
శశికళకు మేం మద్దతు ఇవ్వం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశిస్తున్న అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జయలలిత మరణించిన తర్వాత పక్కా వ్యూహంతో అన్నా డీఎంకేను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న శశికళకు.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుగుబాటు చేశాక పరిస్థితులు మారిపోయాయి. తమిళనాడులో ఆమెకు మద్దతు ఇచ్చేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోగా.. పన్నీరు సెల్వానికి మద్దతు ప్రకటించడం చిన్నమ్మను కలవరానికి గురిచేస్తోంది.
ముఖ్యమంత్రి పదవి కోసం పన్నీరు సెల్వంతో పోటీపడుతున్న శశికళకు తాము మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తమ మిత్రపక్షమైన డీఎంకేతో కలసి ఉంటామని స్పష్టం చేసింది. శశికళతో ఉంటామన్న కాంగ్రెస్ నేత తిరువనకరసు వ్యాఖ్యలను ఖండించింది. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా శశికళ వర్గం కోరగా, కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా ఇతర పార్టీలు శశికళను వ్యతిరేకిస్తున్నాయి.