భారత ఆశా‘దీపం | Dipa Karmakar Creates History, First Indian Woman Gymnast to Qualify for Olympics | Sakshi
Sakshi News home page

భారత ఆశా‘దీపం

Published Tue, Apr 19 2016 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

భారత ఆశా‘దీపం

భారత ఆశా‘దీపం

రియో ఒలింపిక్స్‌కు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అర్హత

భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది.
దేశ జిమ్నాస్టిక్స్‌లో కొత్త చరిత్ర ఇది. సగటు క్రీడాభిమాని కలలో కూడా ఊహించని ఘనత ఇది.
అంకితభావం, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని భారత వనిత నిరూపించిన ఘట్టం ఇది.

భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. దేశం నుంచి ఇప్పటివరకూ ఏ మహిళా క్రీడాకారిణి కూడా జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్‌కు వెళ్లలేదు. అంతెందుకు... పురుషుల్లో కూడా 52 సంవత్సరాలుగా ఈ ఈవెంట్‌లో భారత్ నుంచి ప్రాతినిధ్యమే లేదు. ఎంతో వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల్లోని త్రిపుర నుంచి మొక్కవోని దీక్షతో శ్రమిస్తూ వచ్చిన దీప కోట్లాది మంది క్రీడాభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది.

తన అద్వితీయ ఘనతతో అందర్నీ ఆనందడోలికల్లో ముంచెత్తింది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం... త్రిపురలోని అగర్తలాలో జిమ్నాస్టిక్స్ కోచ్ బిశ్వాస్వర్ నంది దగ్గరకు ఓ ఆరేళ్ల చిన్నారిని ఆమె తండ్రి తీసుకుని వచ్చారు. తన కూతురిని జిమ్నాస్ట్‌గా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. నంది ఆ పాపను దగ్గరకి పిలిచారు. ఆమెను పరిశీలించారు. ఆ పాప పాదాలు పూర్తిగా ఫ్లాట్‌గా ఉన్నాయి. దీంతో జిమ్నాస్టిక్స్‌కు ఆ పాప సరిపోదని కోచ్ చెప్పారు. కానీ పాప తండ్రి మాత్రం పట్టు వదల్లేదు. ఎలాగైనా జిమ్నాస్ట్‌గా చేయాలని, అవసరమైతే ఎక్కువ కష్టపడుతుందని చెప్పి కోచ్‌ను ఒప్పించారు. ఆ రోజు ఆ తండ్రికి, ఆ పాపకి, ఆ కోచ్‌కి ఎవరికీ తెలియదు. భారత జిమ్నాస్టిక్స్ చరిత్రను మార్చబోతున్న క్రీడాకారిణి ని తయారు చేయడానికి బీజం వేశామని.

రియో డి జనీరో: ఒకటా.. రెండా.. ఏకంగా 52 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. 1964 తర్వాత మరోసారి ఒలింపిక్స్ క్రీడల్లో భారత జిమ్నాస్ట్ విన్యాసాలను వీక్షించే అవకాశం లభించనుంది. భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. తద్వారా జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్ క్రీడలకు అర్హత పొందిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా దీప కొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల విభాగంలో భారత్ నుంచి ఇప్పటివరకు 11 మంది పాల్గొన్నారు. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో ఇద్దరు, 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో ముగ్గురు, 1964 టోక్యో ఒలింపిక్స్‌లో ఆరుగురు జిమ్నాస్ట్‌లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఇప్పటివరకు భారత్ నుంచి ఒక్క జిమ్నాస్ట్ కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు.

ప్రస్తుతం రియో డి జనీరోలో జరుగుతున్న ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో 22 ఏళ్ల దీప మహిళల వ్యక్తిగత ఆల్‌రౌండ్ (వాల్ట్, అన్‌ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్) విభాగంలో 52.698 పాయింట్లు సాధించింది. ఓవరాల్‌గా 42వ స్థానంలో నిలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వాల్ట్ ఈవెంట్‌లో ఆమె 15.066 పాయింట్లు స్కోరు చేసి సంయుక్తంగా అగ్రస్థానాన్ని సంపాదించింది. ఆ తర్వాత దీపా అన్‌ఈవెన్ బార్స్‌లో 11.700 పాయింట్లు, బీమ్‌లో 13.366 పాయింట్లు, ఫ్లోర్‌లో 12.566 పాయింట్లు సాధించింది. గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్-3లో నిలిచిన వారు నేరుగా రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. ఈ మెగా ఈవెంట్‌లో దీప వాల్ట్ విభాగంలో ఐదో స్థానంలో నిలిచింది. దాంతో క్వాలిఫయింగ్ టెస్ట్ ఈవెంట్ ద్వారా లభించిన అవకాశాన్ని దీప సద్వినియోగం చేసుకొని తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది.

ప్రశంసల వెల్లువ

దీపా కర్మాకర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వెంటనే ఆమెను ప్రభుత్వం ‘టాప్’ స్కీమ్‌లో చేర్చింది. ఈ పథకం కింద ఆమె శిక్షణ కోసం భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) రూ.30 లక్షలు ఇస్తుంది. క్రికెట్ దిగ్గజం సచిన్, కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ సహా పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

 

 సాక్షి క్రీడావిభాగం భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) అగర్తలా కేంద్రంలో దీపా కర్మాకర్ తండ్రి దులాల్ వెయిట్‌లిఫ్టింగ్ కోచ్. దీంతో ఆయనకు క్రీడల పట్ల సహజంగానే ఆసక్తి ఎక్కువ. ఆయన మనసుకు ఎందుకు అనిపించిందో గానీ, దీపను జిమ్నాస్ట్‌ను చేయాలనుకున్నారు. అందుకే ఆరేళ్ల వయసులోనే కోచ్ బిశ్వాస్వర్ నంది దగ్గరకు తీసుకెళ్లారు. అయితే జిమ్నాస్ట్‌లకు పాదాలు ఫ్లాట్‌గా ఉంటే కష్టం కాబట్టి పాపను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని కోచ్ అనుకున్నారు. కానీ దీపను జిమ్నాస్ట్‌ను చేయాలన్న ఆమె తండ్రి తపనను చూసి కోచ్ బిశ్వాస్వర్ పాపకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అయితే ముందు ఆమె పాదాలను సరి చేయాలని నిర్ణయించారు. ‘ఆ వయసులో పాప పాదాలను జిమ్నాస్టిక్స్‌కు పనికొచ్చేలా చేయడం కోసం చాలా కష్టపడ్డాం. పాపం దీప కూడా చాలా కష్టపడేది. దీనికే దాదాపు ఏడాది సమయం పట్టింది’ అని బిశ్వాస్వర్ చెప్పారు. ఇదంతా 1999లో జరిగింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు 2007లో దీప జూనియర్ నేషనల్స్‌లో స్వర్ణం గెలిచింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. 2007 నుంచి ఇప్పటివరకు వివిధ స్థాయిల్లో ఆమె 77 పతకాలు గెలిచింది. ఇందులో ఏకంగా 67 స్వర్ణ పతకాలు ఉండటం అద్భుతమైన విషయం.

 ఆశిష్ కుమార్ స్ఫూర్తిగా...

 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత జిమ్నాస్ట్ ఆశిష్ కుమార్ పతకం గెలిచాడు. ఆ క్రీడల్లో భారత్‌కు జిమ్నాస్టిక్స్‌లో పతకం తేవడం ద్వారా ఆశిష్ చరిత్ర సృష్టించాడు. తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో అప్పుడే పాల్గొన్న దీప ఆశిష్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూసింది. ఆ రోజు నుంచి ఆమె తనకంటూ ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దేశం తరఫున ఎవరూ సాధించని ఘనత సాధించాలనే తపన దీపలో మొదలైంది. ఫలితంగా 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో దీప కాంస్యం సాధించింది. ఆశిష్ తర్వాత కామన్వెల్త్ పతకం గెలిచిన ఘనతను సొంతం చేసుకుంది. ఆ ప్రస్థానం ఇప్పుడు రియో ఒలింపిక్స్ వరకూ సాగింది.

 ఆశావహ దృక్పథం...

 దీపా ప్రతి రోజూ చాలా కష్టపడుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తుంది. మళ్లీ తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 8.30 గంటల వరకు కష్టపడుతుంది. అంటే సుమారుగా రోజూ 7 గంటల పాటు శిక్షణ ఉంటుంది. వాతావరణం, ఇతర సమస్యలు ఏవీ ఈ రోజువారీ దినచర్యను మార్చలేదు. శారీరకంగా జిమ్నాస్టిక్స్ చాలా కష్టం. దీప మానసికంగా కూడా చాలా బలంగా ఉంటుంది. ఆశావహ దృక్పథం ఆమె సొంతం. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో నాలుగో స్థానంలో నిలవడంతో ఆమెకు పతకం రాలేదు. కానీ ఈ ఫలితాన్ని కూడా ఆమె సానుకూలంగానే ఆలోచించింది. ‘స్వర్ణం, రజతం గెలిచినవాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించినవారు. కాంస్యం గెలిచిన అమ్మాయి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచింది. కాబట్టి నాలుగో స్థానంలో నిలవడం అంటే నేను మిగిలిన అందరికంటే మెరుగ్గా ఉన్నట్టు’ అన్న దీప మాటలు చాలు ఆమె ఆత్మవిశ్వాసం స్థాయి, దృక్పథం గురించి చెప్పడానికి.

 ప్రొడునోవాలో చాంపియన్
జిమ్నాస్టిక్స్‌లో అత్యంత ప్రమాదకర విన్యాసం ప్రొడునోవా. పరిగెడుతూ వెళ్లి స్ప్రింగ్ బోర్డు మీద చేతులు పెట్టి గాల్లోకి లేచిన జిమ్నాస్ట్... ఆ తర్వాత గాల్లో మూడు రౌండ్లు తిరిగి కాళ్ల మీద ల్యాండ్ కావాలి. ఇందులో రిస్క్ చాలా ఎక్కువ. అందుకే ఎక్కువ మంది ప్రయత్నించరు. ఒకవేళ పొరపాటున వెనక్కు పడితే వెన్నెముక పనికిరాదు. తల కిందపడితే అక్కడికక్కడ చనిపోవడమే. అయినా దీపా ఈ ఈవెంట్‌లో అద్భుత ప్రతిభ ప్రదర్శించింది. ‘ఇందులో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ రిస్క్ చేయకపోతే ఏమీ సాధించలేం. గత ఏడాది టోక్యోలో తొలిసారి ప్రత్యక్షంగా ప్రొడునోవా చూశాను. పురుష జిమ్నాస్ట్‌లు ఎక్కువ మంది ఉన్నా... ప్రొడునోవా చేసే మహిళల సంఖ్య చాలా తక్కువ. శరీరం బరువు 45 కిలోలు ఉంటే, ప్రొడునోవాలో ల్యాండ్ అయినప్పుడు 90 కిలోల బరువు పడుతుంది. దీనిని బ్యాలన్స్ చేసుకోవడం కీలకం’ అని దీపా తెలిపింది. ప్రొడునోవాలో దీప 15.100 స్కోరు చేసింది. ప్రస్తుతం ఉన్న జిమ్నాస్ట్‌లలో ఇదే ఉత్తమం. ‘రియో’ బెర్త్ దీపకు దక్కడంలో కూడా ఇదే కీలకంగా మారింది. 15.06 స్కోరు చేయడం ద్వారా పోటీ పడిన 14 మందిలో ఉత్తమ పాయింట్లను సాధించడం కలిసొచ్చింది.

ఆ క్షణాన్ని మరువలేను

2014 కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వం అప్పట్లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీనికి సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ‘నా గురించి సచిన్ మాట్లాడుతూ నా పేరును బట్టి మహారాష్ట్ర నుంచి వచ్చానని అనుకున్నారు. అయితే నేను ఈశాన్య రాష్ట్రాల క్రీడాకారిణిని అని చెప్పగానే నన్ను మరింత ప్రశంసించారు. ఆ రోజు సచిన్ మాటలను, ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ఎప్పటికీ మరువలేను’ అని దీప తెలిపింది.

‘చరిత్ర సృష్టించినందుకు దీపకు అభినందనలు. నీ ఘనత ద్వారా దేశంలో యువతకు స్ఫూర్తిగా నిలుస్తావు’ - సచిన్
‘భారత జిమ్నాస్టిక్స్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన దీపకు అభినందనలు. నిన్ను చూసి గర్విస్తున్నాం’   - సోనోవాల్
‘ప్రతి ఒక్కరిలో ఓ తొలి ఘనత ఉంటుంది. ఇలాంటి తొలి ఘనతలు నువ్వు మరిన్ని సాధించాలి’      - విశ్వనాథన్ ఆనంద్
‘ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా ఘనత సాధించినందుకు అభినందనలు’   -సెహ్వాగ్, లక్ష్మణ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement