జీవితకాల అధ్యక్షుడిగా కల్మాడీ
భారత ఒలింపిక్ సంఘం ప్రకటన
చెన్నై: ఢిల్లీ 2010 కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో జరిగిన కుంభకోణంలో ఆయన ప్రధాన నిందితుడు. ఇందులో చోటు చేసుకున్న అవినీతిలో భాగం ఉందని ప్రాథమికంగా తేలడంతో పది నెలల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆయన రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొంటే దేశం పరువు పోతుందని హైకోర్టు ఆయనను అడ్డుకుంది. ఇలాంటి నేపథ్యం ఉన్న సురేశ్ కల్మాడీ ఇప్పుడు మరోసారి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో భాగమవుతున్నారు. కల్మాడీని ‘గౌరవ’ హోదాలో తమ జీవితకాల అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఐఓఏ ప్రకటించింది. కల్మాడీతోపాటు గతంలోనే రద్దయిన భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలాను కూడా అదే హోదాలో నియమించారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.
భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఐఏబీఎఫ్)తో మరోసారి చర్చించిన తర్వాతే కొత్తగా ఏర్పడిన భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ)కు గుర్తింపు ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఐఓఏ అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్ వెల్లడించారు. ఇప్పటికే వివాదాల్లో ఉన్న వేర్వేరు క్రీడా సమాఖ్యలు కోర్టులకెక్కకుండా మూడు నెలల్లో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. లేదంటే ఆటగాళ్లను అంతర్జాతీయ టోర్నీలకు పంపించమని ఆయన హెచ్చరించారు. ఈ వివాదాల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ రజత పతక విజేత సింధును సత్కరించిన ఐఓఏ, రూ. 30 లక్షల నగదు పురస్కారాన్ని అందించింది. సాక్షి మలిక్‌కు రూ. 20 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు కూడా రూ. 15 లక్షలు అందజేశారు.
2021లో ఏపీలో జాతీయ క్రీడలు!
మరోవైపు 2017లో జాతీయ క్రీడలు నిర్వహించాల్సి ఉన్న గోవాకు ఐఓఏ ఆఖరి గడువు ఇచ్చింది. ఇప్పటికి 60 శాతం పనులే జరిగాయని, త్వరలో పూర్తి చేసుకోకపోతే నిర్వాహక హక్కులు తొలగిస్తామని రామచంద్రన్ చెప్పారు. అవసరమైతే నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని కూడా ఆయన అన్నారు. అయితే 2019లో ఛత్తీస్‌గఢ్ తర్వాత 2021లో జాతీయ క్రీడల నిర్వహణకు ఏపీ, ఉత్తరాఖండ్ పోటీ పడుతున్నాయని ఆయన వెల్లడించారు. 2020లో ఆసియా బీచ్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ఈ ఈవెంట్ జరిగే అవకాశం ఉందని కూడా రామచంద్రన్ స్పష్టం చేశారు.