శశికళ కాదు కుట్రకళ
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ధ్వజం
నాపై అసత్య ప్రచారం చేస్తే ఆమె బండారం బయటపెడతా
పన్నీర్‌సెల్వం గూటికి చేరిన పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకునేందుకు శశికళ కపట నాటకం ఆడుతున్నారని తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం ధ్వజమెత్తారు. తనపై అసత్య ప్రచారం చేస్తే శశికళ బండారం బయట పెడతానని హెచ్చరించారు. ఆమె శశికళ కాదు కుట్రకళ అని మండిపడ్డారు. ఆయన గురు వారం చెన్నైలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పార్టీకి తాను ద్రోహం చేశానం టూ విమర్శిస్తున్నారని, ద్రోహి ఎవరో ప్రజల కు, పార్టీ శ్రేణులకు బాగా తెలుసని అన్నారు. పార్టీ ద్రోహులను గతంలో జయలలితే గుర్తిం చారని చెప్పారు. పార్టీ, ప్రభుత్వ పదవులు కోరుకోనంటూ జయలలిత వద్ద లిఖిత పూర్వకంగా క్షమాపణలు కోరిన శశికళ అందు కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబ ట్టారు. పోయెస్ గార్డెన్‌లో తన బంధువులకు స్థానం కల్పించడం ద్వారా జయకు శశికళ ద్రోహం చేశారని పన్నీర్ విమర్శించారు.
స్మారక మందిరంగా వేద నిలయం
పోయెస్‌గార్డెన్‌లో జయలలిత నివసించిన వేద నిలయంను స్మారక మందిరంగా మార్చనున్న ట్లు పన్నీర్‌సెల్వం తెలిపారు. ‘అమ్మ’ వినియో గించిన కారు, అన్నిరకాల వస్తు సామగ్రిని స్మారక మందిరం ఆస్తులుగా పరిగణించ నున్నట్లు చెప్పారు. ‘అమ్మ’ నివసించిన ఇల్లు తమ దృష్టిలో దేవాలయమని పేర్కొన్నారు.
శశికళది రౌడీల కూటమి..
శశికళకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ముద్ర పడిన అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధు సూదనన్ గురువారం మధ్యాహ్నం పన్నీర్ సెల్వం ఇంటికి చేరుకున్నారు. ప్రధాన కార్య దర్శిగా, సీఎంగా బాధ్యతలు చేపట్టాలని శశి కళపై ఒత్తిడి తెచ్చిన ప్రముఖ నేతల్లో ఒకరైన మధుసూదనన్ తాజాగా పన్నీర్‌సెల్వం గూటికి చేరారు. మదుసూధనన్ రాగానే పన్నీర్‌సెల్వం ఎదురేగి స్వాగతం పలికారు. ఆయన రాకతో తమ బలం మరింత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధుసూదనన్ మీడి యాతో మాట్లాడారు.
ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే ఒక కుటుంబం చేతిలోకి వెళ్లకూ డదనే ఉద్దేశంతో పన్నీర్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘శశికళది రౌడీల కూటమి. తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి పార్టీ వెళ్లడం నాకిష్టం లేదు. దివంగత సీఎం జయలలిత విశ్వాసాన్ని పొందిన వ్యక్తి పన్నీర్. జయ మర ణం విషయంలో నాకు అనుమానాలున్నాయి. శశికళను సీఎంగా చూసేందుకు ప్రజలు అంగీ కరించడం లేదు. అన్నాడీఎంకేను కాపాడు కోవాలి. పార్టీ శ్రేణులంతా పన్నీర్‌కు మద్దతు గా నిలవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.
పన్నీర్ ఇంటికి మద్దతుదారుల క్యూ
అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని ప్రకటించి ధీమాగా ఉన్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం ఇంటికి గురువారం పెద్ద సంఖ్యలో మద్దతుదారులు తరలివ చ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పన్నీర్‌ను కలిసేందుకు వస్తు న్నారు. వారందరి పేర్లు, ఫోన్ నంబర్లు తదితర వివరాలను నమోదు చేసుకునేం దుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పన్నీర్‌సెల్వం వెంట ఉన్న ట్లు తెలుస్తోంది. శశికళపై అసంతృప్తితో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు.