జయకు పాసివ్ ఫిజియోథెరపీ!
• లండన్ వైద్యుడి నేతృత్వంలో నిరంతర పర్యవేక్షణ
• హెల్త్ బులెటిన్ విడుదల..
• ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స
• తాత్కాలిక సీఎం లేనట్టే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్థితిపై తొలిసారి అపోలో ఆస్పత్రి భిన్నమైన ప్రకటన వెలువరించింది. ఇన్నాళ్లూ జయ కోలుకుంటున్నారని చెప్పిన వైద్యులు.. శనివారం జయకు జరుగుతున్న చికిత్సను వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో శ్లేష్మ పొరను తొలగించే మందులు వాడుతూ మరింత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని, ఫిజియోథెరపీ ద్వారా ఊపిరి తీసుకునేందుకు సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. ఇంటెన్సివిస్ట్‌ల ఆధ్వర్యంలో సీఎం ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని బులెటిన్లో పేర్కొన్నారు.
ఇంకా చాన్నాళ్లే జయ ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని.. పునరుద్ఘాటించారు. అలాగే వైద్య చికిత్సలో అన్ని రకాల సమగ్ర చర్యల్లో భాగంగా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఊపిరితిత్తుల సమస్య, పాసివ్ (చలనం లేని రోగులకు చేసే) ఫిజియోథెరపీ గురించి బులెటెన్లో పేర్కొనటంపై చర్చ జరుగుతోంది. అంతేగాక జయకు వైద్యం కోసం లండన్ నుంచి వచ్చిన అంతర్జాతీయ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బేల్ చికిత్స పూర్తి చేసి లండన్ వెళ్లిపోయారు. అయితే అపోలో యాజమాన్యం మళ్లీ పిలిపించింది. ప్రస్తుతం ఆయన అపోలోనే జయ ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
జయ ఆధీనంలోని శాఖల పంపకం?
కాగా, జయ స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఎవరుంటారనే విషయంపైనా ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. అన్నాడీఎంకే మాత్రం తాత్కాలిక సీఎం అవసరం లేదని.. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ప్రకటించింది. అయితే.. జయలలిత నిర్వహిస్తున్న కీలకశాఖలను పరిపాలనా సౌలభ్యం కోసం సీనియర్ మంత్రులకు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
అపోలోకు స్టాలిన్, వైగో..: తమిళనాడు విపక్ష నేత స్టాలిన్ శనివారం రాత్రి అపోలో ఆస్పత్రికి వచ్చారు. అరగంటపాటు వైద్యులతో గడిపిన స్టాలిన్.. సీఎం మరి కొంతకాలం వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పడంతోనే ఆస్పత్రికి వచ్చానన్నారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ఉదయం 11 గంటలకు వచ్చి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కావేరీ జలాల కోసం అవిశ్రాంతంగా పోరాడిన సీఎం ఆసుపత్రిలో చేరడం కలచి వేసిందన్నారు. జయ కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
తిరువళ్లూరు జిల్లా సిట్రంబాక్కం గ్రామంలోని శ్రీపచ్చమలై అమ్మయ్యార్ ఆలయంలో 108 మంది కార్యకర్తలు తలనీలాలు సమర్పించి, జయ ఫొటో పెట్టుకుని ప్రార్థనలు చేశారు. కాగా, జయ ఆరోగ్యంపై హెల్త్‌బులెటిన్ వివరాలు మారిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారని భద్రత పెంచారు. అయితే మోదీ పర్యటనపై స్పష్టమైన సమాచారం లేదని.. తమిళనాడు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.