40 ఏళ్లలో తొలిసారిగా ఓ క్రికెటర్..!
సిడ్నీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. లంచ్ సెషన్ ప్రారంభానికి ముందే సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ కేవలం 78 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వార్నర్ కెరీర్లో ఇది 18వ టెస్టు సెంచరీ కాగా, పాక్‌పై మూడో సెంచరీ. టెస్టులో తొలిరోజు లంచ్ సమయానికే సెంచరీ చేసిన ఐదవ ఆటగాడిగా వార్నర్ అరుదైన ఘనత తనఖాతాలో వేసుకున్నాడు. గతంలో ట్రంపర్(1902), చార్లెస్ మకార్ట్నే(1926), డాన్ బ్రాడ్ మన్(1930), మాజిద్ ఖాన్(1976)లో ఈ ఘనత వహించారు. గత నలబై ఏళ్లలో ఈ ఫీట్ నెలకొల్పిన తొలి ఆటగాడు వార్నర్ కావడం విశేషం.
గత టెస్టులో ఎంసీజీలోనూ పాక్‌పై 143 బంతుల్లో 144 పరుగులు చేసిన వార్నర్.. ఈ టెస్టులోనూ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 95 బంతుల్లో 118.9 స్ట్రైక్ రేట్‌తో ఆడిన వార్నర్ 17 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. వహాబ్ రియాజ్ బౌలింగ్ లో సర్ఫరాజ్ అహ్మద్‌కి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. వార్నర్ మెరుపు ఇన్నింగ్స్ తో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 32 ఓవర్లకే ఆసీస్ 150 పరుగుల మార్క్ చేరుకుంది. ఆ వెంటనే వార్నర్ ఔటయ్యాడు. 40 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది. రెన్షా(52 నాటౌట్), ఖవాజా(4 నాటౌట్) గా ఉన్నారు.