వారితోనే కోవిడ్‌ ముప్పు.. | COVID 19 Effect From Foreign Tourists Hyderabad | Sakshi
Sakshi News home page

‘వైరస్‌’ మోసుకొస్తున్నారు!

Published Tue, Mar 17 2020 8:11 AM | Last Updated on Tue, Mar 17 2020 8:43 AM

COVID 19 Effect From Foreign Tourists Hyderabad - Sakshi

ఎంజీబీఎస్‌ సమీపంలో మాస్క్‌లతో విదేశీయులు.. ,ఎంజీబీఎస్‌లో మాస్క్‌లతో ప్రయాణికులు

హైదరాబాద్‌ మహా నగరాన్ని కరోనా భయం వీడడం లేదు. తాజాగా ఒక పాజిటివ్‌..19 అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారయంత్రాంగంతో పాటు జనం అలర్ట్‌ అయ్యారు. మాస్క్‌లు ధరిస్తూ.. శానిటైజర్లు వినియోగిస్తూ ఎవరికి వారు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకిందని, ఎయిర్‌పోర్టుల్లో పక్కాగా తనిఖీలు, వైద్య పరీక్షలు జరిపితే ఇక్కడ నివసించే వారికి ముప్పు తప్పుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇక రెండో రోజూ సోమవారం నగరం దాదాపు ‘షట్‌డౌన్‌’ అయింది. దీంతో గ్రేటర్‌లో కరెంట్, పెట్రోలు, డీజిల్‌ వినియోగం భారీగా తగ్గింది. మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రద్దీ తగ్గింది. ఎక్కడా జన సంచారం కన్పించక రహదారులు బోసిపోయి కన్పించాయి.

ఐటీ ఉద్యోగులు ఎక్కువ శాతం ఇంటి నుంచే పనిచేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై జనం ఒకింత కలవరం చెందారు. నాలుగు కేసులు పాజిటివ్‌అని తేలినట్లు ప్రచారం జరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. పారిశుధ్య చర్యలు పకడ్బందీగా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగింది. నిమ్స్, సరోజిని ఆస్పత్రి, గచ్చిబౌలిస్టేడియంలలో ప్రత్యేకంగా కరోనా ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశారు. విదేశీయులను తరలించేందుకు దూలపల్లిఫారెస్ట్‌ అకాడమీలో ఏర్పాట్లు ప్రారంభించారు. పలువురు ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. కరోనా వార్డుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ దూలపల్లి ఫారెస్ట్‌ సమీపంలోని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.మొత్తంగా కరోనా ఎఫెక్ట్‌ గ్రేటర్‌లో భారీగా కన్పించింది.  

సాక్షి, సిటీబ్యూరో: కరోనా బాధిత దేశాల నుంచి పలువురు నగరానికి రాకపోకలు సాగిస్తున్నందు వల్లే నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న అనుమానాలు అధికమవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారికి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్‌ స్కీృనింగ్‌ పరీక్షలు మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. ఆయా దేశాల నుంచి నగరానికి చేరుకోగానే  కొన్ని రోజుల పాటు వ్యక్తిగతంగా ఎవరికి వారే ఇళ్లకే పరిమితం(ఐసోలేట్‌)కావాలని, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేస్తున్నారు. కాగా గత వారం నగరంలో సాధారణం కంటే రెండు డిగ్రీలు..అంటే 31–32 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవడంతో సాధారణ ఫ్లూ, జ్వరం తదితర కేసులు పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం మాత్రం నగరంలో పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. సోమవారం సరాసరిన 34 డిగ్రీల మేర నమోదయ్యాయి. మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు 35–36 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వైరస్‌ ఉధృతంగా వ్యాప్తి చెందే అవకాశాలు లేవని వైద్యనిపుణులు స్పష్టంచేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉంటే చాలంటున్నారు.

ఇండోనేసియా నుంచి వచ్చిన వారిని గాంధీ ఆస్పత్రికి ప్రత్యేక అంబులెన్స్‌లో తీసుకువచ్చిన దృశ్యం

వైరస్‌ మోసుకొస్తున్నారిలా...
నగరంతోపాటు తెలంగాణ జిల్లాలకు చెందిన పలువురు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య అవకాశాల కోసంపలు దేశాల్లో నివసిస్తున్నారు. వీరిలో సింహభాగం తమ పర్యటనలను వాయిదా వేసుకున్నారు. అయితే మరికొందరు అత్యవసర పనులు, వివాహాది శుభకార్యాలు, దగ్గరి బంధువులను కోల్పోవడం తదితర కారణాల రీత్యా నగరానికి వస్తున్నారు. ఇటీవల నగరంలో నమోదైన కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల్లో దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్‌ దేశాల నుంచి సిటీలోకి ప్రవేశించిన వారే ఉన్నారు. అయితే ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో..చైనా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, స్విట్జర్లాండ్, యుకె, నార్వే, నెదర్లాండ్స్, మలేషియా, బెల్జియం తదితరాలున్నాయి. ఈ దేశాల నుంచి నగరంలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ప్రవేశించగానే వారికి కోవిడ్‌ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక ఆయా దేశాల నుంచి వచ్చిన వారు నేరుగా అందరినీ కలవకుండా ఎవరికి వారే తమ ఇళ్లలో సుమారు 14 రోజుల పాటు ఎవరినీ కలవకుండా ఉండాలని..తాము వాడే వస్తువులు ఇతరులు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నగరానికి వస్తున్న వారు వ్యాధి లక్షణాలు పూర్తిగా బయటపడిన తర్వాతనే ఆస్పత్రులను సంప్రదిస్తుండడంతోనే పలు కాలనీల వాసులు బెంబేలెత్తుతున్నారన్నారు. అయితే కోవిడ్‌ ప్రభావిత దేశాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు లోపలే ఉంటాయని..మన వద్ద ఈ వైరస్‌ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో విజృంభించే అవకాశాలు లేవని స్పష్టం చేస్తున్నారు. వ్యాధితో బాధపడుతున్న వారితో దగ్గరగా ఉంటే ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు.

ముందస్తు జాగ్రత్తలే కీలకం
కోవిడ్‌ వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా ఐసోలేట్‌ కావాలి. ఇక వృద్ధులు, చిన్నారులు, రోగులు అప్రమత్తంగా ఉండాలి. మంచి నీరు, ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వైరస్‌ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.– డాక్టర్‌ వసుంధర, కిమ్స్‌ ఆస్పత్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement