జయ పోరాట యోధురాలు
తమిళ ప్రజలకు సేవలు కొనసాగిస్తారు: కేంద్ర మంత్రి వెంకయ్య
గవర్నర్ విద్యాసాగర్‌రావుతో భేటీ
జయకు ప్రముఖుల పరామర్శ.. అమ్మకు కొనసాగుతున్న చికిత్స
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పోరాట యోధురాలు అని, తమిళనాడు ప్రజలకు ఆమె సేవలు కొనసాగిస్తారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం అపోలో ఆస్పత్రిలో జయ చికిత్స వివరాలు తెలుసుకున్న వెంకయ్యనాయుడు, సోమవారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యతలేదని, మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు.
జయకు జరుగుతున్న చికిత్స గురించి అపోలో డాక్టర్లు తనకు వివరించారని చెప్పారు. జయ ఆరోగ్యంగా తిరిగి వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు మంత్రి వర్గం ప్రభుత్వాన్ని నడుపుతుందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని చెప్పారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విషయంలో జయ పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
ప్రముఖుల పరామర్శ
చికిత్స పొందుతున్న సీఎం జయలలితను పరామర్శించడానికి సోమవారం అపోలో ఆస్పత్రికి పలువురు ప్రముఖులు వచ్చారు. కేరళ గవర్నర్ పి. సదాశివం, ముఖ్యమంత్రి పి. విజయన్ ఆస్పత్రిలో సీఎండీ ప్రతాప్ రెడ్డిని చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. జయకు చికిత్సకు స్పందిస్తున్నారని డాక్టర్లు చెప్పారని మీడియాకు వారు వెల్లడించారు. త్వరలోనే ఆమె డిశ్చార్జి అవుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కూడా ఆస్పత్రికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.
కొనసాగుతున్న చికిత్స..
గత నెల 22న ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స కొనసాగుతోంది. ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ ఖిలానీ రెండు రోజుల నుంచి వైద్య పరీక్షలు నిర్వహించి, పలు సూచనలు చేశారని అపోలో ఆస్పత్రి సీవోవో సుబ్బయ్య విశ్వనాథన్ తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీతిలోనే వైద్యం కొనసాగించాలన్నారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాస, యాంటీబయోటిక్స్‌తో పాటు పాసివ్ ఫిజియోథెరపీ చికిత్స చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, జయ త్వరగా కోలుకోవాలని అన్నాడీఎంకే శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. ధర్మపురి జిల్లాలో యాగం నిర్వహిస్తున్న మంత్రి అన్బళగన్ అకస్మాత్తుగా స్పృహకోల్పోయారు. కొద్దిసేపటికి తేరుకున్నారు.
వదంతులపై ఇద్దరి అరెస్ట్
ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఫేస్‌బుక్‌లో వదంతులు ప్రచారం చేయడంతో నామక్కల్‌కు చెందిన సతీష్‌కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను, మదురైకి చెందిన మాడస్వామి అనే వ్యక్తిని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మరో 43 మందిపై కేసులు నమోదు చేశారు.