయాలని ఏకరువు పెడుతూ, తెలంగాణ రాష్ట్ర సాకారంతోనే న్యాయం జరుగుతుందని ప్రకటిస్తూ తెలంగాణ కవి విస్తృతంగా కవిత్వాన్ని సృజించాడు. ‘నేనిప్పుడు వేయికాళ్లతో నడిచే కాష్టాన్ని; సుక్కల రుమాల్ని వేలుకు కట్టుకుని; దిమ్మీసలాడుతూ భూమ్మీద; తైతక్కలాడుతూనే ఉంటాను’ (సిద్ధార్థ- మహా ఖననం) అంటూ ఉద్యమంతో కలిసి దిమ్మీసలాడాడు కవి. ఒకవైపు తెలంగాణ యిచ్చామని చెబుతూ హైదరాబాద్‌పై ఆంక్షలు పెట్టడాన్ని చూసి ‘ఓ కులీ... ఇయాల చేపలంతా కలిసి దువా చేస్తున్నాయ్; అనకొండలు తొలగి పోవాలె; మా చెరువు మల్లా చేపలతో కలకలలాడాలె’ (స్కైబాబ- దువా) అని ప్రార్థన చేశాడు కవి. అయితే కవులందరూ ఇదే అంటారా? తమ ప్రాంతం పలికే మాటను ఉద్యమానికి మరో ముఖంగా వినిపించకుండా ఉంటారా? హైదరాబాద్‌తో తమ పిల్లలకున్న అనుబంధాన్ని చెప్తూ ‘ఈ అభినవ కాలిఫోర్నియాలో మా పిల్లలు/ అమీర్‌పేటలు తప్ప అమలాపురాలు సమజైత లేదంటరు’ (తుల్లిమల్లి విల్సన్ సుధాకర్- యుద్ధాన్ని కలిసే చేద్దాం) అంటున్న కవికి ఏం సమాధానం చెబుతాం? అయితే ఈ బాధ ఎలా ఉన్నా ఒక ఉద్యమానికి తోడు నిలుద్దాం అనుకున్న కవులు ఎప్పుడూ ఉంటారు. ‘ఒక నిలువుదోపిడీ పరంపర ముగిసింది’ (పైడి తెరేష్ - దక్కిన పీటభూమి) అన్నా, ‘ఈ స్వాతంత్య్రాన్ని స్వాగతిద్దాం’ (ప్రసాదమూర్తి- ఇక ప్రేమించుకుందాం) అన్నా, ‘చాలు... పొసగని సంసారపు ఉమ్మడి నాటకం చాలు’ (జి. వెంకటకృష్ణ - ‘ఒక నగరాన్ని నిర్మిద్దాం రండి’) అన్నా కవి ఎవరి పక్షం నిలవాలో తెలియచేయడం కోసమే. అయితే చాలా ఆసక్తికరంగా ఒక తెలంగాణ ముస్లిం కవి ‘తెలంగాణ సాయబునైనందుకు; నా నుదుటి మీది నల్లటి నమాజు మచ్చై వెంటాడుతోంది’ (ఖాజా- మూసీ ఆవాజ్) అని దుఃఖిస్తే మరో సీమ ముస్లిం కవి హైదరాబాద్ కోసం ఉద్యమిస్తున్న మెజారిటీలను చూసి ‘మరి ఈ దేశమే నాది కాదంటివి; ఈ మట్టే నాది కాదంటివి; ఇక్కడ పుట్టిన నాకెంత బాధ వుండెనో వినకపోతివి’ (షరీఫ్ - మద్దల ముందు రోలు) అని తన తరతరాల గోడు వెళ్లబోసుకున్నాడు.
అయితే ఉద్యమాలు ఉంటాయి. తక్షణ స్పందనలు ఉంటాయి. దానికి ముందు ఇంతవరకూ వేసుకొచ్చిన దారి కూడా ఉంటుంది. 2013లో సీనియర్ కవులు అన్నింటికీ స్పందిస్తూనే తమ దారిలో స్థిరంగా ముందుకు కదలడం కనిపిస్తుంది. చౌరస్తాలో చెప్పులు కట్టే స్త్రీని చూసి ‘ఈ దేశపు చౌరస్తాలు; నా కులవృత్తి కళారహస్యనికేతనాలు; ఆమె మోచిమా కాదు మోతీమా; మా జాతి మేలిముత్యం’ అని ఆకట్టుకుంటారు శిఖామణి. చార్ధామ్ కల్లోలాన్ని చూసిన ఎన్.గోపి ‘ఒక హృదయ విదారక దృశ్యాన్ని ఎదుట నిలిపిందెవరో’ అని దుఃఖానికి సహానుభూతిని పాఠకుల్లో కలిగిస్తారు. ‘వెళ్లడానికి కాళ్లకి ఇంకే అడుగూ తోచక’ తన వైపు వచ్చే స్నేహితుడి దిగులును అఫ్సర్ బరువుగా కవిత్వం చేస్తే ‘మరొకరెవరో నీ జీవితాన్ని; ముల్లులాగా ఊడబెరికి పోతున్నట్టు తెలుస్తుంది’ అని ఎదుటివారి బాధను మన మనసులో ముల్లులా దింపుతారు వాడ్రేవు చినవీరభద్రుడు. ‘చాలా చోట్ల వెళ్లలేకపోవడం నేరమే; ముఖ్యంగా నదీమూలం లాంటి ఇంటికి’ అనడంలో యాకూబ్ యథావిథి మార్క్. ‘పెళ్లాం అర్థం కాదు.. పిల్లలు అర్థం కారు.. ఉద్యోగం అర్థం కాదు; రాజకీయాలర్థం కావు; చివరకు జీవితం అర్థం కాదు’ అని రామా చంద్రమౌళి అనడంలో ఒక సమూహపు బలమైన ప్రతిస్పందన లేదూ? అయితే ఈసారి ‘రాత్రి’ కొంతమంది కవుల్ని కదిలించింది. రాత్రి అందాన్ని ఆస్వాదిస్తూ బి.వి.వి. ప్రసాద్ ‘చూడడమనే అనుభవాన్ని పంచుతోన్న జీవితమెంత బాగుంది’ అని పులకరిస్తే, ఆ రాత్రి వెన్నెలనే చూసిన అన్నవరం దేవేందర్ ‘ఎన్నీల ఎలుగు పల్లెటూరంత స్వచ్ఛం’ అని తెరిపినపడతారు. ‘ఆకాశం నిద్ర పోదు. నేనూ మేలుకునే ఉన్నాను’ అని రాలే ఉల్కల్ని చూస్తూ మేల్కొంటారు అరుణ్ సాగర్. అయితే కాసుల లింగా రెడ్డి చూసిన రాత్రి తీవ్రమైనది. ‘ఆమె ఫ్రిజిడిటీతో అతని రాత్రులు గడ్డకట్టాయి’ అని ఉలిక్కిపడేలా చేస్తాడతడు.
‘సరిగ్గా అర్థం చేసుకోవడానికి పూర్తిగా ధ్వంసం చేసుకున్నాను’
- ఫెర్నాండో పెసోవ, పోర్చుగీసు కవి.
ఈ సాధన సాగుతోంది. గతంలో కొనసాగింది. 2013లోనూ కొనసాగింది. ధ్వంసం చేసి అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోవడానికి ధ్వంసం చేసుకోవడం అందులో నుంచి కొత్తది వెలుగు చూడటం తెలుస్తూనే ఉంది. 2013లో వంశీధర్ రెడ్డి, నరేశ్ కుమార్, నంద కిశోర్, మెర్సీ మార్గరేట్ వంటి తాజా కవుల కదనును పరిశీలనతో గమనించాం. ‘ప్రియురాండ్ల చేతుల్లో పిల్లలు నవ్వుతారు; నెలవంక నెత్తి మీద నక్షత్రం వెలుగుతుంది’ అని కొత్త కవి (నంద కిశోర్) అంటున్నాడంటే దాని ప్రవాహం తాజాగా సాగుతున్నట్టే కదా. ఇక ఇదివరకే తమ ప్రతిభ చాటుకొని స్థిరంగా కవిత్వం కొనసాగిస్తున్న దేశరాజు, ప్రసాదమూర్తి, కెక్యూబ్ వర్మ, రవి వీరెల్లి, పసునూరు శ్రీధర్‌బాబు, నిషిగంధ, కె.వి.కూర్మనాథ్, పసుపులేటి గీత వంటి కవులందరూ కలం దించక ఈ యేడు కూడా కవిత్వాన్ని వెలిగిస్తూ రావడం ఆనందపడే సంగతి.
ప్రతి సంవత్సరంలాగే 2013లో అనేక కవితా సంపుటులు వెలువడ్డాయి. గాథ (శివారెడ్డి); హృదయరశ్మి (ఎన్.గోపి); రజనీగంధ (పాపినేని శివశంకర్); ఆశారాజు (నూతన పరిచయం); హెచ్చార్కె (గొడ్డలి భుజం); దర్భశయనం (పొలం గొంతుక); శిలాలోలిత (గాజునది);
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ (మాకూ ఒక భాష కావాలి) వీటిలో కొన్ని. అలాగే ముకుంద రామారావు వెలువరించిన ‘నోబెల్ కవిత్వం’ పాఠకుల ఆదరణ పొందింది. భారతీయ భాషల్లోని కవిత్వాన్ని ‘పొరుగు వెన్నెల’గా ఎలనాగ పరిచయం చేశారు. ఈ సంతోషాలను ఒక చేత ఇచ్చి త్రిపుర, కలేకూరి ప్రసాద్, కెఎస్ రమణ వంటి ప్రతిభామూర్తులను పట్టుకుపోయిన సంవత్సరం ఇది.
కవి పని కవిత్వమే. కీర్తి, వ్యామోహాలకు అతీతంగా ఈ పని చేసుకుంటూ పోతూ ఉంటే మెచ్చేవాళ్లు మెచ్చకపోరు. గమనించేవారు గమనించకా పోరు. నెత్తిన పెట్టుకునేవారు ఒకరోజు ముందూ వెనకలుగా పెట్టుకొని ఊరేగించకా మానరు. అందుకు ఈ సంవత్సరపు దాఖలా- అలిశెట్టి ప్రభాకర్ సమగ్ర
కవితల సంపుటి.
- కోడూరి విజయకుమార్
వ్యాసకర్త కవి; ‘వాతావరణం’, ‘అక్వేరియంలో బంగారు చేప’, ’అనంతరం’... వీరి కవితా సంపుటాలు.