ఒక్క రోజుకే ‘షెడ్డు’కు..!
* రూ. 5 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ బస్సుపై సీఎం అసంతృప్తి
* హరితహారానికి గుర్తుగా ఆకులు, పూల బొమ్మలులేవని పెదవి విరుపు
* పథకాల సీడీ పెట్టినా పనిచేయని సౌండ్‌సిస్టం
* జేసీబీఎల్ కంపెనీ వర్క్‌షాపునకు తరలింపు
* ఖాళీ సీడీ పెట్టారని తేల్చిన అక్కడి ఇంజనీర్లు
* అవగాహన ఉన్న సిబ్బందిని పెట్టాలని సూచన
సాక్షి, హైదరాబాద్: ఎన్నో హంగులు.. ప్రత్యేకతలతో మెర్సిడెస్ బెంజ్ రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఒక్క రోజుకే ‘షెడ్డు’కు చేరింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేసిన ఈ బస్సులోని ఏర్పాట్లపై సీఎం పెదవి విరిచారు. దీంతో వాటిని సరిదిద్దేందుకు ఆర్టీసీ అధికారులు వెంటనే బస్సును.. దాని బాడీ రూపొందించిన జేసీబీఎల్ కంపెనీకి అప్పగించారు. ఫలితంగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బస్సులో కాక తన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లారు.
శుక్రవారం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కేసీఆర్ ఈ బస్సులోనే వెళ్లారు. ఆరోజు ఉదయం యాదాద్రి ఆలయం వద్ద బస్సుకు పూజలు చేయించి తీసుకొచ్చాక ముఖ్యమంత్రి పర్యటన మొదలైంది. ఆ సందర్భంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సీడీని ప్లే చేయగా పాట రాలేదు. అర కిలోమీటర్ దూరం వరకు వినిపించే శక్తివంతమైన సౌండ్ సిస్టం ఏర్పాటు చేసిన బస్సులో సాధారణ సీడీ ప్లే కాకపోవటంతో ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తెలుపు రంగులో ఉన్న బస్సు బాడీపై ఆకుపచ్చ రంగు స్ట్రైప్ ఏర్పాటు చేశారు.
హరితహారానికి సరిపోయేలా ఆ స్ట్రైప్‌పై ఆకులు, పూల బొమ్మలు ఉండాల్సిందని, అవి లేక పేలవంగా ఉందని సీఎం పెదవి విరిచారు. దీంతో ఆర్టీసీ అధికారులు దాన్ని జేసీబీఎల్ వర్క్‌షాపునకు తరలించారు. అయితే బస్సులోని ఆడియో వ్యవస్థ బాగానే ఉందని అక్కడి ఇంజనీర్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో వినియోగించిన సీడీ ఖాళీగా ఉందని, అందులో పాటలు లేకపోవటం వల్లే పనిచేయలేదని గుర్తించారు. బస్సులోని ఆధునిక వ్యవస్థపై అవగాహన లేకపోవటంతో సిబ్బంది సరిగా వ్యవహరించలేదని వారు పేర్కొన్నట్టు తెలిసింది. అవగాహన ఉన్న వ్యక్తిని కొద్దిరోజుల పాటు బస్సులో ఉంచాలని, లేకుంటే కొత్తవారికి దాని వివరాలు తెలియక లోపాలున్నట్టు భ్రమపడే అవకాశం ఉందని చెప్పారు. ఇక బస్సు వెలుపల ఆకుపచ్చ రంగు స్ట్రైప్‌పై పూలు, ఆకుల స్టిక్కర్లను అప్పటికప్పుడు అతికించారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు బస్సును అందజేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.