ఆఫ్రిది అదుర్స్.. ఫోర్లు, సిక్సర్ల వర్షం
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏడాది తర్వాత పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ షాహిద్ ఆఫ్రిది టి20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. తనదైన శైలిలో విజృభించి సెంచరీ బాదాడు. నాట్‌వెస్ట్ టి20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం రాత్రి డెర్బీషైర్ టీమ్‌తో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆఫ్రిది చెలరేగాడు. హంప్‌షైర్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన పాక్ మాజీ కెప్టెన్ 43 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు.
ఆఫ్రిది సంచలన బ్యాటింగ్‌తో హంప్‌షైర్ 101 పరుగుల భారీ తేడాతో డెర్బీషైర్ జట్టును చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హంప్‌షైర్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన డెర్బీషైర్ 19.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
తాజా ఇన్నింగ్స్‌తో పాత ఆఫ్రిదిని గుర్తు చేశాడు. 1996లో ప్రపంచ చాంపియన్స్ శ్రీలంకతో జరిగిన వన్డేలో 37 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. చాలా ఏళ్ల పాటు ఈ రికార్డు చెక్కుచెదరలేదు. వన్డేల్లో తక్కువ బంతుల్లో శతకం బాదిన ఘనత దాదాపు 18 సంవత్సరాల పాటు ఆఫ్రిది పేరిట ఉంది. 2014లో న్యూజిలాండ్ క్రికెటర్ కోరె ఆండర్సన్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. 398 వన్డలు ఆడిన ఆఫ్రిది 8064 పరుగులు చేశాడు. 395 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్ స్పెషలిస్టుగా ముద్రపడిన అతడు కేవలం 27 టెస్టులు మాత్రమే ఆడి 1716 పరుగులు సాధించాడు. 48 వికెట్లు దక్కించుకున్నాడు.