రాత్రంతా బుజ్జగింపులు.. | AIADMK MLAs from Sasikala camp land in Delhi, to meet President | Sakshi
Sakshi News home page

రాత్రంతా బుజ్జగింపులు..

Published Fri, Feb 10 2017 2:17 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

AIADMK MLAs from Sasikala camp land in Delhi, to meet President

►  బెదిరింపులు  
► 22 మందికి మరీ ప్రత్యేకం
►  మన్నార్‌గుడి నీడలో ఎమ్మెల్యేలు

సాక్షి, చెన్నై: మన్నార్‌గుడి ప్రైవేటు సెక్యూరిటీ నీడలో రాత్రంతా ఎమ్మెల్యేలు గడిపారు. 20 మంది ఎమ్మెల్యేలకు మరీ ప్రత్యేకంగా ఓ స్టార్‌ హోటల్‌లో బస కల్పించారు. ఎమ్మెల్యేలు తన గుప్పెట్లో నుంచి జారిపోకుండా పకడ్బందీ నిఘాతో చిన్నమ్మ శశికళ మద్దతుదారులు వ్యవహరించారు. పన్నీరు తిరుగుబాటుతో సీఎం కావాలన్న ఆశ ఆమడదూరంలో ఆగడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ బలాన్ని చాటుకునేందుకు తీవ్ర ప్రయత్నాల్లో పడ్డారు. బుధవారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం, ఎవ్వరూ జారిపోకుండా ముందస్తు జాగ్రత్తల్లో పడ్డారు. 131 మంది ఎమ్మెల్యేలు తమ వెంటేనని ప్రకటించుకున్న మేరకు కొద్ది రోజుల పాటు వారందర్నీ తమ ఆధీనంలోనే ఉంచుకునే   విధంగా ప్రత్యేక క్యాంప్‌ను చిన్నమ్మ సేన సిద్ధం చేసింది.

అన్నాడీఎంకే కార్యాలయం నుంచి నాలుగు ప్రత్యేక బస్సుల్లో వీరిని క్యాంప్‌నకు తరలించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కో ప్రైవేటు సెక్యూరిటీ నియమించి మరీ క్యాంప్‌నకు తరలించడం గమనార్హం. మొత్తంగా వెయ్యి మంది సెక్యూరిటీని ఏకంగా తన స్వస్థలం మన్నార్‌గుడి నుంచి చిన్నమ్మ రంగంలోకి దించి ఉండడం ఆలోచించ దగ్గ విషయం. అన్నాడీఎంకే కార్యాలయం నుంచి ఓమందూరు ఎస్టేట్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు అందర్నీ తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజులకు తగ్గ బట్టలను తీసుకున్న ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన బస్సుల్లో పయనం అయ్యారు.   ఈసీఆర్‌ రోడ్డు వైపుగా దూసుకెళ్లిన బస్సులను పన్నెండు ప్రైవేటు భద్రతా వాహనాలు అనుసరించాయి. రాత్రి పదకొండున్నర గంటల సమయంలో కల్పాకం కూవత్తూరు గోల్డెన్  ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ రిసార్ట్‌లోకి తొలుత రెండు బస్సులు, అర గంట వ్యవధిలో మరో రెండు బస్సులు ప్రవేశించాయి.

బస్సుల్లో నుంచి దిగిన ఎమ్మెల్యేలందరి నుంచి ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది సెల్‌ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నట్టు, కేవలం కుటుంబీకులతోమాత్రం మాట్లాడేందుకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రిజిస్ట్రేషన్లతో ఉన్న బస్సుల్లో నుంచి దిగిన 22 మందిని మాత్రం ప్రత్యేకంగా ఓ చోట ఉంచి బుజ్జగింపులు, తదుపరి బెదిరింపులతో తమ వైపునకు తిప్పుకునేందుకు మన్నార్‌గుడి సెక్యూరిటీలో ఉన్న కొందరు తీవ్రంగానే ప్రయత్నాలు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ రిసార్ట్‌ హోటల్‌ పరిసరాల్ని మన్నార్‌గుడి సెక్యూరిటీ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాసేపటికి సైరన్లు కల్గిన నాలుగు వాహనాల్లో 22 మంది ఎమ్మెల్యేలను కల్పాకం పూదండల్‌లోని విలేజ్‌ రిసార్ట్‌ హోటల్‌కు తీసుకెళ్లి మరీ వారిని బుజ్జగించినట్టు తెలిసింది. మిగిలిన ఎమ్మెల్యేల్ని ఒక చోట చేర్చి వారికి కావాల్సి విందు ఏర్పాటుతో పాటు, చిన్నమ్మను నమ్ముకుంటే అందరికీ లాభమేనని, లేకుంటే తీవ్రంగా , వ్యక్తిగతంగానూ నష్టపోతారన్నట్టు ఓ వ్యక్తి బెదిరించినట్టు సంకేతాలు వెలువడడంతో ఆ వ్యక్తి ఎవరన్న చర్చ బయలు దేరింది.

శశికళకు మద్దతుగానే ఉంటామని, మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చినట్టు తెలిసింది. అయితే, ఆ 22 మంది ఏ మాత్రం తగ్గనట్టు, చివరకు చిన్నమ్మ సైతం వారితో ఫోన్లో మాట్లాడగా దిగి వచ్చినట్టు తెలిసింది. మన్నార్‌గుడి నుంచి వెయ్యి మంది ప్రైవేటు సెక్యూరిటీ ఆగమేఘాల మీద రంగంలోకి దిగి ఉండడం బట్టి చూస్తే, చిన్నమ్మ వెంట మన్నార్‌గుడి కుటుంబ సభ్యులు మళ్లీ రంగంలోకి దిగి ఉండొచ్చన్న ప్రశ్న బయలు దేరింది. కాగా, బెదిరింపులు, బుజ్జగింపులు, తాయిలాలకు తలొగ్గిన ప్రత్యేక శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు చివరి క్షణంలో ఇచ్చిన హామీని విస్మరించిన పక్షంలో చిన్నమ్మ సీఎం ఆశలన్నీ అడియాశలైనట్టే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement