కొన్ని కథల్ని మనుషులు మొదలు పెడతారు. కొన్ని కథల్ని మెషీన్‌లు మొదలుపెడతాయి. కొన్ని కథల్ని మెషీన్‌లను ఉపయోగించే మనుషులు మొదలుపెడతారు. చాలాకాలం క్రితం సెక్రటరీ అనేది మగవాళ్ల పని. 1880లో టైప్‌మెషీన్ కనిపెట్టాక అది ఆడవాళ్ల పని అయ్యింది. టైప్ తెలిసిన ఆడవాళ్లు, ఆఫీసు వ్యవహారాలను ‘సీక్రెట్’గా ఉంచుతూ నమ్మకంగా పని చేసే ఆడవాళ్లు - ‘సెక్రటరీలు’. ఇరవయ్యవ శతాబ్దపు మొదలులో మొదలయ్యి 1950లకు ఉద్ధృతమైన ఈ పని చేసిన మేలూ మగవారి జీవితంలో తెచ్చిన మార్పూ అంతా ఇంతా కాదు. పుట్టించిన కథలూ అన్నీ ఇన్నీ కావు. సెక్రటరీలు చాలా మంది జీవితాలను వెలిగించారు. చాలామంది జీవితాలను ఆర్పేశారు. సుభాస్ చంద్రబోస్ తన సెక్రటరీనే పెళ్లి చేసుకున్నాడు. దోస్తవ్ స్కీ అదే పని చేశాడు. మన శ్రీశ్రీ కూడా డబ్బింగ్ సినిమాల పనికి తనకు సహాయకురాలిగా చేరిన సరోజను వివాహం చేసుకున్నారు. కొంతమంది దీనికి రివర్స్‌గా వెళ్లి ఇరకాటంలో పడ్డారు. భార్యలతో దెబ్బలు తిన్నారు. క్లింటన్‌లాంటివాడు లెవన్‌స్కీతో చాలాదూరం వెళ్లి చాలా లోతులో పడ్డాడు. ‘సెక్రటరీ’ నవలలోని రాజశేఖరం కూడా జయంతిని సెక్రటరీగా పెట్టుకున్నాక అంత సుఖంగా ఏమీ లేడు.
రాజశేఖరంకు ఒక సమస్య ఉంది. అతడి తల్లిదండ్రులు పారిపోయి హైదరాబాద్ వచ్చినవారు. అందువల్ల బంధువులంటూ ఎవరూ లేరు. ఒక్క కొడుకు- రాజశేఖరం పుడితే అతణ్ణే సర్వస్వం అనుకొని ఎవర్నీ కలవనిచ్చేది కాదు తల్లి. కలివిడిగా ఉండటం, మనసులో ఉన్నది చెప్పడం రాజశేఖరంకు చేతగాదు. ‘నన్ను నన్నుగా ప్రేమించుటకు’ అన్నట్టుగా తన అందం, ఆస్తి, వైభవం చూసి కాకుండా తన హృదయాన్ని చూసి ప్రేమించే అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే జయంతికి కూడా ఒక సమస్య ఉంది. ఆమెను ఆమె బామ్మ పెంచింది. బామ్మల పెంపకంలో ఆడపిల్లలు ఎలా పెరుగుతారో అలానే పెరిగింది. తెలిసీ తెలియనితనం, చాదస్తం, అనుమానం.... మగవాళ్లంటే లోపల ‘జడత్వం’ ఉండి పైకి నిక్కచ్చిగా ఉన్నట్టుగా కనపడుతూ వారిని దూరం పెడుతూ విలువల వంకతో అసహ్యించుకుంటూ ఉండే స్వభావమా జయంతిది అన్నట్టుగా ఉంటుంది. ‘నాకు ఉద్యోగం వచ్చింది వనితా విహార్‌లో. అక్కడంతా ఆడవాళ్లే ఉంటారు తెలుసా?’ అని ఎంతో సంతోషంగా చెప్తుంది బామ్మతో. అదే జయంతి ‘మీరంటే నాకు అసహ్యం’ అని అనేక సార్లు చెప్తుంది రాజశేఖరంతో. ఎందుకు అసహ్యం? ఏమో. తెలియదు.
వీరిద్దరూ కలవాలి. అందుకొక సుదీర్ఘ ప్రయాణం అవసరం. ఆ ప్రయాణమే పాఠకులను ఉత్కంఠకు గురిచేసి లక్షలాది మందిని గోళ్లు కొరుక్కునేలా చేసి ఈ నవలను ఇప్పటికి 86 సార్లు రీ ప్రింట్‌కు తెచ్చింది. ఊహించండి. ఒక అమ్మాయి. నెలకు నూట యాభై రూపాయల జీతం వస్తే చాలు అనే మధ్యతరగతి పిల్ల. అతడు? ఈ మధ్యనే ఆరు లక్షల ఆదాయాన్ని చూసిన వ్యాపారవేత్త. పైగా ఎప్పుడూ చుట్టూ ఆడవాళ్లు. రేఖారాణి అనీ, మిసెస్ వర్మ అనీ, మిసెస్ కరుణాకరం... ప్రమీల.... ఏదో ఒక గాసిప్. ఇలాంటి వ్యక్తి దగ్గర పని అంటే సింహం బోనులో ఉన్నట్టే. ఆ సింహం తన రాజసంతో, దర్పంతో, ఠీవితో ఆకర్షిస్తూనే ఉంటుంది. కాని ఏ క్షణం నోట కరుచుకుంటుందోనని భయం. జయంతి ఈ రెండు భావాల మధ్యా నలిగిపోతూ తప్పుల మీద తప్పులు చేస్తుంటుంది. రాజశేఖరంను ఒక్కసారి కూడా అర్థం చేసుకోదు. అభిమానంతో చీర కొనిస్తే దానిని తిరిగి ఇవ్వడానికి సిద్ధపడిపోతుంది. ఒక మంచి పార్టీలో అందరి సమక్షాన ఆమెను తన కాబోయే భార్యగా ప్రకటిద్దామనుకుని- కాసింత మంచి చీర కట్టుకోరాదూ అని రాజశేఖరం సూచిస్తే అది తన పేదరికం మీద, ఆత్మాభిమానం మీద కొట్టిన దెబ్బగా భావించి గింజుకుంటుంది. ఏదో కారణాన ఎవరో ఒక స్త్రీ అతని భుజం మీద తల వాల్చి ఓదార్పు చెందుతుంటే అది చూసి ఇతడు దుర్మార్గుడే అనే శాశ్వత నిర్ణయానికి వచ్చేస్తుంది.
నిజానికి జయంతి నెలకు నూటయాభై రూపాయల స్థితి ఉన్న మనుషులతోనే కొంచెం సౌకర్యంగా ఉండగలదు. శివరామ్‌లాంటి మామూలు ఉద్యోగి సమక్షంలో ఆమెకు కొంచెం ఊపిరి ఆడుతుంటుంది. కాని ఆ సంగతి అతడికి చెప్పదు. పైగా రాజశేఖరం ఈర్ష్య పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా గ్రహించకుండా తన స్థాయి మగవాళ్లతో చనువుగా మాట్లాడుతుంటుంది. వద్దని వారిస్తే, అది ప్రేమ అని గ్రహించక- ఏమిటి ఇతని అధికారం అని మరింత అసహ్యించుకుంటూ ఉంటుంది. ఈ అసహ్యం, ఇబ్బంది పెరిగి పెరిగి బెంగళూరు పారిపోతుంది. అక్కడ ఎవరెవరి దగ్గరో ఉంటూ దారీ తెన్నూ సొంత అభిప్రాయాలూ లేకుండా బతుకుతూ చివరకు తాను ఇన్నాళ్లూ కోల్పోయిన పెన్నిధి ఏమిటో గ్రహించి రాజశేఖరం దగ్గరకు తిరిగి వస్తుంది. నవల ముగింపువాక్యం - ఆమె అతణ్ణి గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టుకుంది- కాదు. అతడి శిరస్సును తన హృదయానికి హత్తుకుంది - కాదు. భుజం మీద తలవాల్చి తృప్తిగా కళ్లు మూసుకుంది.
అంతే. ఇలా భుజం మీద తలవాల్చి తృప్తిగా కళ్లు మూసుకునే జయంతితో భవిష్యత్తులో రాజశేఖరం ఎలా జీవించినా ఆమె అంత వరకూ వచ్చినందుకు పాఠకులకు ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. ఎక్కడలేని ఉత్కంఠ తీరి సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషం ఇవ్వడంలోనే ఈ నవల విజయం అంతా ఉంది.
1960లలో- అంటే ఈ నవలా కాలానికి దేశంలో రెండు ఉన్నాయి. ఒకటి- స్వాతంత్య్రం వచ్చి ఆడపిల్లలు కొద్దోగొప్పో బయటకు వచ్చి, చదువుకొని, ఉద్యోగాలకు ప్రయత్నించడం. రెండు- ఆర్థికంగా ఇంకా కుదురుకోనందు వల్ల సమస్యలు పెరిగి పెళ్లిళ్లు, కార్యాలు వంటివి అసంభవంగా మారడం. ఇలాంటి పరిస్థితుల్లో తమను ఎంచుకునేవాడు, లేదా తాము ఎంచుకునేవాడు ఒక రాజశేఖరంలా ఉండాలని ఏ ఆడపిల్లయినా కోరుకోవడంలో వింత లేదు. వాస్తవలోకంలో ఆ పని జరిగినా జరగకపోయినా కనీసం ఊహాలోకంలో అయినా ఆ పని జరిగేలా చేసి- లక్షలాదిమందికి తెలియని ఆనందం ఇచ్చిన నవల- సెక్రటరీ. అంతే కాదు, ఒక తరాన్ని తీవ్ర ప్రభావంలో ముంచెత్తి తమకు కాబోయే భర్తలను రాజశేఖరంతో పోల్చి చూసి నిరాశ చెందేంత వరకూ వెర్రెత్తించిన నవల ఇది.
సెక్రటరీలో సాహిత్యం లేకపోవచ్చు. ఇది సాహిత్య నవలల సరసన చేరకపోవచ్చు. కాని తన సులభమైన శైలి వల్ల, సరళమైన కథనం వల్ల, రాజు - పేద అనే రెండు బలమైన వర్గాల ప్రాతినిధ్య పాత్రల వల్ల ఆకర్షించి, వానాకాలం చదువులు చదివిన ఆడవాళ్లను కూడా పఠితులను చేసి, వారి చేత చదివించేలా చేసి, తెలుగునాట కొత్త పాఠకులను తయారు చేసిన నవల ఇది. ఆ పాఠకుల్లో కొందరైనా మంచి సాహిత్యం వైపు ప్రయాణించకుండా ఉంటారా? అదీ- సెక్రటరీ కాంట్రిబ్యూషన్. యద్దనపూడి సులోచనారాణి ఏ ముహూర్తాన సెక్రటరీ ఫార్ములాను కనిపెట్టారోగాని ఇది సీరియల్‌గా వస్తుండగా పే చేసింది. నవలగా పే చేసింది. సినిమాగా పే చేసింది. నిన్న మొన్న దీని ఆధారంగా ‘రాధ- మధు’ సీరియల్ తీస్తే ఘన విజయం సాధించి మరీ పే చేసింది. అంటే ఇందులో మనుషులకు ఇష్టమైనదేదో ఉంది. ఉంటుంది.
ఇవాళ సెక్రటరీలు లేరు. పోయారు. ఆ స్థానంలో పీఏలు వచ్చారు. సెక్రటరీ అనేది పైస్థాయి మాటై కూచుంది. అలాగే ఈ నవలలో కనిపించే అనాబ్‌షాహీ ద్రాక్ష తోటలు కూడా హైదరాబాద్‌లో లేవు. పోయాయి. వాటి స్థానంలో గేటెడ్ కమ్యూనిటీలు వచ్చాయి. ఆ మాటకొస్తే తెలుగులో నవలలైనా ఏం మిగిలాయని? అవీ పోతున్నట్టే.
పోనివ్వండి. ఏవి ఎటు గతించినా సెక్రటరీకి మాత్రం గతింపు లేదు.
ఎందుకంటే అందులోని అనాయాస రుచి అలాంటిది.
అది జో కొట్టే కలల ప్రపంచమూ అలాంటిదే.
నవల: సెక్రటరీ
రచయిత: యద్దనపూడి సులోచనారాణి
తొలి ముద్రణ: 1965 (1964లో జ్యోతి మాసపత్రికలో ధారావాహికం)
ఒక కాలపు మధ్యతరగతి ఆడపిల్లల ఆలోచనలని, ఆశలని, ఆత్మాభిమానాలని, అయోమయాలని అందిపుచ్చుకొని ఊహాలోకాల్లో విహరింపజేసి విస్తృత పాఠకాదరణ పొందిన నవల. తెలుగు పాప్యులర్ ఫిక్షన్‌లో మైలురాయి. తెల్లగా, పొడుగ్గా, హుందాగా ఉండే ‘రాజశేఖరం’ అనే పాత్రను నవలా నాయకులకు మోడల్‌గా చేసిన నవల ఇది. లెక్కలేనన్ని పునర్ము ద్రణలు పొందింది.మార్కెట్‌లో లభ్యం. వెల: రూ.100