తొలి తేజం!
►పశ్చిమానికి చిక్కిన ఛాన్స్
►పళనిస్వామి పగ్గాలు చేపట్టేనా
►ఎదురు చూపుల్లో ఎడపాడి
పశ్చిమ తమిళనాడు నుంచి ఓ రైతు బిడ్డకు సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం దక్కింది. తమ ప్రాంతం నుంచి తొలితేజంగా కే. పళనిస్వామి అన్నాడీఎంకే శాసన సభ పక్ష నేతగా అవతరించడం ఆనందమే. అయితే, ఆనందం శాశ్వతం అయ్యేనా అన్న ఎదురుచూపుల్లో కొంగు మండలంవాసులు పడ్డారు.
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో సేలం, నామక్కల్, ఈరోడ్, ధర్మపురి, కృష్ణ్ణగిరి, కరూర్, కోయంబత్తూరు, తిరుప్పూర్ పశ్చిమ తమిళనాడుగా, కొంగు మండలంగా పిలుస్తుంటారు. ఇక్కడ అన్నాడీఎంకేకు బలం ఎక్కువే. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు అధికారం దూరం కావడంలో ఈ కొంగు మండలం ఓటర్లు కీలక పాత్ర పోషించారు. ఇక్కడ దక్కిన అత్యధిక సీట్లలో గెలుపే అన్నాడీఎంకేకు అధికారాన్ని దగ్గర చేర్చింది. అందుకే కాబోలు ప్రస్తుతం కొంగు మండలంలో ఆనందాన్ని నింపే విధంగా కీలక నిర్ణయాన్ని అన్నాడీఎంకే అధిష్టానం తీసుకుందని చెప్పవచ్చు.
తనకు విధేయుడిగా ఉన్న పళనిస్వామిని అన్నాడీఎంకే తాత్కాళిక ప్రధాన కార్యదర్శి శశికళ అందలం ఎక్కించే నిర్ణయం తీసుకున్నా, తమ ప్రాంతం నుంచి ఓ రాజకీయ తేజానికి సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం దక్కనున్న సమాచారం పశ్చిమ తమిళనాడుకు ఆనందమే. అయితే, ఈ ఆనందం శాశ్వతం అయ్యేనా అన్న ఉత్కంఠతో సర్వత్రా ఎదురు చూపుల్లో ఉన్నారు. అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎడపాడి కే పళనిస్వామి ఎంపికైనా, ఆయనకు సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం దక్కేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు కారణం అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ సమరమే.
కొంగుమండలంలో ఆనందమే : సేలం జిల్లా ఎడపాడి నియోజకవర్గం నెడుంగులం సమీపంలోని శిలవన్ పాళయంకు చెందిన కరుప్ప గౌండర్ రైతు బిడ్డ. ఆయన తనయుడిగా రాజకీయాల్లోకి మూడు దశాబ్దాల క్రితం అడుగు పెట్టిన నాయకుడు కే పళనిస్వామి. దివంగత సీఎం జయలలితకు నమ్మిన బంటుల్లో ఒకరిగా అవతరించారు. జయలలితకు గతంలో ఎదురైన కష్టకాలంలో వెన్నంటి ఉండడం కాదు, ఎడపాడి నియోజకవర్గం నుంచి పలుమార్లు అసెంబ్లీ మెట్లు ఎక్కారు. రాష్ట్ర ప్రజాపనులు, రహదారుల శాఖ మంత్రిగా అమ్మ కేబినెట్‌లోని ఐదుగురు ముఖ్య మంత్రుల్లో ఒకరిగా చోటు దక్కించుకున్నారు.
ప్రస్తుతం అమ్మ మరణం, చిన్నమ్మ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో అన్నాడీఎంకేకు శాసన సభాపక్ష నేతగా ఎంపిక కావడం కొంగు మండలం వాసులు ఆహ్వానిస్తున్నారు. అయితే, ఈ ఆనందాన్ని సంబరాల రూపంలో వ్యక్తం చేయడానికి మాత్రం ముందుకు రాలేదు. ఎడపాడి పళనిస్వామి సైతం తన నియోజకవర్గంలో ఎలాంటి సంబరాలు వద్దంటూ అభిమానులకు సూచించినట్టు సమాచారం. గవర్నర్ తీసుకునే నిర్ణయం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దక్కినప్పుడు సంబరాలు చూసుకుందామన్న ఆయన సూచనతో ఎడపాడి అభిమానులు వెనక్కి తగ్గారు. అయితే, తమ రాజకీయ తేజంకు ఛాన్స్ దక్కుతుందా అన్న ఉత్కంఠ రెట్టింపు కావడంతో కొంగు మండల వాసుల దృష్టి రాజ్‌భవన్ నుంచి వెలువడబోయే ప్రకటన మీద పడింది.