అయ్యో... నర్సింగ్! | Narsingh fails dope test, may miss Olympics | Sakshi
Sakshi News home page

అయ్యో... నర్సింగ్!

Published Mon, Jul 25 2016 2:57 AM | Last Updated on Fri, Sep 28 2018 7:47 PM

అయ్యో... నర్సింగ్! - Sakshi

అయ్యో... నర్సింగ్!

రియో ఒలింపిక్స్‌కు ముందు భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. పతకం తెస్తాడని ఆశించిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో రియో ఒలింపిక్స్‌లో అతను బరిలో దిగే అవకాశాలు సన్నగిల్లాయి. ఒలింపిక్స్ ఎంట్రీల తుది గడువు తేదీ కూడా ముగియడంతో ఈ విభాగంలో భారత ప్రాతినిధ్యం కూడా అనుమానంగా మారింది.
 
* డోపింగ్‌లో దొరికిన భారత రెజ్లర్
* రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేది అనుమానం

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌కు శరాఘాతం. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) డోపింగ్ పరీక్షలో పట్టుబడ్డాడు. ఈనెల 5న హరియాణాలోని సోనేపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్‌కు డోపింగ్ పరీక్ష నిర్వహించారు. అతని నుంచి సేకరించిన నమూనాలో నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లు తేలిందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డెరైక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ప్రకటించారు.

‘నర్సింగ్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. ‘ఎ’ శాంపిల్‌తోపాటు ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గా వచ్చింది. అతని సమక్షంలోనే ‘బి’ శాంపిల్‌ను తెరిచాం. శనివారం ‘నాడా’ క్రమశిక్షణ సంఘం ఎదుట నర్సింగ్ హాజరయ్యాడు. ఈ విషయంపై మరిన్ని నివేదికలు రావాలి. సాధ్యమైనంత తొందరగా ఈ విచారణను ముగిస్తాం. రియో ఒలింపిక్స్‌లో నర్సింగ్ పాల్గొంటాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం’ అని నవీన్ అగర్వాల్ తెలిపారు.
 
సుశీల్‌కు అవకాశం లేదు!
రియో ఒలింపిక్స్‌లో నర్సింగ్ యాదవ్ పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో పోటీ పడాల్సింది. అయితే డోపింగ్ టెస్టులో పట్టుబడటంతో అతను ‘రియో’కు వెళ్లేది అనుమానంగా మారింది. ఒకవేళ నర్సింగ్‌పై వేటు పడితే అతని స్థానంలో మరో భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ‘రియో’ పంపించే అవకాశం లేదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా స్పష్టం చేశారు. ‘ఒలింపిక్ ఎంట్రీల తుది గడువు జులై 18తో ముగిసింది. నర్సింగ్ స్థానాన్ని వేరే రెజ్లర్‌తో భర్తీ చేసే అవకాశం లేదు’ అని ఆయన తెలిపారు.
 
ప్రాతినిధ్యం లేనట్టే..
గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి నర్సింగ్ యాదవ్ రియో బెర్త్ దక్కించుకున్నాడు. అయితే బెర్త్ పొందిన నర్సింగ్ యాదవ్‌తో తనకు ట్రయల్స్ ఏర్పాటు చేయాలని, ఈ ట్రయల్స్‌లో గెలిచిన వారిని రియో ఒలింపిక్స్‌కు పంపించాలని ఇదే విభాగంలో భారత మరో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కోరాడు. కానీ భారత రెజ్లింగ్ సమాఖ్య సుశీల్ అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో సుశీల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఢిల్లీ హైకోర్టు కూడా సుశీల్ వాదనను కొట్టివేసింది. తాజాగా ఎంట్రీల తుది గడువు ముగియడం, నర్సింగ్ డోపింగ్‌లో దొరకడంతో ఈసారి రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల విభాగంలో భారత ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు.
 
మళ్లీ పరీక్షలు నిర్వహించండి...
డోప్ టెస్టులో పట్టుబడ్డ నర్సింగ్ యాదవ్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మద్దతుగా నిలిచింది. ‘గత పదేళ్లలో ఏనాడూ నర్సింగ్ డోపింగ్‌లో దొరకలేదు. అతనిపై ఎవరో కుట్ర పన్నారు’ అని డబ్ల్యూఎఫ్‌ఐ అధికారి ఒకరు అన్నారు. నర్సింగ్ యాదవ్‌కు మళ్లీ తాజాగా డోపింగ్ పరీక్షలు నిర్వహించాలని అతని కోచ్ జగ్‌మల్ సింగ్ కోరారు.

ఈసారీ పాజిటివ్‌గా వస్తే నర్సింగ్ తప్పు చేశాడని అంగీకరిస్తామని అన్నారు. ‘నర్సింగ్ డోపింగ్‌లో దొరికాడన్న వార్త విని షాక్‌కు గురయ్యా. పదేళ్ల వయసు నుంచి అతను తెలుసు. ఎన్నోసార్లు అతను డోపింగ్ పరీక్షల్లో పాల్గొన్నాడు. కానీ ఏనాడూ విఫలం కాలేదు. కావాలనే అతణ్ని ఇరికించారు. ఈ కుట్ర ఎవరు చేశారో నేను చెప్పలేను. వారి పేర్లు చెబితే ఆధారాలు చూపించాలని అంటారు. శిక్షణ సమయంలో నర్సింగ్ తీసుకుంటున్న ఆహారంలో ఎవరో నిషేధిత ఉత్ప్రేరకాలు కలిపారని అనుమానిస్తున్నాం’ అని జగ్‌మల్ తెలిపారు.
 
నర్సింగ్ డోపింగ్ వివాదం అనంతరం సుశీల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గౌరవం అనేది అడిగితే రాదు. కష్టపడి దానిని సాధించాలి’ అని అతను అన్నాడు. ‘ఇదెంతో దురదృష్టకర పరిణామం. ఒలింపిక్స్‌కు మరో 11 రోజులే ఉన్నాయి. ఈ అంశం భారత పతకావకాశాలను ప్రభావితం చేస్తుంది. నర్సింగ్ స్థానంలో సుశీల్‌ను పంపించే విషయంపై రెజ్లింగ్ సమాఖ్య, భారత ఒలింపిక్ సంఘం నుంచి ఎలాంటి సమాచారం లేదు. తుది నిర్ణయం ఎలా ఉన్నా దానిని స్వాగతిస్తాం’ అని సుశీల్ కోచ్ సత్పాల్ సింగ్ అన్నారు.
 
నాపై కుట్ర జరిగింది...
‘రియో ఒలింపిక్స్‌కు నేను వెళ్లకూడదని ఉద్దేశపూర్వకంగా నన్ను ఇరికించారు. ఏనాడూ నేను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకోలేదు. వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి. ఈ అంశంలో భారత ఒలింపిక్ సంఘం నాకు మద్దతుగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను.’    
- నర్సింగ్ యాదవ్

 
‘ఏ క్రీడాకారుడైనా డోపింగ్‌లో పట్టుబడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. డోపింగ్‌లో దొరికిన వారిని ఒలింపిక్స్‌కు పంపించం’    
- రామచంద్రన్, ఐఓఏ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement