సాక్షి, హైదరాబాద్ : ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్‌లోని నిమ్స్ కేంద్రంగా పనిచేస్తున్న వ్యాక్సిన్ తయారీ బృందం కీలక దశలోకి అడుగుపెట్టింది. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఇద్దరు వాలంటీర్లుకు సోమవారం తొలి డోస్‌ను ఇచ్చారు. వ్యాక్సిన్ తయారీలో భాగంగా భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)తో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. దేశం వ్యాప్తంగా మొత్తం 12 వైద్య కేంద్రాల్లో వ్సాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు డీసీజీఐ అనుమతి లభించింది. దీంతో క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు ఐసీఎంఆర్ నిమ్స్‌ను ఎంచుకుంది. (నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 నివారణ వ్యాక్సిన్ కోసం భారత్ సహా అగ్రదేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు మానవులపై రెండో దశ ప్రయోగాల్ని కూడా పూర్తి చేశాయి. మరి కొన్ని ప్రయోగ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ కంపెనీ సైతం ముందంజలో ఉంది. భారతదేశంలో దేశీయంగా అభివృద్ది చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ ను సిద్ధం చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment