16 ఫోర్లు..11 సిక్సర్లు
సెంచూరియన్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ శుక్రవారం రాత్రి జరిగిన తొలి డే అండ్ నైట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్ డీ కాక్ చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ ను చీల్చి చెండాడిన డీకాక్(178) భారీ సెంచరీ సాధించాడు. 113 బంతులను ఎదుర్కొన్న డీ కాక్ 16 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియా విసిరిన 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో డీకాక్, రస్కోల జోడి బౌండరీ లైనే లక్ష్యంగా విరుచుకుపడింది. క్రమంలోనే రస్కో 45 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 63 పరుగులు చేశాడు. ఈ జోడి తొలి వికెట్ కు 103 బంతుల్లో 145 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి దక్షిణాఫ్రికాను పటిష్ట స్థితికి చేర్చింది. అనంతరం డు ప్లెసిస్(26) ఫర్వాలేదనిపించాడు. ఇక చివర్లో డేవిడ్ మిల్లర్(10నాటౌట్), బెహర్దియన్(5 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేయడంతో దక్షిణాఫ్రికా 36. 2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది.
అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఆసీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 50.0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(40), ఫించ్(33), బెయిలీ(74), హాస్టింగ్స్(51), మిచెల్ మార్ష్(31)లు రాణించారు.