తమిళనాడులో 48గంటల పాటు రైలురోకో
చెన్నై: తమిళనాడుకు కావేరి జలాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీ డీఎంకే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైలురోకో చేపట్టింది. ప్రతిపక్షనేత, డీఎంకే కోశాధికారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఉదయం చెన్నైలో వివిధ ప్రాంతాల్లో రైలురోకో చేపట్టారు. కావేరి బోర్డు, కమిటీ సాధన లక్ష్యంగా కేంద్రంపై కన్నెర్ర చేస్తూ రైల్వేస్టేషన్ల ముట్టడికి రాజకీయ పక్షాలతో పాటు ప్రజాసంఘాలు, రైలు సంఘాలు యత్నించాయి. 48 గంటల పోరు నినాదంతో రైళ్లను అడ్డుకోవటంతో పాటు రెండువందల చోట రైల్వేస్టేషన్ల ముట్టడికి సిద్ధం అయ్యాయి.
కావేరి అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం మాటమార్చి వ్యవహరిస్తుండటం తమిళనాట ఆగ్రహ జ్వాలలను రగిల్చిన విషయం తెలిసిందే. ప్రతిపక్షం డీఎంకేతో పాటు కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, డీఎండీకేలతో పాటు వర్తక, వాణిజ్య సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.