అడవి పంది, గొడ్డు మాంసం తినండి
⇒ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు
⇒ ఆరోగ్యంగా ఉండాలంటే మాంసం తినాలి
⇒ బ్రాహ్మణిజం కల్చర్ వచ్చి దానిని బంద్ చేసింది
ఏటూరునాగారం: రోగనిరోధక శక్తి పెరిగి, ఆరోగ్యంగా ఉండాలంటే అడవి పంది, గొడ్డు మాంసం తినాలంటూ జయశంకర్ భూపాల పల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణిజం కల్చర్ వచ్చి మాంసం తినొద్దంటూ బంద్ చేసిందని, అదంతా వృథా అని వ్యాఖ్యానించారు. క్షయ వ్యాధి నివారణ దినం కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ, మానవహారం కార్యక్రమంలో కలెక్టర్ మురళి మాట్లాడారు. ఆరోగ్యంగా ఉండాలంటే మాంసం తినాలని సూచించారు. ‘‘మాంసం ఖరీదు అనుకుంటే పక్కనే అడవులు ఉన్నాయి.
అడవి పందులను పట్టుకుని తినండి. ఎస్సీ, ఎస్టీలు పెద్ద (గొడ్డు) మాంసం తినేవాళ్లం. మధ్యలో మనకు దరిద్రపు బ్రాహ్మణ కల్చర్ ఒకటి వచ్చి పడింది. పెద్ద మాంసం తినొద్దు, అదీ ఇదీ అని చెప్పి బంద్ చేయించారు..’’ అని వ్యాఖ్యానించారు. తాను మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రాత్రి నిద్రలు చేసినప్పుడు అక్కడి ముసిలివాళ్లు మాంసం విషయమై ఫిర్యాదు చేశారని చెప్పారు. తాము గొడ్డు కూర తిన్నప్పుడు ఆరోగ్యం బాగుండేదని.. ఇప్పుడు తమ ఊళ్లలో తిననివ్వడం లేదని, బంద్ చేసినప్పటి నుంచి ఒంట్లో సత్తా లేకుండా పోయిందని చెప్పారని కలెక్టర్ వెల్లడించారు.
ఇక ‘పిచ్చి మాలలు (దీక్షలు) వేసుకుని పంది మాంసం తినడం మానేస్తున్నారని, అది శుద్ధ దండగ అని వ్యాఖ్యానించారు. ఏం తినాలో అది తినాలన్నారు. అడవి పందులను పట్టుకోవచ్చు, వాటిని తినవచ్చని అటవీ శాఖ ప్రకటించిందని.. వాటిని చంపినా నేరం కాదని, ఎలాంటి కేసులు ఉండవని పేర్కొన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు ఈ విషయాన్ని విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అయితే నెమలి, దుప్పి వంటి వన్యప్రాణులను చంపవద్దని, వాటి మాంసం తినవద్దని హెచ్చరించారు. తాను ఒకసారి చైనాకు వెళ్లినప్పుడు కుక్క మాంసం తిన్నానని తన అనుభవాన్ని వివరించారు.
బ్రాహ్మణులు క్షమించాలి: కలెక్టర్
‘‘టీబీ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండా లంటే పౌష్టికాహారం తీసుకోవాలని.. పంది, గొడ్డు మాంసం తినాలని సూచించాను. పేద ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతున్న సందర్భంగా దీక్షలు మానుకోవాలని, బ్రాహ్మణిజం అనే పదాన్ని ఉచ్చరించాను. ఈ విషయంలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిని ఉంటే చింతిస్తున్నాను. ఆ పదం వాడినందుకు క్షమించాలి..’’
– జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి