రావిశాస్త్రిని గాంచిన వేళ
జ్ఞాపకం
నాకు గుర్తున్నమటుకు నా మెడిసిన్ సబ్జక్టు పుస్తకాలు కాకుండా రిపీటెడ్‌గా చదివింది రావిశాస్త్రినే!
‘‘ఇది ఇందూదేసెం! ఈ దేసంలోనే గాదు, ఏ దేసంల అయినసరె పోలీసోడంటే గొప్ప డేంజిరిస్ మనిసని తెలుసుకో! ఊరికి ఒక్కడే గూండా ఉండాలా, ఆడు పోలీసోడే అవాల. అప్పుడె రాజ్జెం ఏ అల్లర్లు లేకండ సేంతిబద్రతలు సక్కగ ఉంటయ్. అంచేత్త ఏటంతే, పులికి మీసాల్లాగినట్లు పోలీసోడితో దొంగసరసం జెయ్యకు! సాలా డేంజరు!...’’
ఈ వాక్యాలు ఎవరివో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా రాయడం ఒక్క రావిశాస్త్రికి మాత్రమే సాధ్యం. ఇది ‘మూడుకథల బంగారం’లో సూర్రావెడ్డు బంగారిగాడికి చేసిన ఉపదేశం.
ఒక పద్ధతిగా, ప్రశాంతంగా, హాయిగా, నింపాదిగా సాగిపోతున్న నా జీవితం - ఒక్కసారిగా పెద్ద కుదుపుకు లోనయ్యింది. అందుక్కారణం రావిశాస్త్రి! నేను హౌజ్ సర్జన్సీలో ఉండగా ‘ఆరుసారా కథలు’ చదివాను. ఆ భాషా, ఆ వచనం, ఆ భావం... దిమ్మ తిరిగిపోయింది.
అంతకుముందు వరకు స్థిరంగా, గంభీరంగా నిలబడే అక్షరాల్ని చదివాను గానీ - లేడిలా చెంగుచెంగునా పరుగులు తీస్తూ, పాములా సరసరా మెలికలు తిరిగే వచనాన్ని నేనెప్పుడూ చదవలేదు. ఆ తరువాత రావిశాస్త్రిని ఒక్కపేజీ కూడా వదల్లేదు. నాకు గుర్తున్నమటుకు నా మెడిసిన్ సబ్జక్టు పుస్తకాలు కాకుండా రిపీటెడ్‌గా చదివింది రావిశాస్త్రినే!
విశాఖపట్నం వెళ్లాలి, రావిశాస్త్రిని కలవాలి. ఎలా? ఎలా? ఎలా? నాకు విశాఖపట్నం వెళ్లడం సమస్య కాదు, కానీ రావిశాస్త్రిని ఎలా కలవాలి? అందుగ్గాను ఎవర్ని పట్టుకోవాలి? ఇదే సమస్య.
‘రావిశాస్త్రిని కలిసి ఏం మాట్లాడతావోయ్?’
‘అయ్యా! దేవుణ్ని దర్శనం చేసుకోవాలి. కుదిర్తే కాళ్లమీద పడి మొక్కాలి. అంతేగానీ - దేవుడితో మాట్లాడాలనుకోవడం అత్యాశ!’
ఈ రకమైన ఆలోచనల్లో వుండగా - విశాఖ ప్రయాణం ఒకరోజు రాత్రికి రాత్రే హడావుడిగా పెట్టుకోవలసొచ్చింది. కారణం - మా సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఈఎన్‌బీ శర్మగారి అవసానదశ. పనిలో పనిగా రావిశాస్త్రిని కూడా కలవాలనే ఎజెండా కూడా నా ప్రోగ్రాంలో చేర్చాను. ఆ రోజంతా రావిశాస్త్రి ఇంటి ముందు బీటేసినా లాభం లేకపోయింది.
కొన్నాళ్లకి నా అదృష్టం ధనలక్ష్మీ లాటరీ టికెట్టులా తలుపు తట్టింది. రావిశాస్త్రి ఒక పుస్తకావిష్కరణ సభకి గుంటూరు రావడం జరిగింది. చివరిక్షణంలో సమాచారం తెలుసుకున్న నేను ‘భలే మంచిరోజు, పసందైన రోజు’ అని మనసులో పాడుకుంటూ ఉరుకుపరుగులతో ఏకాదండయ్య హాలు(హిందూ కాలేజ్ ఆడిటోరియం) దగ్గరికి చేరుకున్నాను.
అక్కడ హాల్ బయట ఓ పదిమంది నిలబడి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. నేనూ ఓ పక్కగా నించుని రావిశాస్త్రి కోసం ఎదురుచూడసాగాను. ఒక్కొక్కళ్లుగా సభా స్థలానికి చేరుకుంటున్నారు. ‘ఇంతకీ రావిశాస్త్రి రాలేదా?’ కొద్దిగా అనుమానం, ఇంకొద్దిగా నిరాశ.
ఓ పది నిమిషాలకి - అరచేతుల చొక్కా టక్ చేసుకుని - తెల్లటి వ్యక్తి, నల్లటి ఫ్రేమ్ కళ్లద్దాలతో నిదానంగా నడుచుకుంటూ ఆవరణలోకి రావడం కనిపించింది. ఆ వ్యక్తి ఎవరో నాకెవ్వరూ చెప్పనక్కర్లేదు. ఆ వ్యక్తి నాకు అనేక ఫొటోల ద్వారా చిరపరిచితం. ఆయనే రావిశాస్త్రి!
క్షణాలు లెక్కపెట్టుకుంటూ ఎంతో ఉద్వేగంగా రావిశాస్త్రి కోసం ఎదురుచూసిన నేను - తీరా ఆయన వచ్చేసరికి చేష్టలుడిగి నిలబడిపొయ్యాను. ఈలోపు కొందరు ఆయనతో మాట్లాడ్డం మొదలెట్టారు. రావిశాస్త్రినే గమనిస్తూ ఆయనకి సాధ్యమైనంత సమీపంలో నిలబడ్డాను. ఈలోపు నేను మెడికల్ డాక్టర్నని ఆయనకెవరో చెప్పారు. నాకేసి చూస్తూ ‘మా చెల్లెలు నిర్మల తెలుసా?’ అనడిగారు.
‘తెలుసు. వారు నాకు ఫార్మకాలజీ పరీక్షలో ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ సార్’ అని బదులిచ్చాను. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇంతే!
రావిశాస్త్రి పక్కన చాలాసేపు గడిపాను (నిలబడ్డాను). ఒక్కమాట మాట్లాడలేదు. ఎవరెవరో ఏంటేంటో అడుగుతున్నారు. అవన్నీ - ‘రాజు-మహిషి’ ఎప్పుడు పూర్తిచేస్తారు? ‘రత్తాలు రాంబాబు’ని పూర్తిచెయ్యకుండా ఎందుకు వదిలేశారు?’ వంటి రొటీన్ ప్రశ్నలే. అవన్నీ నా మనసులో మెదలాడే ప్రశ్నలే! అయితే - నాకు వాళ్ల సంభాషణ చికాకు కలిగించింది. ‘రావిశాస్త్రి నావాడు, నాకు మాత్రమే చెందినవాడు, నా మనిషిని ఇబ్బంది పెడతారెందుకు? అసలిక్కడ మీకేం పని? పోండి పోండి!’
నేను తెలివైనవాణ్ని. అందుకే కళ్లు పత్తికాయల్లా చేసుకుని రావిశాస్త్రినే చూస్తూ ప్రతిక్షణం నా మనసులో ముద్రించుకున్నాను. ఎందుకంటే - నాకు తెలుసు. ఆ క్షణాలు నా జీవితంలో అమూల్యమైనవిగా కాబోతున్నాయని. అందుకే ఈ రోజుకీ రావిశాస్త్రి నాకు అతి దగ్గరలో నిలబడి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాను. ఈ అనుభూతి నాకు ఎంతో ఆనందాన్ని, మరెంతో తృప్తిని కలిగిస్తుంది.
ఒక్కోసారి అనిపిస్తుంది - నేనారోజు రావిశాస్త్రి ముందు ఎందుకలా నిలబడిపోయాను? ఒక మహోన్నత శిఖరం ముందు నిలబడ్డప్పుడు ఆ దృశ్య సౌందర్యానికి స్పెల్‌బౌండ్ అయిపోయి... చేష్టలుడిగి నిలబడిపోతాం. ఆ రోజు నా స్థితి అట్లాంటిదేనా? అయ్యుండొచ్చు!
వై.వి.రమణ
yaramana.blogspot.in
(వ్యాసకర్త సైకియాట్రిస్ట్).