‘దొంగ బతుకుల’ ఉచల్యా | There is a great respect for the Indian culture, all lying. | Sakshi
Sakshi News home page

‘దొంగ బతుకుల’ ఉచల్యా

Published Fri, Sep 12 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

‘దొంగ బతుకుల’ ఉచల్యా

‘దొంగ బతుకుల’ ఉచల్యా

‘భారతదేశం నాది... భారతీయులందరూ నా సోదరులు.... నాకు భారతీయ సంస్కృతి మీద ఎంతో గౌరవం ఉంది... ఈ మాటలు, శబ్దాలు అన్నీ అబద్ధం. మేం ఏమీ చేయకపోయినా దొంగతనం మోపి కారణం లేకుండా మమ్మల్ని ఎందుకు కొడతారు? నన్ను కొడతారు. మా అమ్మని కొట్టి ఆమె చీర పట్టుకొని ఇది దొంగతనం చేసిన చీర... విప్పి ఇచ్చేయి అంటూ పోలీసులు ఆమె చేయి పట్టుకుంటారు. మరి భారతదేశం నాది అయినప్పుడు మమ్మల్ని వేరుగా ఎందుకు చూస్తారు? మాకు పని ఎవరూ ఎందుకు ఇవ్వరు? మాకు సూది మోపేటంత భూమి కూడా ఎందుకు దొరకదు? మనం సోదరులం అయితే మాకు దొంగతనాలు చేయాల్సిన గతి ఎందుకు పట్టింది?’... మరాఠి నవల ‘ఉచల్యా’ రచయిత లక్ష్మణ్ గైక్‌వాడ్ ఆవేదన ఇది. ఈ నవల రచయిత సొంత కథ. సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఈ పుస్తకాన్ని వసంత తెలుగులోనికి తెచ్చారు. మరాఠీలో ‘ఉచల్యాలు’ అంటే చిల్లర దొంగతనాలు చేసే వాళ్లని అర్థం. సంచార జాతులకు చెందిన వీళ్లు అనేక కులాలు, ఉపకులాలుగా ఉన్నారు.

వీళ్లని తెలుగులో ‘సంత ముచ్చులు’ అంటారు. ‘ముచ్చులు’ అంటే దొంగలు. ఈ కులాలకి ఒక పేరంటూ లేదు. ఒక ఊరంటూ లేదు. మొత్తం భారతదేశంలో ఈ జాతి వాళ్లకి జాథవ్, గైక్‌వాడ్ అనే రెండే రెండు ఇంటి పేర్లు ఉన్నాయి.
 లక్ష్మణ్ ఎప్పుడు పుట్టాడో ఎక్కడ పుట్టాడో తెలియదు. తెల్సిందల్లా దరిద్రం, ఆకలి, పోలీసులు, తన్నులు. లక్ష్మణ్ వాళ్ల నాన్న దొంగతనాలకు దూరంగా చిల్లర నౌకరీ చేసుకుంటూ కొడుకుని చదివించాలని తపన పడతాడు. కాని తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేని దరిద్రం, చుట్టుపక్కల పరిస్థితులు లక్ష్మణ్‌ని అంతంత మాత్రం చదువులకే పరిమితం చేశాయి. దొంగతనాలు చేయడం ఇష్టం లేక లాటూర్‌లో వెట్టిచాకిరీలు చేయించే సూత్‌గిర్నీ మిల్లులో చేరతాడు. అక్కడ యూనియన్ వాళ్లతో పరిచయాలు, రాజకీయాలు... వీటన్నింటి మధ్య తన జాతి వాళ్ల విముక్తి కోసం ఒక సంఘాన్ని స్థాపించి వాళ్ల గొంతులు నలుగురికీ వినిపించడానికి కృషి చేస్తున్నాడు.

ఇదంతా సమకాలీన కథ.

లక్ష్మణ్ తన కథ ద్వారా మొత్తం ఈ జాతుల వ్యథను మనముందుంచుతాడు. ఊరి చివర విసర్జన స్థలాలలో ఉండే చిన్న చిన్న గుడిసెలే వీళ్ల నివాసం. ఒక్కొక్క గుడిసెలో బోలెడుమంది మనుషులు, వాళ్ల మేకలు, కుక్కలు, వాటి మూత్రం, బయట పంది పిల్లలు.. స్నానాలు చేయడం బట్టలు ఉతుక్కోవడం కల్లో మాటలు. మగపిల్లలకి, ఆడపిల్లలకి తొమ్మిది సంవత్సరాలు రాగానే పోలీసుల దెబ్బలు తట్టుకోవడానికి తల్లిదండ్రులే చావచితకదన్ని తర్ఫీదు ఇస్తారు. అనేకసార్లు సంబంధం లేని దొంగతనాలు కూడా ఒప్పుకోవాలి. జాతర్లు, సంతలు లేనప్పుడు చేల మీద పడతారు. జొన్నలు దొరక్కపోతే ఆకలికి తట్టుకోలేక ఎలుకల్ని, పిల్లుల్ని తింటారు. వీళ్లు ఎంత చీకటిలో ఉంటారంటే కులంలో ఎవరైనా బడికి వెళితే మిగతా వాళ్లందరికీ ‘కలరా’ వస్తుందని నమ్ముతారు.

 ఈ పుస్తకం మన మధ్యలోనే ఉన్న కొన్ని జాతుల హీనాతిహీనమైన జీవితాలకీ నాగరీకుల ఊహకి కూడా అందని నిజాలకీ నిలుటద్దం. పుస్తకం ముగించిన వెంటనే మన వ్యవస్థ మీద మనకే జుగుప్స కలిగినా వీళ్ల గొంతులు విన్పించే లక్ష్మణ్‌లాంటి కొద్దిమందైనా ఉండటం భవిష్యత్తు మీద మనకి ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది.
 
- కృష్ణ్ణమోహన్‌బాబు 9848023384
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement