తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే కొత్త శాసనసభ పక్ష నేతగా పీడబ్ల్యూడీ మంత్రి ఎడపాడి కె పళనిస్వామిని ఎంపిక చేయడంలో ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ వ్యూహం ఏమిటనే ప్రశ్నకు కులం ప్రధాన కారణమనే జవాబు వినిపిస్తోంది. సొంత (తేవర్) కులానికి కాకుండా మరో పెద్ద సామాజిక వర్గానికి (గౌండర్) ప్రాధాన్యం ఇచ్చారనే ‘ఇమేజ్’ సంపాదించడానికి ఆమె ఈ పనిచేశారని భావిస్తున్నారు. తమిళనాడులో జనాభా, రాజకీయ ప్రాతినిధ్యం రీత్యా గౌండర్లు, తేవర్లు, వన్నియార్లు సామాజిక వర్గాల వారు బలమైనవారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, శశికళ ఇద్దరూ తేవర్లే. 234 మంది సభ్యులున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో తేవర్ ఎమ్మెల్యేలే ఎక్కువ. అన్నా డీఎంకేలో మాత్రం గౌండర్లు 28 మంది , తేవర్లు 20 మంది ఎమ్మెల్యేలున్నారు. దివంగత సీఎం జయలలిత, ప్రస్తుతం ఓపీఎస్ కేబినెట్‌లలో తేవర్లకు 9 మంత్రి పదవులు లభించగా, గౌండర్లకు ఐదే దక్కాయి. పాలకపక్షంలో 19 మంది ఎమ్మెల్యేలున్న బీసీ వర్గమైన వన్నియార్లకు కూడా 5 పదవులే లభించాయి. 1967లో డీఎంకే, మళ్లీ 1977లో అన్నాడీఎంకే అధికారంలో వచ్చినప్పటి నుంచీ ఈ రెండు ద్రవిడ పార్టీలు బ్రాహ్మణేతర సీఎంల పాలనలో ప్రధాన కులాల ఆధిపత్యం లేకుండా రాజకీయాలు నడిచాయి. 1991లో జయలలిత తొలిసారి సీఎం అయినప్పటి నుంచీ ఏఐఏడీఎంకే పాలనలో తేవర్లకు కొంత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బ్రాహ్మణేతరులకు సామాజిక న్యాయం, తమిళానికి ప్రాధాన్యం వంటి నినాదాలతో బలమైన ద్రవిడ సైద్ధాంతిక బలం ఉన్న డీఎంకే నేత ఎం.కరుణానిధిని జయలలిత విజయవంతంగా ఎదుర్కోగలిగారు. అనేక కులాలతో బలమైన సామాజిక సంకీర్ణం నిర్మించి ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. కులానికి అతీతంగా ఆమె గట్టి పునాదివర్గాన్ని పార్టీకి ఏర్పాటుచేశారు.
గౌండర్లు గెలిపించారు
ఓటర్లు ప్రతి అయిదేళ్లకూ పాలకపక్షాన్ని మార్చే సంప్రదాయం 1989 నుంచీ బలపడిన తమిళనాట గతేడాది (2016) అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను వరుసగా రెండోసారి గెలిపించారు. స్వల్ప మెజారిటీతో విజయం సాధించడానికి జయలలిత వెనుక పశ్చిమ ప్రాంతం (కొంగునాడు) గట్టిగా నిలబడింది. ఈ ప్రాంతంలోని దాదాపు 50 సీట్లలో అన్నాడీఎంకే కైవసం చేసుకున్న 44 సీట్లే మెజారిటీకి అవసరమైన మేజిక్ ఫిగర్ 118ని దాటి 135 స్థానాలు సాధించడానికి ఇక్కడి ఆధిపత్యవర్గమైన గౌండర్లు తోడ్పడ్డారు.
నమ్మిన తేవర్ తిరుగుబాటు చేశాక గౌండర్!
జయ తర్వాత ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలనే విషయంలో ఒక దశలో గౌండర్ కుటుంబంలో జన్మించిన పళనిస్వామి వైపు మొగ్గుచూపారని, అదే కులానికి చెందిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై పేరును కూడా శశికళ పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. చివరికి గతంలో జయ రెండుసార్లు తన బదులు సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన ఓపీఎస్‌నే శశికళ ఎంపిక చేయడంతో రెండు ప్రధాన పదవులు తేవర్ల చేతుల్లోకి వచ్చాయని వాదన వినిపించింది. తాను కోరినట్టు రెండు నెలలకే రాజీనామా చేసిన ఓపీఎస్ వారం లోపే తిరుగుబాటు చేయడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు శిక్షను ఖరారు చేయడంతో శశికళ వ్యూహం మార్చారు. అసంతృప్తిగా ఉన్న గౌండర్ల మద్దతు పొందడానికి పళనిస్వామిని సీఎం పదవికి ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అన్నా డీఎంకే నిలుస్తుందా?
దాదాపు రెండు దశాబ్దాల క్రితం(1988) ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే చీలిపోయింది. రెండు చీలిక వర్గాలూ ఏడాది తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. 27 సీట్లు గెల్చుకున్న జయలలిత వర్గంలో ఎంజీఆర్ భార్య వీఎన్ జానకి నేతృత్వంలోని పార్టీ విలీనమైంది. ఎంజీఆర్ తర్వాత అంతటి జనాకర్షక నేతగా జయలలిత రుజువు చేసుకుని పార్టీని నిలబెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఏఐఏడీఎంకే మరోసారి చీలిపోతే, జయలలితలా పార్టీ పగ్గాలు చేపట్టి మళ్లీ జనాదరణ సంపాదించే సత్తా ఉన్న నేతలెవరూ రెండు వర్గాల్లో లేరు. శశికళ, ఓపీఎస్, తంబిదురై, పళనిస్వామి, ఇ మధుసూదనన్.. వీరిలో ఎవరికీ అంతటి శక్తియుక్తులు లేవు. చీలిక తర్వాత రెండు వర్గాలు పూర్తిగా దెబ్బతింటే ఆ శూన్యాన్ని మరో కొత్త ద్రవిడ రాజకీయ పార్టీతో పూరించవచ్చని పరిశీకులు భావిస్తున్నారు. గతంలో అన్నాడీఎంకే రెండు చీలిక వర్గాలు, డీఎంకే మధ్య ఓట్లు చీలితే పూర్వ వైభవం సాధించవచ్చని భావించిన కాంగ్రెస్‌కు 1989 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశే ఎదురైంది. ఇప్పుడు కూడా అన్నాడీఎంకే మరోసారి చీలితే బీజేపీకి లబ్ధిపొందే అవకాశాలు తక్కువేనని చెప్పాలి.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)