తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు గవర్నర్ విద్యాసాగర్ రావు అవకాశం ఇచ్చినా లేదా అన్నా డీఎంకే శాసన సభ పక్ష నేతగా శశికళ స్థానంలో ఎన్నికైన పళనిస్వామిని ఆహ్వానించినా.. సభలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేకిత్తిస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో బలాబలాలను పరిశీలిస్తే..
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 235. వీరిలో ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే కాగా 234 మంది నేరుగా ఎన్నికైన వారు. జయలలిత మరణంతో ఓ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడీఎంకేకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు 89 మంది, ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేల బలముంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు చెందిన మరో ఎమ్మెల్యే ఉన్నారు.
మెజార్టీ మార్క్ 117
సభలో మెజార్టీ నిరూపించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అన్నాడీఎంకేకు మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎంతమంది పన్నీరు సెల్వంకు మద్దతు ఇస్తారు? ఎంతమంది పళనిస్వామి వెంట నిలుస్తారు? అన్నది తేలాల్సివుంది. ప్రస్తుతం పన్నీర్ సెల్వం వర్గంలో ఆయనతో కలిసి ప్రస్తుతం పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 225 మంది ఎమ్మెల్యేలు శశికళ వర్గంలో అంటే పళనిస్వామికి మద్దతుగా ఉన్నట్టు చెబుతున్నారు. కాగా శశికళ వర్గం నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు జారుకుంటున్నారు. అన్నాడీఎంకే తమకు ప్రత్యిర్థి పార్టీ అని, తాము మద్దతు ఇవ్వబోమని ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పష్టం చేశారు. డీఎంకేకు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీదీ ఇదే వైఖరి.
ఏం జరగకవచ్చు..?
ఈ నేపథ్యంలో మెజార్టీ మార్క్ 117 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి వెంట నిలుస్తారా లేదా పార్టీ ఎమ్మెల్యేలందరూ తమ వైపు వస్తారని చెబుతున్న పన్నీరు సెల్వం వర్గీయుల మాట నిజమవుతుందా లేదా త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన స్టాలిన్ అన్నంతపనీ చేస్తారా లేదా ఎవరూ మెజార్టీ నిరూపించుకోని పక్షంలో రాష్ట్రపతి పాలన వస్తుందా? అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది.