
కర్నూలులో కథాసమయం
‘అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో చివరి సాహిత్య సమావేశాలు’ అనే మకుటంతో కర్నూలులో మే 31, జూన్ 1 రెండు రోజులపాటు కథారచయితల విస్తృత సమావేశాలు జరగనున్నాయి.
ఈవెంట్
‘అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో చివరి సాహిత్య సమావేశాలు’ అనే మకుటంతో కర్నూలులో మే 31, జూన్ 1 రెండు రోజులపాటు కథారచయితల విస్తృత సమావేశాలు జరగనున్నాయి. జి.వెంకటకృష్ణ, జి. ఉమా మహేశ్వర్, డా.ఎం.హరికిషన్, డా.కె.సుభాషిణి వీటిని నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది కథారచయితలు పాల్గొననున్నారు. ‘కొత్త కథకులు- కథావస్తువులు’, ‘కథకులు- కథానేపథ్యాలు’, ‘తెలుగు కథ- ప్రాంతీయ వైవిధ్యాలు’, ‘ఆధునిక స్త్రీల కథలు- గమ్యం- గమనం’ వంటి అంశాలపై చర్చలు సమీక్షలు ఉంటాయి. సుప్రసిద్ధ కథకులు, సాహిత్య అకాడెమీ యువ పురస్కార గ్రహీత వేంపల్లె షరీఫ్ వీటిలో మొదటి వరుస ఆహ్వానితుడిగా పాల్గొంటారు.
తెలుగు కథతో పాటు మాండలిక రచన- బాల సాహిత్యం- ఆత్మకథాత్మక మాలికలు ఇత్యాది రంగాల్లో విశేష కృషి చేసిన మూడు ప్రాంతాల శతాధిక కథారచయితలు సుంకోజి దేవేంద్రాచారి (రాయలసీమ), బమ్మిడి జగదీశ్వరరావు (కళింగాంధ్ర), పెద్దింటి అశోక్ కుమార్ (తెలంగాణ) ఈ సమావేశాలలో ఉంటారు. కవులుగా గుర్తింపు పొంది కథలూ రాస్తున్న జి.వెంకటకృష్ణ, భగవంతం, స్వాతికుమారి బండ్లమూడి, జి.లక్ష్మి, పలమనేరు బాలాజీ, కూర్మనాథ్, విమల, వేంపల్లి రెడ్డి నాగరాజు తదితరులు ‘కవి కథకులు’ అనే సెషన్‌లో తమ సృజనానుభవాలు పంచుకుంటారు.
జి.ఎస్.రామ్మోహన్, ఏ.వి.రమణమూర్తి తదితర విమర్శకులు ఈ సందిగ్ధ సందర్భంలో తెలుగు కథకు దారిదీపం అందించే అవకాశం ఉంది. తెలుగు కథకు కొత్తరక్తం బల్లెడ నారాయాణమూర్తి, ప్రశాంత్, పరిమళ్, ఇక్బాల్, పొదిలి నాగరాజు, అరిపిరాల సత్యప్రసాద్, వి.శాంతి ప్రబోధ, పూడూరి రాజిరెడ్డి, మహి బెజవాడ ఇంకా అనేకమంది ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, కాట్రగడ్డ దయానంద్ వంటి సీనియర్ కథకులు తమ ప్రమేయంతో వీటిని సాఫల్యం వైపు నడిపించనున్నారు. ప్రవేశం ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే.
వివరాలకు: జి.వెంకటకృష్ణ- 89850 34894